3929* వ రోజు..........           19-Aug-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

శ్రావణ బుధవారపు శ్రమ సంగతులు - @3929*

               అనగా పరాభవ నామ శాలివాహనశక – 19.08.2026 - ఆంగ్ల సంవత్సరమన్నమాట! వారాలూ, తేదీలూ, ఋతువులూ వస్తూ పోతూనే ఉన్నాయి. కాని, గ్రామ చరిత్రలో గత 12 ఏళ్లుగా నిలకడగా జరిగిపోతున్నది మాత్రం రోజూ 30-40-50 మంది స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానమే!

               ఈ వేకువ కాలమైనా అంతే! 4.20 కి మొదలై, 6.05 కు ముగిసిన NH216 రహదారిలో తొలి 12 మందితో కలిపి 20 మంది శ్రమిస్తున్నారని అంచనా వేశాను – అది తప్పనీ, మొత్తం 32 మంది బండ్రేవు కోడు కాల్వ ఒడ్డునా, రహదారి ఉత్తరపు దిగువనా పనిచేశారని 6.00 కు గాని తెలియలేదు!

               వాతావరణం ఫరవా లేదు - ఈ సామాజిక శ్రమ జీవులకు సానుకూలంగానే ఉన్నది. వర్షం 2 మార్లు రావాలని ప్రయత్నించి, మధ్యలోనే అగిపోయింది!

               ఒక ప్రక్కన అంబటి - అడపా - కోడూరు - విజయులు హైవే వంతెన దిశగా మళ్లీ మళ్లీ చూడాలనిపించేట్లుగా ఐదారు చెట్ల పాదుల్ని కళాత్మకంగా రూపొందిస్తూ - ఒక గురవయ్య మాత్రం కత్తి పదున్ను పిచ్చి చెట్లకూ, గడ్డికీ రూచి చూపిస్తుండగా –

               X సర్పంచమ్మ గారితో సహా నలుగురు మహిళలు మట్టిని, ఇసుకను రోడ్డు మీద లేకుండా ఊడ్చేస్తుండగా –

               చెట్ల రక్షణగా ఆ పనిలో నిపుణులైన మల్లంపాటి, మాలెంపాటి, సజ్జా, నందేటి వారలు కంపలు అమర్చుచుండగా -

               ఏడెనమండుగురు గంగులవారిపాలెం వీధి సౌందర్యాలకు మెరుగులు దిద్దుతుండగా – 105 నిముషాల పని కాలం కర్పూరంలా కాలిపోయింది!

               తెల్లారాక - లేత వెలుగు కిరణాలలో చూసి తీరాలి – ఆ 150 గజాల బారునా - రెండు ప్రక్కలా చిరుగాలికి కదలుతున్న మొక్కల పూల అందాలను!

               ఇలాంటి దృశ్యాలెన్ని చూసి చెప్పాడో - జాన్ కీట్సు అనే ఆంగ్ల కాల్పనిక కవి! “A thing of beauty is a Joy for ever” అని! అతనికి వంత పాడిన షెల్లీ అనే మరో ఆంగ్ల యువ కవి!

               “నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి...” అని పుష్ప విలాపాన్ని వినిపించిన జంధ్యాల పాపయ్యకూ ఇలాంటి రమణీయ దృశ్యమే ప్రేరణేమో!

               కవిత్వాల సంగతలా ఉంచి - “ఇంతటి  మనోహర దృశ్యం వేల గంటలుగా శ్రమిస్తున్న కార్యకర్తల,1974, 1977 ల నాటి గుంటూరు వైద్య కళాశాల విద్యార్థి బృందాల శ్రమ” అని మాత్రం నాకు గుర్తొస్తున్నది!

               పైడిపాముల కృష్ణకుమారి గారి నినాదాలతోనూ, DRK గారి సమీక్షా వచనాలతోనూ,

               రేపటి శ్రమదానం NH216 కు చెందిన స్వాగతద్వారం నుండి అనే నిర్ణయంతోనూ నేటి కార్యక్రమం ముగింపు!

            ఎవరి దెంత సౌజన్యం?

ఎవరి దోయి సౌభాగ్యం? ఎవరి దెంత సౌజన్యం?

ఎవ్వరసలు ధనవంతులు? వాస్తవముగ ధన్యులెవరు?

ప్రతి గంటకు లక్షలు సముపార్జించే ఘటికులా?

గంటన్నర ఊరి కొరకు కష్టించు కార్యకర్తలా?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   19.08.2026