3948* వ రోజు.......           07-Sep-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

27 మందితో ముగిసిన రహదారి సేవలు! - @3948*

               సోమవారం (7-9-26) వేకువ 4:21- 6:04 నడుమ గంగులవారిపాలెం బాటలోని 150 గజాల భాగంలో గత10 రోజుల శ్రమదానం ఈ ఉదయం ఒక కొలిక్కి వచ్చింది. అందులో 3  రోజుల పాటు ఈ 200 గజాల రోడ్డు స్వచ్ఛ - శుభ్ర - హరిత సుందరీకరణమే ప్రధాన వ్యాపకం!

               ఏ వీధి నెలా అందంగా, సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా మార్చాలో స్వచ్ఛ కార్యకర్తల వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉంటుంది! వాళ్లకు మనం సూచనలివ్వడమంటే - చేపలకు ఈత నేర్పడమే!

               ఈ 10 పని దినాలలో కిలోమీటరు బారున్న ఈ అందమైన గంగులవారిపాలెం బాట ఎంత పొందికగా, సౌందర్యలాలసులకు కనువిందుగా మారినదీ తెలియడం లేదా? మురుగు కాలువ లోతట్టునా, పొలాల అంచునా, వంగి - దూరి చేసిన కత్తుల పనుల, కొమ్మల కత్తిరింపుల, చీపుళ్ల ఊడుపుల, కలుపు తీతల కాయకష్టం వృధా పోతుందా మరి!

               కాకపోతే – ఈ దారిన వచ్చే పోయే గ్రామస్తులూ, దూర ప్రాంత బాటసారులూ చేయవలసిందొకటున్నది - ఈ లక్షల కొద్దీ రంగురంగు పూల, కంటికింపైన పచ్చదనాల, చిన్నదైనా అందమైన ఈ వీధి సౌందర్యాలను కన్నార్పక చూడవచ్చు –

               మరి - చేయ తగని పనులు 2! పూలను త్రెంచకుండడమూ, పూల మొక్కల చోరీకి దిగకపోవడమూ!

               పది పని దినాల - మొత్తంగా సుమారు 400 శ్రమదాతల - ఐదారు వందల పనిగంటల కష్టాన్ని – నెల తిరగకముందే మళ్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లతో నింపకుండడం!

               పౌర బాధ్యతకొక ఉదాహరణ నా అనుభవంలోనిది:

               2008 లో U.S.A. లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తక్కువ వర్షపాతం వలన ఆ ప్రభుత్వం 10% నీటి వాడకం తగ్గించుకోవాలని కోరిన వెంటనే ప్రజలు దాన్ని ఖచ్చితంగా పాటించడం!

               మరి – ఒక ట్రైనీ కలెక్టరు చల్లపల్లిలో ప్లాస్టిక్ ల నిషేధాన్ని అమలు చేయాలని చూస్తుంటే కొందరి స్పందన ఎలా ఉన్నదీ చూస్తున్నాం!

               ఈ సంఘటన పట్ల విచారాన్నే 6.20 పిదప తుది సమావేశంలో భోగాది వాసు, Dr. DRK వెలిబుచ్చారు. నర్సు వెంకటేశ్వరమ్మ ఆ సభను తన నినాదాలతో ప్రారంభించారు. వీరసింహుల వారు స్టార్ పళ్ళను అందరికీ పంచారు.

               రేపటి మన వేకువ వీధి బాధ్యతలు బందరు రోడ్డులోని గస్తీ గది వద్ద జరగాలని నిర్ణయించారు!

               ఈ పది మండలాలలో

ఈ పది మండలాలలో ఎవరెరుగని ఉద్యమమిది?

ముప్పై - నలభై ఊళ్లలొ మొదలై ఆగినదెందుకు?

పెద్ద పెద్ద వాళ్ళెందుకు  శ్రద్ధ చూపరీ పనులకు?

వస్తే ఆరోగ్యమె కద - పోయే దనారోగ్యమె కద!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   07.09.2026