3951* వ రోజు.......           10-Sep-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

 
మరొకమారు బందరు రహదారి పైనే పారిశుద్ధ్య ప్రయత్నం- @3951*
 
ఈ గురువారం (10.09.2026) వేకువ 4.21 కే రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద కాలుష్యంపై పోరుకు సై అన్నవారు 11 మంది. క్రమంగా వారితో చేతులు కలిపిన వారు ఇంకొక 21 మంది.
 
       కాలుష్యంపై ఈ యుద్ధంలో ఈ సైనికులునిరాయుధులు కారు - కొందరు కత్తులూ, ఐదారుగురు చీపుళ్లు ఇంకొందరి చేతిలో డిప్పలు కనిపిస్తున్నాయి. 
 
6:02 వరకు జరిగిన ఈ యుద్ధం మునసబు వీధి దాకా వెళుతుందనకున్నాను కానీ ఇద్దరు విలన్లు అడ్డుపడ్డారు. మొదటి ప్రతి నాయకుడు వీధికి ఉత్తరాన ఉన్న మురుగు కాల్వే.
 
     ఒకప్పటి పింగళి వారి ఇంటి ఎదుట గానీ పిల్లల ఆసుపత్రి ముందు గానీ తదుపరి పండ్ల దుకాణం వెనుక గానీ ఎంత దట్టంగా, మందముగా, సున్నిత మనస్కులు గనుక చూస్తే దడుసుకునేట్లుగా పల్చటి క్యారీ బ్యాగులు అసంఖ్యాకంగా, ప్లాస్టిక్ గ్లాసులు ఇంకా రకరకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చిన్నపాటి దయ్యాలు పేరుకుపోయినవి.
 
మురుగుతో అవి ఎంతగా అనుబంధం పెంచుకున్నవంటే ఒక కార్యకర్త దంతెతో లాగినపుడు సగం డిప్పకు సరిపడా కంపు కొట్టుకుంటూ బయటకు వచ్చినవి.
 
ఇక రెండవ విలన్ మూల్పూరి గార్డెన్ లోని మురుగు కాల్వ, దట్టంగా పెరిగిన కలుపులు! 
 
       ఇక్కడ నలుగురు గట్టి పిండాలు గంటకు పైగా పనిచేసినా, 6 గంటలు దాటాక కూడా వాళ్ళు శ్రమించినా ఇంకా ఆ విలన్ కొనఊపిరితో బ్రతికే ఉన్నది! 
      
       రోడ్డు ఊడ్పుల వారి శ్రమను గూర్చీ, వాళ్ళ పనితనం గురించి నన్నడగవద్దు. ఎవరైనా అటు వెళ్లే వారు చూసి తెలుసుకొనవచ్చును. 
 
    నేను పాఠకుల సౌకర్యం కోసం ఇలా విడదీసి వ్రాస్తున్నాను గానీ ఏరోజైనా ఈ కార్యకర్తల అన్ని రకాల శ్రమలూ ఏకోన్ముఖమైనవే,  పరస్పర అవగాహనా పూర్వకమైనవే.
 
    ఈ చల్లపల్లి సంపూర్ణ స్వచ్ఛ సుందరమయ్యే దాకా - ప్లాస్టిక్ భూతాన్ని ఫ్లెక్సీ దయ్యాలను పారద్రోలే దాకా ఈ కార్యకర్తల పోరాటం ఆగేది కాదు. 
 
     సబ్రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదుట సూర్యుని సాక్షిగా జరిగిన చివరి సభను జాస్తి వారు నినాదాలతో ప్రారంభిస్తే కార్యకర్తల శ్రమను నేను అభినందిస్తే -
 
     వుడత్తు వెంకటేశ్వరరావు గారి తండ్రి జ్ఞాపకార్ధం కార్యకర్తలకు బలవర్ధక తినుబండారములు పంచగా - 
 
    రేపటి శ్రమదానము కూడా ఇంచుమించు ఇదే బందరు వీధిలో ప్రారంభించవలెనని అధికులు నిర్ణయించగా-
 
      నేటి వీధి పారిశుద్ధ్య ప్రయత్నం ముగిసినది.
 
          శ్రమదాన హోరు 
 
ఔనయ్యా ఇదిమనూరు! స్వచ్ఛతలకు మరోపేరు
పర్యావరణ ధ్వంసక ప్లాస్టిక్ పై పెద్ద పోరు
నాలుగైదు లక్షల పనిగంటల శ్రమదాన హోరు 
అందరమూ తలొక చెయ్యి అందిస్తే త్వరగ మారు!
 
- నల్లూరి రామారావు
   రిటైర్డ్ ప్రిన్సిపాల్
   10.09.2026