3946* వ రోజు.......           05-Sep-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

శనివారం నాటి వీధి పారిశుద్ధ్య ప్రయాణం! @3946*

               సదరు ప్రయత్న సాఫల్యం వేకువ 19 మందితో ప్రారంభమై, తరువాత వచ్చిన 14 మందితో బలం 33 కు చేరి, చివరలో మరో ముగ్గురు (కార్యకర్తలు కారు) వేరే పని మీద వచ్చి కలిసి  6.10 దాక పనులు జరిగి, మొత్తం 36 మందితో తుది సభ జరిగింది.

               ఆ గంటా 50 నిముషాల సమయంలో 30 మందీ బండ్రేవుకోడు వంతెన కేంద్రంగా 200 గజాల గంగులవారిపాలెం బాటలో:

     కొందరు రోడ్డు మారామత్తులు చేసి, ఎక్కువ మంది సుందరీకరణకు పూనుకొని, ప్లాస్టిక్ వస్తువుల్ని ఏరేసి, మురుగు కాల్వ దక్షిణపు గట్టు మీద మితిమీరి పెరుగుతున్న చెట్ల కొమ్మల్ని అదుపు చేసి, వంతెన తూర్పు బాటను క్రమ్మేసిన గడ్డీ, పనికిమాలిన మొక్కలూ  తొలగించి,

               మరో 12 మంది NH216 కూ వంతెనకూ నడిమి బాట అందచందాలకు కష్టించిన విషయాలను 28 వేల మంది గ్రామస్తులలో 10% మందైనా తెలుసుకొన్నారా? అని నా ప్రశ్న!

               మనం అద్భుతమని వర్ణించుకొనే 80-100 ఏళ్ల నాటి దేశస్వాతంత్ర్యోద్యమంలో కూడ సుమారు 15 శాతం మందే పాల్గొన్నారనీ, ఇంకో 15% ప్రజలు వ్యతిరేకించారనీ, మిగిలిన 70 శాతం ప్రజలు అమాయక తటస్త భయస్తులనీ తెలుసుకొంటే –

               విశాల ప్రజానీకపు మనుగడకు పనికొచ్చే ఏ మంచి ఉద్యమం గతైనా అంతేనని గ్రహిస్తే –

               ఈ గ్రామ స్వచ్ఛ - శుభ్ర సుందరోద్యమానికి సగం మంది గ్రామస్తులే సహకరించడాన్ని అర్థం చేసుకోవచ్చు! స్వచ్ఛోద్యమ కారులెవరికీ నైరాశ్యం అక్కరలేదు!

               దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పులూ, ఆలసంగానైనా ప్రజా ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అడ్డుకోవడంలో ఎదురయ్యే సమస్యలూ ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర! (పరస్పరం సంఘర్షించిన శక్తులతోచరిత్ర పుట్టును – శ్రీశ్రీ) ప్రభుత్వ - న్యాయస్థానాలకు జై కొడుతున్న ఈ 30 మంది గ్రామ సేవకులకూ, అభివందనలు!

               నేటి చల్లపల్లి సముచిత వీధి సేవలను ప్రస్తుతించినదీ, గ్రామంలో గత 4 రోజుల్లో వస్తున్న మార్పుల్ని ప్రస్తావించినదీ డి.ఆర్.కె. డాక్టరు గారు! ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ మాటాడినది భోగాది వాసు గారు! “ప్లాస్టిక్ రహిత చల్లపల్లికి” జై కొట్టించినది నల్లూరి రామారావు అనే నేను!

      ఉపాధ్యాయ దినోత్సవ ప్రాధాన్యతనూ, సర్వేపల్లి రాధాకృష్ణుల గొప్పతనాన్ని ప్రస్తావించినది అడపా గురవయ్య గారు!

               రేపటి వేకువ కార్యక్రమం NH216 + గంగులవారిపాలెం బాటల కడనే - అనే నిర్ణయం కార్యకర్తలందరిదీ!

      చల్లపల్లి మీ ఋణమును తీర్చలేదు!

అలవోకగా గ్రామ సేవ లాచించు ధీరులార!

మురుగు లెన్నొ తోడి తోడి మురియు కార్యకర్తలార!

రహదార్లను అందగించి రాటు దేలు మిత్రులార!

ఎన్నటికీ చల్లపల్లి మీ ఋణమును తీర్చలేదు!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   05.09.2026