3945* వ రోజు.......           04-Sep-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

ఇదిగో – 3945* వ శ్రమదానం [4.9.26 – శుక్రవారం]

               సదరు శ్రమ స్థలం బండ్రేవు కోడు వంతెన ప్రాంతం; సామాజిక కర్తవ్యం కదలించగా వేకువ 4.20 కే బాధ్యత తీర్చుకొనేందుకు 12 మందీ, తరువాత ఒకరిద్దరు ముగ్గురు చొప్పున – నాతో సహా 19 మందీ - వెరసి 31 మంది పారిశుద్ధ్య పనితనాలు ప్రదర్శితమైనది అక్కడికి పడమరగా సుమారు 100 గజాల చల్లపల్లి గ్రామ ప్రవేశక గంగులవారిపాలెం వీధి భాగం!

               నిన్న రాత్రి చెప్పుకోదగ్గ వర్షం పడి, ఈ వేకువకు కూడ తడి ఆరని బురద చోటులోనే సగం మంది కార్యకర్తలు పనిచేశారు. ముఖ్యంగా బాట ఉత్తరపు పొలం వైపు ఏటవాలు చోటులోని గడ్డీ - పిచ్చి మొక్కల పని బట్టుతూ కాళ్లు జారకుండ బ్యాలెన్స్ చేసుకోవటమూ గమనించాను!

               నిన్నటి వర్షాన్ని మించి వీచిన గాలికి చెట్ల ఆకులు నిన్నా - మొన్నా శుభ్రపరచిన రోడ్డు మీద పరచుకొంటే - మళ్లీ ఆ చోటునే ఓర్పుగా ఊడుస్తున్న బాధ్యతనీ గుర్తించాను!

               తమ ఇళ్ళకూ, ఊరికీ దూరంగా ఏదో ఒక రోడ్డు ప్రక్క చెట్లు వంకరగా పెరుగుతుంటే - అందంగా కత్తిరించే వీళ్ల ప్రయత్నమేమిటా అనీ ఆలోచించాను!

               పన్నెండేళ్ల సుదీర్ఘ గ్రామ బాధ్యతా నిర్వహణలో ఇన్ని నేపధ్యాల వ్యక్తుల ఇంత అభినివేశమేమిటా అనీ ఆశ్చర్యపోతుంటాను!

               “ఇన్ని వేల రోజులు ఊరి మేలుకై పనిచేసీ - చేసీ అలసిపోయాను - ఇంకా వేలాది గ్రామస్తులు దీన్ని పట్టించుకోరు - నేను కూడ ఈ పని ఆపి, విశ్రాంతి తీసుకొంటాను” అని ఏ కార్యకర్తా అనుకోనందుకూ,  సంతసించాను -

               పని వేళ కొందరు కార్యకర్తలు

1) ప్రభుత్వం ఇన్నేళ్ళ తర్వాత సింగిల్ - యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పట్టుదలగా అమలు చేస్తున్నందుకూ,

2) నిన్న సాయంత్రం మంచి వర్షం చల్లపల్లి ప్రాంతపు వ్యవసాయాన్ని బ్రతికించినందుకూ సంతోషిస్తుండడం గ్రహించాను!

               ఆఖరున - కాఫీ కబుర్ల పిదప - మురుగు కాల్వ వంతెన ప్రక్కన అందరూ “శంకర కంటి చూపుల” సంస్థ యజమాని ‘వీర’ ననుసరించి ఉత్సాహంగా నినాదాలు చేయడమూ,

               ఈ గంటన్నర శ్రమదానమును DRK గారు సమీక్షించడమూ,

               రేపటి మన కలయిక ఇదే బండ్రేవు కోడు కాల్వ వంతెన వద్దనే అనే విషయమూ తెలుసుకొన్నాను!

               “అది ఏదో కొందరి పని”

చల్లపల్లి శ్రమోద్యమము సరిగా చూడని కొందరు

దాని లోతు, అంతర్యం దర్శింపగ జాలరు

ఆ ప్రణాళికను, నిర్వహణను ఆకళించు కొనలేరు

“అది ఏదో కొందరి పని” అని భావిస్తున్నారు!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   04.09.2026