పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!
3931* వ శ్రమానందం పూర్తిగా NH-216 కే సమర్పితం!
ఆ ఆనంద తరంగం శ్రావణ శుక్రవారం (21-8-26 )నాటిది: తొందరపడి మరీ 4.19 AM కే వచ్చిన 13 మందీ + తదుపరి 18 మందీ - వెరసి 31 మందిది; విజిలు మ్రోగిన 6:00 కు కాక - 6.10 కి గాని ఆగనిది!
ఐతే - ఇదేదో బృంద నాట్యానిదో (గ్రూప్ డాన్సు) - విందు భోజానానందనమో కాదు – ముళ్లు గీరుకొంటున్న, అవసరాన్ని బట్టి బురదలో దిగుతున్న, చెమటకు దిగకారే కష్టం సమాజానికి సమర్పిస్తున్న,
రహదారి శుభ్రతనూ - పసిమి మిసిమినీ, పూల సుగంధాన్నీ సాధిస్తున్న 30 మంది ఐచ్ఛిక శ్రమదాతలు 12 ఏళ్ళుగా పొందుతున్న విశిష్టానందం!
పాఠకులు గనుక ఈ వేకువ గంటన్నర సమయపు ఆడియో వీడియోలను గమనిస్తే :
- ఇద్దరు భారీ కార్యకర్తలు తమ వయోధిక్యాన్ని మరచిపోయి, జాతీయ రహదారి ఉత్తరపు పల్లపుటంచున - చీకటిలో పారతో - నక్కుతో నడుము వంచి పనిచేయడం గ్రహిస్తారు!
- ఇంకొక 90 కిలోల భారీ సరీ సృపం (ప్రాకుడు జంతువు - ఇది రికార్డుస్థాయిలో రక్తదాన వ్వసనం కలది!) - నేలబారునా ప్రాకుతూ పూలమొక్క పాదులోని కలుపు తీయడం కూడ తూము వారి ఫొటోలలోనూ లేక DRK గారి వీడియోలోనో చూడవచ్చు!
- కోడూరు వెంకటేశ్వర - శంకర భగవత్పాదులు 12 మొక్కలకు గుడుల లాంటి పాదులు తీస్తే, నరసింహాదులు వాటి చుట్టూ కళాత్మకంగా ముళ్ల కంపలమర్చితే - ఆ అందాల క్రెడిట్ ఎవ్వరిదో నేను తెలుసుకోలేకపోయాను!
-సాధనాల కార్యకర్త పేరుకు కార్పెంటరే గాని, రహదారి కింత సౌందర్యాన్ని సాధించే కళాహృదయముందా - అని కూడ ఆశ్చర్యపడ్డాను!
-ఈ సజ్జా, ఆకుల ప్రసాదులూ, కస్తూరీ - తూములూరీ - నందేటి - జాస్తి-బృందావనాదులూ గ్రామం కోసం జరిగే పనుల్లో ఎందుకంత లీనమైపోతారో తెలుసుకోలేక పోతున్నాను!
-అంత పెద్ద ఆస్పత్రినీ, అందరు పేషెంట్లనూ, 7:00 తర్వాత శస్త్ర చికిత్సలనూ పెట్టుకొని - ఆ ఇద్దరు అగ్రశ్రేణి వైద్యులకు ఈ రహదారి సేవలేమిటా అని అనుమానించాను!
-ఇద్దరు ఆసుపత్రి నర్సులు - చిట్టూరి లక్ష్మి, వెంకటేశ్వరమ్మలకు రహదారిని సుందరీకరించడంలో అంత శ్రద్ధ ఎందుకో అడగడం మర్చిపోయాను.
6:20 దాటాక-
1) ప్రసాద్ వేల్పూరి నామధేయుడు ఆ చెమట బట్టలతోనే స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు ప్రకటించగా
2) పుట్టినరోజు కారణంగా చూపి, దేసు మాధురి ట్రస్టు ఖర్చులకు 1000/- చెల్లించగా,
3) మరో 60 ఏళ్లు ఇలా 1000/- కాక, వీలైతే లక్ష చొప్పున చెల్లించగలగాలని DRK గారు ఆశీర్వదించగా, కార్యకర్తలు హర్షించగా.
4) రేపటి శ్రమకు పద్మావతి ఆసుపత్రి వీధి మలుపు అనువైనదనే నిర్ణయంతో నేటి శ్రమ సౌభాగ్యం రేపటికి వాయిదాపడినది!
అది ఎంతటి సిగ్గు చేటు
మారీచ సుబాహుల వంటి మాయగాళ్ల క్రౌర్యానికి
‘హరిత సుందరీకరణము’ అను యజ్ఞము బలిఐతే
దేశానికి దిక్సూచిగ తేజరిల్లు చల్లపల్లి
అర్ధాంతరముగ ఆగితే అది ఎంతటి సిగ్గు చేటు!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
21.08.2026