3940* వ రోజు....           30-Aug-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

3940* వ - అదివారం నాటి (30-08-26) శ్రమ సమాచారం!

               సదరు శ్రమ కూడ అదే బెజవాడ బాటలో – ఆ NTR పార్కు వద్దనే జరిగెను. ఈ పూటకూడ చిట్టచివరిలో వచ్చిన తోట నాగేశ్వరునితో మొత్తం 50 మంది కార్యకర్తలయ్యిరి! పని వేళ 4:21- 6:04 AM.

               6:15 నుండి10 నిముషాలకు పైగా – దివంగత నందమూరి (NTR) విగ్రహం సాక్షిగా జరిగిన సమావేశమును నందేటి వారే నినాదాలతో ప్రారంభించి, పాటలతో– పద్యాలతో హోరెత్తించిరి! విని తట్టుకోలేక – కొందరు కార్యకర్తలు చప్పట్లతో ఈలలతో ఆనందామోదములు తెలిపిరి.

               అంతటి సంతోషమునకు కారణము ఈ శని- ఆదివారాలలో  మూకుమ్మడిగా శ్రమించి, చల్లపల్లికి ప్రతిష్టాత్మకమగు పార్కును మరింత శుభ్ర- సుందరముగా చేయగలగడమే!

               ఈ వేకువ సమయం మాత్రం అత్యధిక భాగం కార్యకర్తలు పార్కు వెలుపల నడక మిత్రుల వాహన నిలుపుదల ప్రదేశములను మరింతగా శుభ్ర – సుందరీకరణకే వినియోగించిరి, పార్కు లోపల అన్నపూర్ణ-కోడూరు– అంబటి – సాధనాల వంటి కొందరు కార్యకర్తల ప్రయత్నమే జరిగెను!

               బెజవాడ రోడ్డు- పార్కు ప్రహరీల నడుమ స్థలం పెద్దదే గాని, 30 మంది కష్టించుటకూ, డిప్పలు మోస్తూ – మట్టి చదును చేస్తూ – అటు ఇటు తిరుగాడుటకూ చాలకుండెను!

               అందువలన కాంట్రాక్టరు కృష్ణరావు గారి నాయకత్వమున ఐదారుగురు కార్యకర్తలు అక్కడ పడియున్న  రాళ్ల- మట్టి- ఇసుక రద్దును డిప్పలకెత్తి మోసి ఇంధన నిలయము ఎదుట నీటిగుంటలు పూడ్చిరి!    

               నలుగురు స్త్రీ, పురుష శ్రామికులు మాత్రము చీపుళ్ళు ధరించి, ఎగుడు దిగుడు రహదార్ల కూడలిలోని దుమ్మును, ఇసుకను తొలగించి శుభ్రపరుచుటలో కృత కృత్యు లైరి! వచ్చెడి – పోయెడి వాహనముల రద్దీలో వారాపని చేయుట విశేషము!

               “అబ్బో! ఇదొక శ్రమదనమూ దానిని కీర్తించుచూచివరిలో సభా, నందేటి గాయక గానమూ, అవీ చాలక

ఈ విధమున వాట్సప్- ముఖ పుస్తకములందు ఇలా వ్రాసి, ప్రచురించడమూ, పనిలేనివారవి చదివి లైక్లు కొట్టడమూనా?” అని ఎవరూ తేలికగా చూడకుందురుగాక!

               ఈ నిస్వార్ధ శ్రమదానమునూ, ఏ గ్రామమునకైన ఆదర్శప్రాయమగుదాని అంతర్యమును గ్రహింతురు గాక!

               నేటి తుది సమావేశమున-

               1)ఈమధ్యాహ్నము నడకుదురు బాటలోని వడ్లమర వద్ద మెహర్బాబా 61వ వార్షికోత్సవ

సమావేశమునకు వెళ్లుట,

               2) రేపటి వేకువ NTR పార్కులో శ్రమదానమునకు వచ్చుటలు ప్రస్తావించబడినవి!

               హర్డిక సౌజన్యముతో

నాయుడు శ్రీధర్ గారూ, కడియాల సురేశ్ గారూ

యార్లగడ్డ శివ ప్రసాదు – బందా జవహరు గారలు,

స్నేహ, వరుణ్, దిపీకలూ, ఉరిమి శాయి వంటి వారి

హర్డిక సౌజన్యంతో ఈ స్వచ్ఛ- హరిత – చల్లపల్లి!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   30.08.2026