3966* వ రోజు.....           26-Sep-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం!

26 వ సెప్టెంబరు (శనివారము) నాటి శ్రమోద్యమ ప్రశ్నలు - జవాబులు!

1) చల్లపల్లి అనెడి చారిత్రాత్మక గ్రామ మందు ఇది ఎన్నవ శ్రమదానము?  

               → 3966*

2) “స్వచ్ఛ కార్యకర్తలు” అనెడి పిచ్చి మారాజులు ఈ పూట ఎందరు దొరికిరి?

               → 34+2 = 36 (+2 అనగా తుది సభకు ఆగక వెళ్ళిపోయినవారు )

3) నేటి 36 గురు పిచ్చి వాళ్ళ స్వర్గభాగమేది?

               → 1 వ వార్డుకు చెందిన బాలికల వసతి గృహ ప్రాంతమున సుమారు 150 గజముల వీధి.

4) మరి – ప్రాత కార్యకర్తలు కాక ఆ వీధి నుండి కాని, హాస్టలు నుండి గాని క్రొత్తగా ఎవరైనా ఈ చీదర పనులకు వచ్చిరా?

               → లేదు – ఏళ్ళ తరబడీ 22 వార్డుల, శ్మశానముల, RTC బస్ ప్రాంగణముల, ఊరి లోపల, వెలుపలి రహదారుల కాలుష్యముల పైన కత్తులు దూస్తున్న అవే ప్రాత ముఖాలు.

5) ఐతే - ఈ శనివారపు వేకువ ఇందరు మహా వీరయ్యలూ - వీరమ్మలూ ఏయే కాలుష్యములను ఊడబొడిచిరి?

               → అదుగో- అట్లు వ్యంగ్యముగా ప్రశ్నించరాదు సుమా ! నీబోటి వాళ్లకు అర్ధము కానంత మాత్రాన గ్రామ పారిశుద్ధ్యమూ, తద్ద్వారా 28 వేల మంది 12 ఏళ్లుగా అనుభవిస్తున్న ఆహ్లాద సౌకర్యములూ, ఈ నాలుగైదు లక్షల పని గంటల శ్రమదానమూ బొత్తిగా నిరర్దకములనుకొనకుము, ఈ వేకువ 4.19 కి ముందు ఈ వీధి ఎట్లుండెనో - 6.15 తరువాత ఎంత శుభ్రముగా - పొందికగా ఉండెనో తెలియుట లేదా?

6) వీరిలో 20 మంది పరవాలేదు గాని - 8 మంది మహిళలూ, ఐదారుగురు వృద్ధులూ ఇలాంటి మురుగు -కంపు పనులకు పూనుకొనిరేల? ఇంతకూ రోజూ ఈ చెత్త పనులొనర్చినందుకు వీరికెంత కూలి గిట్టుబాటగుచున్నది?

               → ఖర్మ! ఖర్మ! పన్నెండేళ్ల ఈ స్వచ్ఛ – సుందరశ్రమోద్యమము గురించి తెలియని నీవంటి అమాయకులింకా ఈ చల్లపల్లిలో ఉన్నారన్న మాట! అయ్యా! ఇది చరిత్రలో ఎక్కడా కనిపించని శ్రమ “దానము!” దానికి వాళ్ళు పొందుతున్న ప్రతిఫలము నీలాంటి వారు ఊహించలేనంత విలువైన “సంతృప్తి!

7) అది సరే గాని - 6.05 మొదలు 6.12 దాక 3 సార్లు విజిలు ఊదుతున్న ఆ పెద్ద మనిషి ఎవరు? చూడడానికి డాక్టర్ లా కనిపిస్తున్నాడు -  అతని చేతిలో చీపురేమిటి?

               → అది కూడ తెలియదా? అతడే ఈ అద్భుత శ్రమదానోద్యమాన్ని మరికొందరితో కలిసి ప్రారంభించి, నిర్వహిస్తున్న ఆదిమ కార్యకర్త, DRK ప్రసాదు అనబడే అతిచురుకైన సామాజిక కార్యకర్త!

8) ఐతే - ఆ హాస్టలు గేటు వెలుపల క్రమశిక్షణతో అర్థవలయముగా ఏర్పడిన వాళ్ళలో  ఈ ఊరి సర్పంచమ్మనుకొంటా - అంత గట్టిగా గొంతు చించుకుని అరుస్తున్నదెందుకని?

               → అయ్యో! నీకవి “అరుపుల్లా” ఉన్నవా? అవి ఈ గ్రామ సమాజ సర్వతోముఖ పురోభివృద్ధిని కోరుతూ ఈ స్వచ్ఛ యోధానుయోధులు ప్రతి వేకువా ఆకాంక్షిస్తున్న నినాదాలు స్వామీ!

9) అది సరే గాని – రేపు వేకువ వీళ్ళంతా ఎక్కడ పని మొదలెడతారు? వీలైతే నేను కూడా వచ్చెదను.

               → పోలీస్ స్టేషను వీధి మొదటిలో! తప్పక రమ్ము.

               నిమజ్జనమను పేర

నవదినమ్ములు పూజచేసిరి సవినయమ్ముగ స్తుతులొనర్చిరి

సంప్రదాయము ననుసరింపక, చెవులు బ్రద్దలు కొట్టునట్లుగ

శబ్దములు చాలవన్నట్లుగ తప్ప త్రాగీ – చిందులేసీ

నిమజ్జనమను పేర క్రొత్తగ నీచ సంస్కృతి మొదలు పెట్టిరి!

- నల్లూరి రామారావు

    రిటైర్డ్ ప్రిన్సిపాల్

    26.09.2026