3958* వ రోజు.......           17-Sep-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం!

17.9.26 - గురువారం నాటి గ్రామ వీధి బాధ్యతలు -@3958*

వాటిని ఒక వరుస క్రమంలో చెప్పాలంటే :

A. తమ వృత్తులలో బాటు స్వచ్ఛ సుందరోద్యమ ప్రవృత్తినీ సమానంగా భావించే 10 మంది కార్యకర్తలు ఊరి నలుమూలల నుండి బిలబిల మని 4:22AM కే స్మార్ట్ రిలయెన్స్ వద్ద శ్రమ ఉద్యుక్తులయ్యారు!

B. ఖచ్చితమైన నిబద్ధ సమయం 4:30 కి అటుఇటుగా మరో పదునాల్గురు ఏతెంచి, చేతొడుగులూ, వీధి కాలుష్యహంతక పనిముట్లను ధరించి, అవసరాన్ని బట్టి చంద్ర హాస్పిటల్ మొదలు “వివాహ భోజన” హోటల్ దాక విస్తరించారు!

C. ఎప్పటికప్పుడు శుభ్రపడి, ప్రయాణ – నివాసయోగ్యముగా ఉన్న బందరు రోడ్డులో హాయిగా గడపుట దుకాణదారుల, సమీప గృహస్తుల వంతూ,

 D.ఇచ్చటి మురుగు కాల్వల, 2 “మందు” దుకాణాల, అసభ్యకరమైన ఖాళీ స్ధలాల పరిశుభ్ర- సుందరీకరణ కార్యకర్తల వంతూ కనుక – మొత్తం 24 మంది కార్యకర్తలు తమ పనుల్ని సమన్వయపరుచుకొంటూ 6:07 నిముషాల దాక – అనగా105 నిముషాల పాటు శ్రమించారు!

E. 6:01 AM కే పని విరమణ విజిల్ మ్రోగగా- చప్పున పని ఆపేందుకు 15 మంది ఇష్టపడలేదు! దక్షిణపు డ్రైను పనులు పూర్తికానందున సజ్జా- ఆకుల ప్రసాదులూ, మళ్లీ మళ్లీ పిలిచినప్పుడు వీరసింహుడూ చిట్టచివర పని ఆపిన త్రిమూర్తులు!

F. పై 2 డజన్ల మంది కాక 6:00 కు ట్రస్టు క్రొంగ్రొత్త ఉద్యోగి సుబ్బారావూ, కత్తుల పదునుదారుడూ కూడ వచ్చారు!

G. ఈ పూట చెత్త లోడింగు స్వచ్ఛంద కార్మికులు 6:00 కన్న ముందే పని ముగించారు!

G. కస్తూరి విజయుడు ఈ రోజు 83 వ మారు రక్తదానమొనర్చునని సమాచారం!

H. నడుం నొప్పి వలన ఇది వ్రాస్తున్న వాడు సింగల్ యూజ్ ప్లాస్టిక్ లు ఏరలేక పోవుట చేత –‘మందు’దుకాణాల, రిలయెన్స్ దుకాణ - 2 హోటళ్లఎదుట అవి రేపటికి మిగిలిపోయినవి!

I. ఆశ్చర్యకరముగా – ఒక దుకాణ యజమాని 2 నీళ్ల గుంటలు పూడుస్తున్న పసుపులేటి, సీనియర్ కస్తూరి కార్యకర్తలకు సూచనలిచ్చుట గమనించితిని!

J. నేటి తుది సమావేశమును గంధం బృందావనుడు నినాద పూర్వకముగా ప్రారంభించగా

K. రేపటి వేకువ కార్యకర్తల కలయిక ప్రదేశము “రామాలయము” ఎదుట అని సజ్జా ప్రసాదు గారు ఖరారు చేసిరి!

               కర్తలెవరు – భోక్త లెవరు

అందరిదా- కొందరిదా స్వచ్చోద్యమ చల్లపల్లి

అనంతమా – పరిమితమా స్వచ్ఛంద శ్రమదానము?

సార్ధకమా – నిరర్ధకమా సామూహిక శ్రమోద్యమము?

కర్తలెవరు – భోక్త లెవరు కాయ కష్ట కార్యములకు?  

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   17.09.2026