3930* వ రోజు..........           20-Aug-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

ఆదర్శ శ్రమదానానికి మరొక ఉదాహరణ - @3930*

               సదరు తాజా ఉదాహరణ ఈ గురువారం (20.8.26) వేకువ సమయానిది; 33 మంది కార్యకర్తల + ముగ్గురు ఇతరులు = మొత్తం 36 మందికి ప్రమేయమున్న వీధి సేవలవి; వేకువ 4.20 కే డజను మందితో మొదలై, నిముష క్రమాన తక్కిన వారు పాల్గొని, 6.05 దాక 2 చోట్ల జరిగిన 3 రకాల బాధ్యతలు!

               మరో కోణం నుండి చూసేవాళ్లకు మాత్రం – సమీప గంగులవారిపాలెం వారు ఒక్కరంటే ఒక్కరైనా పాల్గొననివి ఆ బాధ్యతలు! సుమారు 4250* రోజులుగా - 28 వేల జనాభా కల పెద్ద గ్రామంలో మార్పులకై రోజూ 40-50 మంది ప్రయత్నించడం వెలుగుగానూ - ఇప్పటికీ సగం మంది దాన్ని సీరియస్ గా పట్టించుకొనకుండడం చీకటి కోణముగానూ అనుకోవాలి!

               మరి - ఈ ఉషోదయానికి ముందే - ఊరికి దూరంగా 40 పని గంటల పాటు జరిగిన శ్రమదానమేమి?

1) బండ్రేవుకోడు కాల్వ గట్టున మామిడి పళ్ల 3 మొక్కలను ఆ సమీప గృహస్తులు నాటడమూ, మరో మూడో - నాలుగో పూల మొక్కలనూ నాటి, అంతకు ముందక్కడున్న ఆరేడుతో సహా అన్నిటికీ వారు నీరు పోయడమూ,

2) నలుగురు కార్యకర్తలకు అంతవరకూ ఉన్న వంతెన శుభ్రత చాలక - పట్టి పట్టి శుభ్రపరచడమూ,
3) ఎంత శుభ్రంగా ఉన్నా సరే - ఎన్నిమార్లు ఊడ్చినా సరే - ఉభయ రోడ్ల కూడలిలో మళ్ళీ ముగ్గురు ఊడ్చి, ఆకుల్ని తొలగించి, మరింతగా - చూపు త్రిప్పుకోనీయనంత ఆకర్షణీయంగా మార్చడమూ,

4) NH216 ఉత్తరపుటంచున 15 మంది శ్రమానందమూ - ముఖ్యంగా పని హుషారెక్కువైన కోమలానగర్ కార్యకర్త (ఈల వేయడం రాక) చేసిన కేకల సందడీ,

               - శక్తి కొలదీ వీరసింహుల వారు 3+3 నినాదాలు పలికి - 32 మంది చేత పలికించడమూ,

               - తరిగోపుల ప్రాంగణ ముస్తాబు వ్యయం పెరిగిపోవడం గురించి డాక్టర్ల ద్వయం వివరణా,

               - సూటిగా ఇస్తే పోయే దానికి - ఒక జాగ్రత్తపరుడైన కార్యకర్త - అక్కడే ఉండి కూడ - నా ద్వారా 3000/- ట్రస్టు ఖర్చులకు ఇవ్వడమూ,

               రేపటి శ్రమదానం కోసం NH 216 వద్దనే కలవాలనే నిర్ణయమూ....

            అందలమెక్కిస్తుంటే

అంబటి, సజ్జా, ఆకుల... స్వచ్ఛ కార్యకర్తలను

అన్నపూర్ణ - విజయరాణి... లక్ష్మణాది మహిళలనూ

హరిత శుభ్ర సౌందర్యాలందల మెక్కిస్తుంటే 

ఇష్టంగా శ్రమ వేళల చూస్తుంటే నామనసులో

పొగడకుండా విన్నకుండి పోవుటే సమంజసమా?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   20.08.2026