3955* వ రోజు.......           14-Sep-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం!

పండగలకు ముఖద్వారం లాంటి గణచతుర్థి నాడు కూడ! - @3955*

               అనగా సోమవారం (14.9.26) సైతం వేకువ 4.20 కే పొలోమని16 మంది స్వచ్ఛ వీరమ్మలూ + వీరయ్యలూ - అందులో వెంకటాపురం పాఠశాలకు చెందిన ఇద్దరు ఛాత్రులతో సహా - (గుర్తుంచుకోండి – చిమ్మ చీకటిలో 4 కిలోమీటర్లు ప్రయాణించి మరీ) బందరు మార్గంలోని మునసబు వీధి వద్ద కత్తులూ కటార్లు నూరుకొని, కాలుష్యం అంతు చూడాలని సిద్ధమయ్యారు!

               మరి ఆ 2 వీధుల నుండి ఎందరు వచ్చారు? కనీసం నిన్నా - మొన్నా హుషారు చేసిన కోట పద్మావతి, ఆకుల రాఘవులైనా రాకపోతిరి! నిజమే – నిన్న కురిసిన భారీ వర్షం గాని, ఈ వేకువ మబ్బుల వాతావరణం గాని వీధి సేవలకు అనుకూలం కాదు! ఐతే - అది స్వచ్ఛ కార్యకర్తలకు వర్తించదు కదా!

               అందుకే గదూ – ఈ పూట 33 మంది తెగబడి స్వచ్ఛ పరిశుభ్ర – విన్యాసాలకు తెరలేపింది? కోడూరు, అంబటి, అడపాల పారల గడ్డి గోకుళ్ళూ, అమరావతి జమీందార్ల మినీ ఉద్యానంలో ఎడుమ చేతి వాటం ప్రసాదుని కత్తి వ్రేటులకు ముళ్ల - పిచ్చి మొక్కలు తెగిపడడాలూ,

               ట్రాన్స్ఫార్మర్ క్రింద దూరి పోస్టల్ ఉద్యోగి శుభ్రతా చర్యలూ, రోడ్డంతా గొర్రుల చీపుళ్ల చప్పుళ్లూ, ఇంకా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దరిద్రాల ఏరివేతలూ, చివరి 20 నిముషాలు చెత్త లోడింగులూ,

               కర్మల భవనం వెనుక విరిగిపడి, గోడను కూల్చిన వేప కొమ్మల ఖండనములూ, అక్కడనే ముగ్గురు వెంకటాపుర పాఠశాల వారి సుందరీకరణలూ?

               అది సరే - అసలైన శ్రమదాన వైభవం చూడాలంటే - పనుల వేగాన్నీ పరస్పర ప్రేరణ పొందుతూ కార్యకర్తల ఉద్వేగాన్ని - అంత సీనియర్ వైద్యురాలు అంజయ్యతో బాటు చెత్త బండెక్కడాన్ని చూస్తూ –

               “ఇది గదా శ్రమదాన స్ఫూర్తి - నిజంగా ఈ చివరి 20 నిముషాల సామాజిక బాధ్యతా నిర్వహణం చూసేందుకు రెండు కళ్లూ చాలవు” అని DRK గారు పరవశిస్తూ నాతో ముచ్చటిస్తుంటే -

               తెలిసి పోవడం లేదా - చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల ప్రత్యేకత? ఎందుకీ 12 ఏళ్ల చల్లపల్లి స్వచ్చోద్యమం అప్రతిహతంగా సాగిపోతున్నదని? వేలాది గ్రామాల్లో ముచ్చటిస్తుంటే చల్లపల్లి ప్రత్యేకత ఏమిటని?

               ఈనాటి తుది సభ వెంకటాపురం విద్యార్థి V. జస్నివంత్ నినాదాలతో మొదలై, DRK వైద్యుని సమీక్షతోనూ –

               రేపటి బాధ్యతల కోసం గ్రామ ప్రధాన సెంటరులో కలవాలనే నిర్ణయంతోనూ ముగిసెను!

               జాస్తి వారిని చూస్తే తెలియును

శ్రమకు జై కొట్టడం అంటే స్వచ్ఛ సుందర చల్లపల్లని,

వీధి శుభ్రతలోని కష్టం సజ్జ పనితో గ్రహించవచ్చును

శ్రమకు అసలైన అర్ధం జాస్తి వారిని చూస్తే తెలియును

బరువు పనులకు వెరవ కుండుట రెస్క్యు టీముతో నేర్వవచ్చును!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   14.09.2026