పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం!
సెప్టెంబరు18 నాటి(శుక్రువారం) వీధి పరిచర్యలు-@3959*
అందుకు గాను అతిజాగ్రత్త పరులైన కొందరు కార్యకర్తలు వాన సూచన ఉన్నాసరే – 4:21కే సిద్ధమయ్యారు! వాళ్ల శరీరాలూ, మనసులూ చిరకాలంగా అలా ట్యూన్ చేయబడ్డాయి మరి! గ్రామస్తుల్లో ఇప్పటికీ కొందరు వేకువ సేవలకు రావాలని ఉన్నా- రాజాలని ఆశక్తత! కార్యకర్తల్లో 50-60 మందికేమో ఈ పనులు మానజాలని బాధ!
నేటి 26+ ఇద్దరు కార్యకర్తలు తమ వ్యసనాలను మొదలు పెట్టినది మెహర్ (భారత లక్ష్మి) వడ్లమర వీధి నుండీ, పనులు ముగించినది సూరి డాక్టరు బజారు వద్ద!
ఈ నడుమ ద్విచక్ర వాహన విక్రయ శాలలూ, వివాహ భోజన విక్రయ శాలలూ, ఇనుమూ- సిమెంటు వ్యాపార సంస్ధా, చిన్నా – పెద్దా హోటళ్లూ, మేదర గృహాలూ, మసీదూ, మాంసవిక్రయ శాలలూ, దర్జీ షాపులూ....ఇన్నీ! కార్యశీలురేమో- ఏదో 30 మంది లోపు! మరి 1.2 కిలోమీటరు బందరు రోడ్డులో- వారం రోజుల్లో సగమే అయిందంటే – సమీప గృహస్థులో, వ్యాపారులో దూరదూరంగా ఉండుటవల్లనే!
ఒక మహిళా కార్యకర్త పనిలో ఉండగా మాటకలిపాను- “నిన్న కళ్లు తిరిగి, తూలి పడబోయారటగదా! ఈ ఒక్క పూట ఈ దుమ్ము పనులు మానితే బాగుండేదే!” అంటే-
“రాత్రి పడుకొనేముందు అలాగే అనుకొన్నాను, కాని- నాయీ స్వచ్ఛ కుటుంబీకుల్ని కలుసుకోకుండ -వాళ్ళ పనున్నీ, స్వచ్ఛ కబుర్లనీ వినకుండ ఉండలేక వచ్చి - చేయగలిగినంత పని చేస్తున్నాను - ఈ మనుషుల స్నేహ వాతావరణంలో నాకిప్పుడు బాగానే ఉందిలెండి....” అని బదులు పలికారు!
మరొక కాంట్రాక్టరు కార్యకర్త బాధ ఇలా ఉన్నది-“పాపం- ఆయన హిందూ శ్మశాన వాటిక రోడ్డును ఈవారంలో పూర్తి చేయాలనులనుకొనగా-గ్రావెల్ క్వారీల్లో ఒకటికి 3 మార్లు వర్షపు నీళ్లు నిండీ, ఆప్రాంత నివాసులు ముందస్తు జాగ్రత్త పరచినా వినక డ్రైన్ల నీరు రోడ్డుమీద చేరీ... సిమెంటు రోడ్డు పని పూర్తి చేయలేకపోవడం!”
అక్కడ మోడల్ డైరీ షాపు తెరవగా - ప్రాతూరి శాస్త్రి గారూరుకొంటారా? కేకుల్ని కొని, పంపకం జరిపించారు!
నేటి తుది సభను నినాదాలతో ప్రారంభించడానికి “ఆకుల ప్రసాదు” గారు ఎంపిక చేయబడి,
మెజారిటి కార్యకర్తలు రేపటి శ్రమను “చంటి హోటలు” వద్ద ప్రారంభించాలని నిర్ణయించారు.
మంగళములు పాడురోజు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లకు మంగళములు పాడురోజు
కలెక్టరేఈ గ్రామమున మకాము పెట్టుచున్న రోజు
స్వచ్ఛకార్యకర్తల పని సగము తగ్గు మంచి రోజు
ఈ ఫస్టెంబరు స్వచ్ఛ చల్లపల్లి మరువరాని రోజు!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
18.09.2026