3965* వ రోజు.....           25-Sep-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం!

సెప్టెంబరు 25 న (శుక్రవారం) మాత్రం శ్రమ వైభవం తగ్గిందా? (@3965*)

               తుఫాను భయం తగ్గినా, వేకువ 3.00 కు కూడ వర్షం పడిందట! మరీ ఎందుకంత ఆత్రమో గాని - ఇద్దరు డాక్టర్లతో సహా 11 గురు 4:21 కే ఆ భారతలక్ష్మి, వడ్లమర దగ్గర వాలనే వాలారు! అందరూ ఒక్కసారి ఆలోచించి చూడండి, ప్రచార నిమిత్తమో, ప్రసిద్ధి కోసమో, ధన ప్రాప్తి వంటి చిల్లర కోరికలతోనో వీధి పారిశుద్ధ్యానికి వచ్చే వాళ్లైతే –

               ఈ చీకటి వేళ – చలి గాలి వీస్తున్నప్పుడు - ఎందుకొస్తారు? గ్రామస్తులంతా చూడగలిగే 7:00 కు వచ్చి, చీపుళ్ల పోటోలు దిగి, జారుకొంటారు గాని!

               ఈ వాట్సప్ పాఠక మిత్రులారా! గ్రామస్తులారా! తస్మాత్ జాగ్రత్త! ఈ స్వచ్ఛంద శ్రమదానమొక ఆషామాషీ - ఉబుసుపోక - అర్ధం పర్ధం లేని తాత్కాలిక ఉద్యమమనీ పొరబడకండి!

               13500 గ్రామాల జనులు సరిగా ఈ ఉద్యమ ఆంతర్యాన్ని పసిగట్టి, ఆచరణకు దిగాలే గాని - సంవత్సరం తిరక్కుండా గ్రామ సీమల ముఖచిత్రం మారిపోతుందనీ, ప్రజారోగ్యం మెరుగుపడుతుందనీ, ఈ సృజనశీల నవ సంస్కృతి రాష్ట్రమంతా పరిఢవిల్లుతుందనీ నమ్మండి!

               ఈ ఫ్లెక్సీల - అపరిశుభ్ర- అనాలోచిత – కళావిహీన గ్రామాలు కళకళలాడుతాయని విశ్వసించండి!

               దయచేసి - ఈ 28 వేల మహా గ్రామం కోసం ప్రతిరోజూ కేవలం 30-40-50 కార్యకర్తల సంఖ్యను అపరిమితం చేయండి!  

               ఇక - ఈ 3965 వ నాటి 28+1 మంది శ్రమోత్సాహాన్ని గురించా? ప్రత్యేకంగా వ్రాసేదేముంది!

               అసలు పని చోటు రిలయన్స్ మాల్ ప్రక్క వీధి కాగా, ముందుగా ముగ్గురూ, తెలవారుతుండగా 10 మందీ బైపాస్ వీధి బురదలోనే పరిశుభ్ర - సౌందర్య  చర్యలు చేపట్టారు! అందులో ఒకాయన “అదేంటో ఒక్కపూటకే 10 రోజుల ఎడం వచ్చినట్లుంది” అంటుంటే విన్నాను! ఇంకొకాయన “నిన్న వీధి శ్రమలేనందున నా కాలు నొప్పి వచ్చింది” అంటున్నాడు!

               కొంతమంది “నిన్నటి, ఇవాళటి బాధ్యతంతా ఈ పూటే తీర్చుకోవాలన్నంత” కసిగా వడ్లమర వీధిలో శ్రమిస్తున్నారు! సతీష్ వంటి ఒకరిద్దరు అవసరమునుబట్టి పరుగులు తీస్తున్నారు!

               ఈ పూట దుమ్ము కాదు గాని - బురదా, నీళ్లూ కొందరి బట్టలకంటుకొన్నవి!

               నిజమే – నేను గతంలో వర్ణించినట్లు - ఈ పాతిక ముప్పై మంది గంటన్నర కష్టమూ

               “ఇది ఒక వీధి శ్రమల కార్ఖానా!”

               ఈ పూట వడ్లమిల్లులో కాస్త సృజనాత్మకంగా నినాదాలు పలికినది పల్నాటి అన్నపూర్ణ; మనమరాళ్లు అన్నప్రాసన తాలూక అన్నవరం ప్రసాద వితరణ కూడ ఆమెదే!

               3 వ మారు కూడ ఈ శ్రమోద్యమం పట్ల అభిమానంతో కార్యకర్తలకు తినుబండారములు పంచినది కాకరపర్తి సురేశ్ గారు!

               రేపటి వేకువ శ్రమ సందడి బాలికల హాస్టల్ వద్ద!

               గుండెలవిసిపోవునట్లు

చెవులు చిల్లు పడునట్లుగ – మనసు వికల మగునట్లుగ  

గుండెలవిసిపోవునట్లు - డి.జే.లకు అనుమతులా?

ప్రజల బ్రతుకు శాపముగా - మద్యస్వైర విహరణగా

గణనాథుని నిమజ్జనము ప్రజారోగ్య విఘాతమా!

- నల్లూరి రామారావు

    రిటైర్డ్ ప్రిన్సిపాల్

    25.09.2026