3941* వ రోజు.......           31-Aug-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

4000* వ శ్రమకు 59 అడుగుల దూరంలో నేటి శ్రమదానం!

               ఈ పూట (సోమవారం – ఆగస్టు మాసాంతం) కూడా NTR పార్కు లోపలా, బైటే కొన్ని నగిషీ పనులు జరిపిన స్వచ్ఛ కార్యకర్తలు + వాకర్సు - సోమవారమైనందునేమో – 47 కు పరిమితమయ్యారు.

               స్వచ్ఛ కార్తకర్తలు సరే - వాళ్ళు 10-12 ఏళ్ళ నాడే అంకితులైపోయారు - ఈ ఊరిని మనోహరంగా మార్చాలనీ, పర్యావరణాన్ని రిపేరు చేయాలనీ, తమ శ్రమదానంతో - ధనదానంతో ఎప్పటికైనా 28 వేల మంది ప్రజలకూ ఒక ఆనంద – ఆరోగ్య – స్వచ్ఛ - శుభ్ర హరిత చల్లపల్లిని కానుకగా ఇవ్వాలనీ!

               ప్రతి వేకువ సుమారుగా గంటన్నర సమయంలో వాళ్ళ పనుల్నీ, సందడినీ, ఉద్దేశ్యాన్నీ గ్రహించిన వారెవరైనా కొన్నాళ్లకు స్వచ్ఛ కార్యకర్తలుగా మారే అవకాశమున్నది. మరి అలాంటిది, చైతన్యవంతులైన NTR పార్కు నడక సంఘం వారు గత 3 రోజులుగా తమ పార్కు సుందరీకరణకు దూరంగా చేతులు ముడుచుకొని దాక్కుంటారా?

               ఈ వేకువ 4:22 6:12 ల నడుమ జరిగిన రకరకాల పనుల్లో నడక మిత్రుల పాత్ర స్పష్టంగా కనిపించింది. వాళ్లు ప్రాత కార్యకర్తలతో కలిసి - పార్కు అంతర్భాగాన చిన్నారుల జిమ్ దగ్గర

               - ఎగుడు దిగుడు మట్టిని పారలతో చెక్కి, చదును చేశారు.

               - మట్టి డిప్పలు మోశారు.

               - అందానికి అడ్దొస్తున్న గడ్డిని చెక్కేశారు.

               - ఇందులో మహిళల ఉత్సాహమూ సరిపడా ఉన్నది.

               - 30 మంది ప్రయత్నం పూర్తి కావడం కోసమే - DRK గారు పని ముగింపును 6.12 దాక పొడిగించారు.

               పార్కు వెలుపల మాత్రం ప్రాత కార్యకర్తల హవా నడిచింది. నిన్నటి శుభ్ర - సుందరీకరణనే ఇంకా విస్తరించారు.

               మొత్తం మీద ఈ 3 రోజుల పార్కు ప్రాంత శ్రమదానం చూస్తే కొందరు క్రొత్త కార్యకర్తలు చల్లపల్లికి లభించే అవకాశం కనిపిస్తున్నది!

               నేటి తుది సమావేశాన్ని - NTR తెలుగుమాగాణ సమారాధన దిమ్మె వద్ద తన నినాదాలతో ప్రారంభించినది గ్రామ ప్రముఖుడు ముమ్మనేని నాని గారైతే - స్వచ్ఛ కార్యకర్తల కృషిని ఆయన కొనియాడిన పిదప –

               తన సంతృప్తిని ప్రకటిస్తూ సమీక్షించినది DRK డాక్టరు గారు,

               4 నెలల విరామం అనంతరం తన పునరాగమనాన్ని 10,000/- చందా చెక్కుతో చాటి చెప్పినది శంకర శాస్త్రి గారు,

               ఈ ఉదయం 9 గంటల ప్లాస్టిక్ నిర్మూలనా ప్రదర్శనమూ, సాయంత్రం 5.00 కు S.P. గారి సభకూ ఆహ్వానించినది మాధవేంద్రరావు గారు,

               రేపటి వేకువ మన శ్రమదానం NH-216 వద్దనని తెలిసింది!

               ఒక్క అమెరికా సురేశుడు

ఇంకొక పుష్కరకాలము ఈ సేవలు కొనసాగి,

చల్లపల్లి ఉదాహరణ జగతికి దక్కాలంటే –

స్వచ్చోద్యమ సారధులకు, శ్రమదాతల కందరికీ

ఒక్క అమెరికా సురేశుడున్నచాలు అండగా!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   31.08.2026