పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!
బుధవారం 3943* వ ఆనందోత్సాహాల శ్రమహేల!
2.9.26 నాటి శ్రామికులు 30 మంది; వారి కష్టంతో పరిశుభ్ర - సుందరంగా మారిన 150 గజాల చోటు గంగులవారిపాలం బాట మలుపు నుండి తూర్పు దిక్కుగా,
సమయం ఎప్పటిలాగే వేకువ 4.20 - 6.06 ల మధ్యనే, వీధి కాలుష్యం మీద తొలి వేటు 13 మందిది. అలాగని - మలి 17 గురి శ్రమానందము తక్కువని కాదు - వరుస క్రమంలో గుర్తు చేస్తా చూడండి –
- “నిన్నటి వీధి భాగాన్నే మళ్లీ మరింత పట్టుదలగా చీపుళ్ల పని వారు ఎందుకిలా చేస్తుంటారు?” అనే సందేహానికి కారణం – మళ్ళీ ఈ పూట గడ్డి కోత యంత్ర ప్రయోక్త లేవగొట్టిన దుమ్మూ - ఇసుకా - గడ్డిపొడీ పడడం వల్లనట!
- “రోడ్డు సరే - ఉత్తరపు దిగువన 11 మంది మరీ అంత క్షుణ్ణంగా - అద్దంలాగా శుభ్రపరచడమేమిటి?” అనే ప్రశ్నకు నందేటి శ్రీను సమాధానం:
“ఏంచేస్తాం! ఏళ్ళ తరబడీ వాళ్ళ స్వచ్ఛ - శుభ్రతల వ్యసనం ముదిరిపోతుంటే?” అని
- అసలే చీకటి వేళ - పైన కాస్తంత వెన్నెల వెలుగు ఉన్నా – రెస్క్యూ బృందం!
“బండ్రేవు కోడు కాల్వ అంచున గుబురు తీగల్నీ, పిచ్చి చెట్లనీ నరకడం అవసరమా?” అని అడిగితే - “ఆ గడ్డీ - చెత్త ఉంటే మామిడి చెట్ల పెరుగుదల ఉండదు మరి!” అని వాళ్ల జవాబు!
- అసలివన్నీ వద్దు – ఈ ఉషోదయాన కార్యకర్తల్లో ఎవర్నయినా అడిగి చూడండి – “12 ఏళ్లు కష్టపడ్డారు గదా, వయస్సులు పైబడిపోతున్నాయి గదా - ఇక శ్రమదానం మాని, విశ్రాంతి తీసుకోండి” అని! ఈ ప్రశ్నకు కొందరు బాధపడతారు, నిజంగానే ఈ వేకువ గ్రామ బాధ్యతలు ఆగిపోతాయేమోనని కొందరు భయపడతారు, వాళ్ల రక్తంలో జీర్ణిచుకుపోయిన ఈ శ్రమ వేడుకను బహుశా ఎవ్వరూ ఆపలేరనుకొంటా!
6:20 వేళ పొలంలోజరిగిన సమావేశాన్నొక్కమారు పరిశీలించండి - అందరి ముఖాల్లో కొట్టొచ్చినట్లు ఆ సంతోషమేమంటే - ఈ పూట ఊరి టీ - కాఫీ దుకాణాలన్నీ చూసి వచ్చిన DRK మహాశయుడు “ఎక్కడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ల జాడే కనపడలేదు - గాజు గ్లాసులు తప్ప” అనే వార్త వినిపించడమే ఆ ఆనందకారణం!
కస్తూరి శ్రీనివాస ప్రకటిత త్రివిధ నినాదాలతో ప్రారంభమైన సభ -
- శివబాబు గారి అపార్ట్ మెంటు వద్ద మధ్యాహ్న భోజనాలు గుర్తు చేసి,
- రేపటి వీధి సేవలు సైతం గంగులవారిపాలెం వీధి యందే అనే నిర్ణయంతో ముగిసింది!
అమెరికాలొ - కనెక్టికట్ పట్టణమున
అత డుండేదమెరికాలొ- కనెక్టికట్ పట్టణమున
ఉద్యోగము చిన్న పనే - ప్రతి సేవకు సిద్ధమతడు
ప్రతి నిముషము చల్లపల్లి శ్రమదానమే అతని శ్వాస
కార్యకర్తలందరి సంక్షేమములే అతని ధ్యాస!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
02.09.2026