3934* వ రోజు..........           24-Aug-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

సోమవారం (24-8-26) శ్రమదాన సమాచారం - @3934*

               ఈ రోజు కూడ చక్కటి వర్షమే గాని - అది 4:00AM కు ముందుగానే! - పని సమయంలో మాత్రం చినుకులు పడుతునే ఉన్నా రకరకాల గంగులవారిపాలెం వీధి పనులకు అభ్యంతరకరంగా కాదు. రోడ్డంతా తడిగా - అక్కడక్కడా మడుగుగా, బాట ప్రక్కల బురదగా ఉన్నమాట వాస్తవమే కాని -

               ఈ కార్యకర్తలు నిన్నో - మొన్నో వీధి శుభ్ర - హరిత - సుందరీకరణలు చేపట్టినవారు కాదు - ఏళ్లతరబడీ చేసిచేసి కాకలు తీరిన వారు. వానల్లో ఎలాంటి శ్రమలు చేయాలో - బెట్టలో ఎక్కడ - ఎలాంటి పనులు అనువైనవో వాళ్లకు కాక ఎవరికి తెలుసు?

               ఇందుకే గదా - ఎక్కడెక్కడి ఔత్సాహిక పెద్దలూ, DRK గారు 6.20 వేళ చెప్పినట్లు - కైకలూరు నుండి కామినేని శ్రీనివాసమంత్రి వర్యులూ వాళ్ల ఊళ్లలో ఏ పనులెలా మొదలుపెట్టాలో సంప్రదించేది?

               చాలా గ్రామాలలో భవిష్యత్ స్వచ్ఛ కార్యకర్తల కోరిక -

               “చల్లపల్లిలోని అనుభవజ్ఞులైన కార్యకర్తలు వాళ్ల ఊళ్ళకొచ్చి - ఒకటి రెండు రోజులు ఇలాంటి పనులెలా చేయాలో చూపించి వెళ్ళాలి” అని! నిన్న నా స్వగ్రామం - పల్లపాడు వెళ్లినా, ఆ గ్రామం భవిష్యత్తును ఆలోచించే కొందరి కోరిక కూడ అదే!

               చల్లపల్లి గ్రామంలో శ్రమదాన విజయాన్ని కర్ణాకర్ణిగా వినో, పుస్తకం చూసి తెలుసుకొనో, ముఖ పుస్తకాది మాధ్యమంలో చూసో దేశవ్యాప్తంగా తక్షణాద్రేకానికి లోనయే వారు చాలమందే! కార్యాచరణ దీర్ఘకాలంగా జరిగేది మాత్రం బహు తక్కువగానే!

               ఈ వేకువ 1 గంటా 45 నిముషాలపాటు –

1) ఆకుల - మల్లంపాటి కార్యకర్తల్లా చెట్ల సుందరీకరణ చేయాలన్నా –

2) కోడూరు - అంబటి ద్యయంలా ఒక వీధి భాగాన్ని క్షుణ్ణంగా శుభ్రపరచాలన్నా –

3) కత్తి కదన వీరులు - అడపా, కస్తూరి, గంధం, BSNL తదితరులలాగా - రోడ్డువార గడ్డీ, పిచ్చి మొక్కల ప్రక్షాళన చేయాలన్నా - లక్ష్మణ, నలుకుర్తి కృష్ణకుమారి, నల్లూరి శివాజీల్లాగ తడి రోడ్డును ఊడవాలన్నా ....

4) ఇక చివరికి దైనందిన శ్రమానంతర సభలో DRK డాక్టరులాగా - కార్యకర్తల్ని ఉత్సాహపరచాలన్నా....

5) జోడు కత్తులతో పనిచేసి, ఆలస్యంగా పని ముగించి, నినాదాలను అదరగొట్టి, మంచి ప్రవచనాలను గురవయ్య గారి లాగా వినిపించాలన్నా...

6) రేపటి ఉదయంతో ఈ గంగులవారిపాలెం వీధి పనులు ముగించాలని నిర్ణయించాలన్నా....

                              అన్నిచోట్లా సాధ్యమా?

               ఎంత పెద్ద స్థిత ప్రజ్ఞ!

బ్రతుకులోని ఒడుదుడుకులు వడకట్టిన విజ్ఞత

ఆసుపత్రి బాధ్యతలో అదే ఓర్పు- అదే నేర్పు

శరీర శక్తి హీనతలో స్వచ్ఛోద్యమ మందు పాత్ర!

పెద్ద కృష్ణకుమారిది ఎంత పెద్ద స్థిత ప్రజ్ఞ!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   24.08.2026