పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!
3953* కు చేరిన శ్రమదానం! (శనివారః, శ్రావణమాసః)
వారం, వర్జ్యం, ముహుర్తము వంటివి కాక – తమ ఊరి స్వచ్ఛ - శుభ్ర - ఆరోగ్యములే పట్టించుకోనే 43 మంది త్యాగధనుల వీధి పారిశుద్ధ్య ప్రయత్నమే 12-9-26 వ నాటి స్వచ్ఛ - సుందరోద్యమ కథ!
ఆ ప్రయత్నం ఆషామాషీ కాదనీ, చాల వరకు లోపరహితమనీ, అవసరమైతే పాతికేళ్ల పాటయినా పట్టుసడలనిదనీ ఇప్పటికే ఋజువైపోయింది! మరీ 4.19 కే 19 మంది - అందులోనూ 4 కిలోమీటర్ల దూరం నుండి - వెంకటాపురం నుండి - ప్రధానోపాధ్యాయిని లంకే సుభాషిణి ఆధ్యర్యంలో నలుగురు పిల్లలెందుకు ఈ బందరు వీధిలోని మునసబు వీధి వద్దకు వచ్చారు?
వయః పరంగా ఇందరు వృద్ధాతి వృద్ధులకు ఇంట్లో పండుకోక - అమావాస్య చీకటిలో వచ్చి, వీధులూడవడమూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు ఏరడమూ, మినీ ఉద్యానాల కలుపులేరడమూ వంటి పనులవసరమా?
ఈ 28 వేల మంది గ్రామస్తులలో గ్రామ సామాజిక సమస్యల పట్ల అవగాహన ఉండి, శక్తియుక్తులున్నవారు లేరా? 12 ఏళ్ల ఈ బృహత్తర శ్రమదానోద్యమం గురించీ, తత్ఫలితాల గురించీ వాళ్లకు తెలియదా? ఈ 4000 రోజులకు కాకపోతే 5000 రోజులకైనా వాళ్ల స్తబ్దత సడలదా? అప్పుడీ గ్రామానికి సర్వతోముఖ సమగ్రాభివృద్ది కుదరదా?.....
ఈ వేకువ 100 నిముషాల చొప్పున –
1) 100 గజాల బందరు వీధినీ,
2) శ్రావ్య కృష్ణ ఆస్పత్రి ఉద్యానాన్నీ,
3) కర్మల భవనపు వెనుక చోటునూ,
4) సగం దాక సజ్జా వారి వీధినీ,
5) అమరావతి రాజభవనపుటుత్తర భాగాన్నీ,
వంగొని కొందరూ, కటిక నేలపై కూర్చొని కొందరూ, ఒక చేతి కర్రా – మరొక చేత చీపురుతో ఇద్దరూ, కాలికి 4 నెలలనాటి గాయంతో ఒక ఫొటోగ్రాఫరూ ఎంత దీక్షగా పనిచేశారో చూశాను! కనీసం తెల్లారాకైనా అక్కడి 20-30 ఇళ్ళ నుండి ఒక్కరూ ఇందులో పాల్గొనరేమిటా అనీ విచారించాను!
చకచకా ఎత్తినచెత్త ట్రాక్టర్ లో నిండడాన్ని గమనించాను! 6.15 తరువాత 1 వ వార్డు ప్రవేశం వద్ద సుదీర్ఘంగా జరిగిన సమీక్షా సభను లంకే సుభాషిణి నినాదాలతో ప్రారంభించి, పర్యావరణ, ఆరోగ్యకర కంచమూ గ్లాసు గురించిన అనుభవాన్ని వివరించగా –
శరీరం ఎప్పటికప్పుడు తెలిపే క్రొత్త మార్పులు పట్టించుకోవడాన్నీ, Dr. గోపీచందు గారి చల్లపల్లి సందర్శనావకాశాన్ని DRK డాక్టరు గారు ప్రస్తావించగా-
రేపు కూడా మునసబు వీధి మొదటనే కలవాలనే నిర్ణయంతో ఈనాటి శ్రమదానోద్యమ చరిత్ర ముగిసింది!
సేవా దీక్షితులు
ఇంకా చెప్పాలంటే : ఇది మంచి శ్రమానుభూతి
ఇందులో సగం మందికి ఇది లేనిదే తోచదసలు
గ్రామానికి తోడుపడని నాడొక దుర్దిన మనుకొను
సేవా దీక్షితులు కలరు స్వచ్ఛ కార్యకర్తలందు!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
12.09.2026