3927* వ రోజు.......           17-Aug-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

సోమవారం మళ్ళీ (17.8.26) NH 216 సుందరీకరణలే - @3927*!

               అందుకోసం 4:20 కే అక్కడ వేచి ఉన్న వాళ్లు డజను మంది, వాళ్ళతో తరువాత వచ్చి, చేరిననది మరో డజను మంది. ఆ 24 మంది శ్రమ వైభవం మాత్రం

1) కత్తిపూడి - ఒంగోలు రహదారి,

2) గంగులవారిపాలెం వీధులకు వ్యాపించింది!

               మొదటిది పూల మొక్కల శాఖల క్రమబద్ధీకరణ - శుభ్రతలకూ, రెండవది నాలుగైదు 7 ఆకుల మహావృక్ష ఖండన - మండనములకూ పరిమితమైనది!

               అది గాక - చల్లపల్లికొక అద్భుత ప్రవేశమార్గమైన ఉభయ రోడ్ల కూడలి వద్ద కోడూరు, అంబటి, మోతుకూరి సోదరత్రయమూ సందడి - సందడిగా పొలం గట్టు చెట్ల పాదుల కళాత్మక అమరిక కూడ చెప్పుకోదగినదే! (అందులో ఒక పెద్దాయన గట్టిగా ఇంకా కేకేపెట్టలేదేమిటా అనుకొంటుండగానే అది వినిపించింది!)

               రహదారి ఉత్తరపు విరబూసిన పూల చెట్ల కొమ్మల్ని ఆకుల వారు త్రుంచేస్తుంటేనూ, మరో నలుగురాతనికి సూచనలిస్తూంటేనూ నాకు మాత్రం జంధ్యాల పాపయ్య గారి పుష్ప విలాప పద్యాలు గుర్తొచ్చాయి!

               వాళ్ళకు దగ్గర్లోనే ఒక సజ్జా, ఒక పాటల శ్రీనూ పూల - పండ్ల మొక్కలకు ముళ్ల కంప కట్టడం మాత్రం కష్టాన్నీ - నై పుణ్యాన్నీ జోడించిన పనే! ఆ దగ్గర్లోనే ఇద్దరు నర్సులూ, ఒక ట్రస్టు కార్మికుడూ చీపుళ్లకు పని చెప్పి రోడ్ల కూడలిని మరింత శుభ్రం చేస్తున్నారు!

               ఈ పనులకు భిన్నమైనదీ, బరువైనదీ బండ్రేవు కోడు కాల్వ దగ్గర ఠీవిగా నిలిచిన ఐదారు వృక్షాలను ఐదారడుగుల ఎత్తు దాక కూల్చి వేయడమే! ఈ పని ఆ సమీప నివాసుల సౌకర్యార్థమే - వాళ్ల కోరిక మేరకే!

               త్వరలో సదరు గృహస్తులు అక్కడ మామిడి చెట్లు నాటి పెంచేందుకే!

               బృందావన – నరసింహ - శ్రీనివాస – లక్ష్మణ - సాధనాల గట్టి కార్యకర్తలు చెమటలు కారిస్తేనే - ఆ చెట్ల కూల్చివేత, సైజులుగా నరికివేతా, ట్రాక్టరులోనికి చేరవేతా జరిగింది! (దుంగల ముక్కలు ట్రాక్టర్ లో అందంగా పేర్చేప్పుడు - BSNL గారి కాలు బెసికింది గాని – అబ్బే – అతడు దాన్ని లెక్క చేయలేదు!)

               నేటి శ్రమదాన నివేదిక ముగించే ముందు - తుది సమావేశము గురించి :

1) మోతుకూరి మస్తాన్ జీ నినాద ప్రకటన నన్ను బాగా ఆకర్షించింది.

2) DRK గారి సంతృప్తి ప్రకటనను గురించి వేరే చెప్పనక్కరలేదు.

3) 10:00 కు శివరామకృష్ణయ్య గారి సంస్మరణకు వెళ్ళే వారు ఆసుపత్రి వద్దకు చేరుకోవాలనీ,

4) రేపటి శ్రమదానము సైతం NH 216 – గంగులవారిపాలెం జంక్షన్ కడనేననీ తెలిసింది!

               ఆ భాగ్యం తమ దందురు

వీధి డ్రైన్లు బాగుచేసి, వ్యర్ధాలను తుడిచి వేసి,

ఊరి అందచందాలొన గూర్చు కార్యకర్తలే

అదృష్టంగా తలతురు గ్రామస్తులు కొందరు!

ఆ భాగ్యం తమ దందురు స్వచ్ఛ కార్యకర్తలు!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   17.08.2026