2031*వ రోజు....           03-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2031* వ నాటి శ్రమ జీవన ఆనందం.

వేకువ 4 గంటలైనా కాకముందే-3.55 కే నిర్దేశిత బందరు జాతీయ రహదారిలో- భగత్ సింగ్  గారి ఆస్పత్రి దగ్గర ఆగి, చే తొడుగులు - మూతి చిక్కాలు, అపరి శుభ్రతా విధ్వంసక (చీపుళ్లు, కత్తులు, దంతెల వంటి) ఆయుధాలు ధరించిన 31 మంది స్వచ్చ సైనికులు (వీరు కాక ట్రస్టు ఉద్యోగులు వేరు చోట్ల) యధావిథిగా - అలవోకగా అక్కడి నుండి సంత బజారు దాక - తూర్పు రామాలయం, పెద్ద మసీదు, మేదర వాడ, టీ కొట్ల, టిఫిన్ హోటళ్ల, క్షౌరశాలల, ఇతర అంగళ్ల దగ్గర ఉత్పన్నమైన ఏ చిన్న కశ్మలాన్నీ వదలక, క్షుణ్ణంగా శుభ్రపరిచారు.

            సుందరీకరించడానికి ఏ అనువైన గోడ దొరక్క - గ్రామ సుందరీకరణ దళం కూడ ప్రధాన శ్రమదాన స్రవంతితో చేరడంతో ½ కిలో మీటరు మేర ఈ బందరు మార్గమంతా కళకళ లాడుతున్నది! ఈ 20 మందికి పైగా శ్రమ దాతలు కూడబలుక్కొని - వంతులేసుకొని, దారికి రెండు ప్రక్కల ఊడ్చుకొంటూ - సక్రమం, పరిశుభ్రం కానీ ఏ జాగానైనా సరిదిద్దుకొంటూ - పేపర్ - టీ కప్పుల - మురికి గోనె సంచుల వంటి వేటినీ ఉపేక్షించక-దుమ్ము,  ధూళి, ఇసుక వంటి అన్నిటినీ పోగులు చేస్తూ - మళ్ళీ చివరి 20 నిముషాలలో ఆ పొగుల్నీ ట్రస్టు ట్రాక్టర్ లో నింపుకొని చెత్త కేంద్రానికి తరలించారు. ప్రతి ఒక్కరూ తమ శ్రమానుసారం చెమటలు క్రక్కారు.

            కొసరుగా నలుగురు - మునసబు వీధిలో శుభ్రత చాలదనిపించి, దాని మలుపు దాక తీర్చిదిద్దారు!  రెస్క్యూ టీం వారికి కూడ చాలినంత పని దొరికింది. కరోనా లాక్ డౌన్ తో అక్కడ దారి మీద ఉన్న సిమెంటు బెంచీని చెట్టు ప్రక్క అందంగా అమర్చి, గంగులవారిపాలెం దారి మొదట్లో కరెంటు తీగల మీదికెక్కుతున్న చెట్ల కొమ్మల్ని, తీగల్ని కత్తిరించి - వాళ్ల కార్యక్రమం వాళ్లు చేశారు.

            ఈ దినదిన శుభోదయ స్వచ్చంద శ్రమకారులకూ, దీన్ని రోజూ ఇష్టపడి వర్ణిస్తున్న నాకూ, దేశ విదేశాల్లో ఉండి, ఈ వాట్సాప్ దైనందిన నివేదిక కోసం ఎదురు చూసి - చదివి - ఆనందించేవారికి ఒక ముఖ్య లక్షణం ఏమంటే – 1975 ప్రాంతంలో బాపు-రమణలు “ ముత్యాల ముగ్గు” సినిమాలో సృష్టించిన ఒక (కొంపలు కూల్చే - హత్యలు చేసి పెట్టే) కాంట్రాక్టరు “ ఏం ఓయ్ సెకట్రీ! మడిసన్నాక కుసింత కళాపొసనుండొద్దూ...” అన్నట్లుగా ఈ స్వార్ధరహిత కార్యకర్తలు 2 గంటలు శ్రమించాక - చీపుళ్లు - దంతెలు ధరించి చెమట తడి బట్టలతో తిరిగి వస్తూ అప్పటి దాక కష్టించి తీర్చిదిద్దిన ఈ దారిని చూసుకొని మురిసిపోతున్న దృశ్యం మాకు కన్నుల పండుగ!  ఎన్ని విధాలుగానైనా అది నాకు వర్ణనీయమే!

            80 ఏళ్ల స్వచ్చ వృద్ధ బాలుని (మాలెంపాటి గోపాల కృష్ణుని) 2000/- నెలవారీ నగదు కానుక “మనకోసం మనం” ట్రస్టు కృతజ్ఞతా పూర్వకంగా స్వీకరించింది. నారంశెట్టి వేంకటేశ్వరరావు (యోగా మాస్టారు) గారు ప్రతి నెలా “మనకోసం మనం” ట్రస్టుకు ఇస్తున్న 2000/- రూపాయలు - గడిచిన 3 నెలలవి, రాబోయే 3 నెలలవి కలిపి మొత్తం 12,000/- ను ట్రస్టు బ్యాంకు ఖాతాలో జమచేశారు. వీరికి స్వచ్చోద్యమ కార్యకర్తల తరపున ధన్యవాదాలు.

           మాలెంపాటి అంజయ్య గారి త్రిగుణాత్మక గ్రామ స్వచ్చ - సంకల్ప భీషణ నినాదాలతో బందరు రోడ్డు ఉలికి పడింది!

            రేపటి శ్రమదానం కోసం సంతబజారు దగ్గర కలుద్దాం!

      డాండ - డడాండ – డాండ .. అని

ఏ తాయతు మహిమా కాదు - ఏ దేవుని వరం కాదు

మహర్షి దీవనలు కాదు - మంత్ర తంత్ర ఫలం కాదు

చల్లపల్లి స్వచ్చ – శుభ్ర - సౌందర్యం సాధనలకు

స్వచ్చ కార్యకర్తల శ్రమె కారణమని చాటగలను!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

బుధవారం – 03/06/2020,

చల్లపల్లి.