పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!
ఇది 3932* వ విడత శ్రమోల్లాసం! (22-8-26)
శనివారం కావడంతో ఆ ఉత్సాహం ప్రదర్శించిన వారు, 38+7 గురు! శ్రమకు రంగస్థలం మాత్రం వారం - పది రోజుల్లాగే - గంగులవారిపాలెం వీధే!
మొదటి 38 సంఖ్య వొళ్ళొంచి కష్టించిన కార్యకర్తలదైతే 7 సంఖ్య ఇతరులది!
“ఆ! క్రొత్తగా ఈయన వ్రాసేదీ, మనం చదివేదీ ఏముంటుంది...ఏ 7-8 మందో చీపుళ్ళు విరిగేట్టు - రోడ్డు అరిగేట్టూ తెగ ఊడ్చారు” అనీ, “ఆ ఆకుల ప్రసాదు, వాసూ , మాధురీ, జాహ్నవీ తదితరులు సుందరీకరణ పేరుతో 20 గద్దగోరు పూలచెట్లనీ, ఆరేడు ఏడాకుల చెట్ల కొమ్మల్నీ మోటారు రంపంతో బుర్ - బుర్ అంటూ మ్రోగించి, ఖండించి, మూలమలుపు వాహన భద్రతకు పాటు బడ్డారు” అనీ -
“ఇదుగో - ఈ 12 మంది మొక్కల పాదుల గడ్డినీ, పిచ్చి మొక్కల్ని తొలగించి, పూల మొక్కల ఎదుగుదలకు దోహదం చేసారు” అనీ
“ఆ BSNL చెట్టెక్కి మరీ పని సాహసం ప్రదర్శించాడు” అనో
“అయ్యో పాపం ఈ ఆడ కూతుళ్ళేమిటీ – చెత్త లోడింగు, గడ్డి గోకుడు, మట్టి పనులేమిటి?” అనో-
“అరె! ఈ పూట సత్తార్ అనే కార్తకర్త తొలిసారి శ్రమదానానికి వచ్చాడే – రేపటి నుండి కూడ మానక వస్తానంటున్నాడే” అనో-
“చూశారా - అసలే అందంగా ఉన్న ఈ చిన్న గంగులవారిపాలెం రోడ్డులో ఈ 200 గజాలు ఎంత శుభ్రంగా ఉన్నదో” అనో
పద్మాభిరామం (= పద్మాలతో అలంకరింపబడినది) గేటు ఎదుట 45 మందీ దేసు మాధురి గబగబా - గట్టిగా చేసిన ప్రతిజ్ఞల్ని బాగా సమర్ధించారనీ, అనంతరం దేసు వారి రుచికర 4 రకాల ఆహారాన్ని ఆస్వాదించారనీ.... “అంతే గదా అనుకొని శ్రద్ధగా చదవక మానొద్దు సుమా!
ఈ చల్లపల్లి శ్రమదానం కొందరనుకొనేట్లు మరీ చర్విత చరణం కాదు, ఎవరికి వారు స్వేచ్చగా – సృజనశీలంగా - గ్రామం పట్ల అంకిత భావంగా చేసేది కనుక 12 ఏళ్లయినా బోరు కొట్టదు!
“రేపు కాస్త పనుందిలే - మానేస్తాలే” అనుకొన్న కార్యకర్తలు ఏదోలా సర్దుబాటు చేసుకొని తప్పక వస్తుండడాన్ని అర్ధం చేసుకోవాలి అందరూ!
DRK గారి మాటల్ని బట్టి రేపటి శ్రమదానం కూడ గంగులవారిపాలెం రోడ్డులోనే జరుగుతుంది!
పాదరసం లాంటివాడె!
ఒక నిపుణత కాదతనిది - ఒక బాధ్యత కాదు తనది
ఆసుపత్రి పనులు సరే - స్వచ్యోద్యమ పాత్ర సరే –
బ్యాంక్ పనుల, టైపు పనుల భారం లెక్కేచేయడు
వైద్య శిబిర బాధ్యతలూ ఆద్యంతం అతనివే
ప్రసాదు వేల్పూరంటే - పాదరసం లాంటివాడె!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
22.08.2026