పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం!
3967* వ గ్రామ సామాజిక శ్రమ వైభవం గమనించండి!
ఇది ఆదివారం (27-9-26) నాటి సంఘటన! నిన్నటి నిర్ణయం ప్రకారం శ్రమదాన స్థలమార్పిడి జరిగి, 42+2 మంది చెమటల ఉప్పదనం చవి చూసే అదృష్టం రక్షక భట బజారు మొదలు గణేశ్ ప్రింటర్ల దాకా - బందరు వీధికి దక్కింది.
(మిత్రులారా! నేనిలా వ్రాయటం మొదలెడితే - ఏదో ఒక మూరుమూల ఊరిలోని 1% మంది కూడా పాల్గొనని గ్రామ మెరుగుదల ప్రయత్నం గురించి మరీ కవితాత్మకంగా వ్రాయబోతున్నానని సందేహించకండి!)
కొద్దిగా భాషాజ్ఞానం, ఇంకాస్త భావుకత ఉన్న మీలో ఎవరైనా ఈమాత్రం వ్రాయగలరని నా నమ్మకం! ఎందుకంటే - ఈ శ్రమ వేడుక ఈనాటిది కాదు - పన్నెండేళ్ళ సుదీర్ఘ ప్రస్థానం! అన్ని గ్రామాల్లాగే శుచీ - శుభ్రతాహీనమై, వెలా తెలాపోతున్న చల్లపల్లిని స్వచ్ఛ - పరిశుభ్ర - హరిత - సర్వాంగ సుందరంగా మార్చాలని కొద్ది మంది సాహసించి, కొంతవరకు కృతకృత్యులైన త్యాగ భరిత చరిత్రం! మరి ఇలా కాక ఇంకెలా వ్రాయగలం?
సరే - ఈ తెల్లవారుజామున ఈ ప్రత్యేక తెగకు చెందిన 44 మంది 4:19 కీ – 4:30 ప్రాంతంలోనే వచ్చారు - ఇంత చీకట్లో మన వీధి పారిశుద్ధ్య కృషి నెవరైనా చూస్తున్నారా, మెచ్చుతున్నారా అని దిక్కులు చూడలేదే - చేతొడుగులూ, తలదీపాలూ, పారా - పలుగూ - చెక్కుడు పారా - డిప్పా - చీపురూ వంటివి ధరించి –
అది మురుగ్గుంటో... గుడి ప్రాంగణమో... పిండిమిల్లో - టీ దుకాణమో - చిన్న కార్లస్టాండో... ఏదైతేనేం - ఎక్కడ కాలుష్యం జాడ కనిపిస్తే అక్కడికి వాళ్ల శ్రమ ప్రవహించింది!
ఈ గంటన్నర సమయం ఎవరు డాక్టర్లో - ఎవరు ఇంజనీర్లో - ప్రిన్సిపాళ్లో - స్త్రీలో - వృద్ధులో - రైతులో అనవసరం - వాళ్లు తమ ఊరి కొరకు శక్తి వంచన లేకుండ - కొన్ని సందర్భాల్లో శక్తిని మించి - కష్టించే కార్యకర్తలు మాత్రమే!
వెనకటికొక మహాకవి చెప్పాడు - “వ్యక్తికి బహువచనం శక్తి” అని! అది ఈ చల్లపల్లిలో ఇప్పటికి 3967* సార్లు ఋజువయ్యింది! ఒక కార్యకర్త నుండి మరొకరికి ఆ సామాజిక స్ఫూర్తి అంటుకొంటూనే ఉంటుంది - ఆ గంటన్నర సేపూ!
ఇది వాట్సాప్ లో - ముఖ పుస్తకంలో చదివి ఎవరైనా వారివారి ఊళ్లలో శ్రమదానం చేసేసి ఊరిని బాగు చేయాలనుకుంటే గుర్తుపెట్టుకోవలసిన విషయం. దయచేసి ఒంటరిగానో, బిక్కుబిక్కుమంటూనో చీపుళ్ళు పట్టుకుని ప్రయత్నించకండి. ఈ మహత్కృషి ఒకసామూహిక శక్తి మాత్రమే - అది కూడా క్రమశిక్షణతో మాత్రమే చేయవలసినది.
ఇక ఈపూట కార్యకర్తల వీధి పారిశుద్ధ్య ప్రయత్నం సంగతికొస్తే-
• అసలు బజారును కాక కొసరుగా సంత బజారును కూడా కొందరు కాలుష్య రహితం చేయజూచారు.
• కూరగాయాల, టిఫిన్ బళ్ళ, కొబ్బరి బొండాల, దేవాలయాల ఎదుటి దిక్కుమాలిన వ్యర్థాలను వేటినీ ఉపేక్షించలేదు.
• కొందరు ఉత్సాహవంతులు గణేష్ ప్రెస్ వీధిలోకి మళ్లారు కూడా. వాళ్ల అదృష్టం కొద్దీ అక్కడ అంతకంటే దిక్కుమాలిన సీసాలు ప్లాస్టిక్ గ్లాసులు, ఏకమాత్ర ప్రయోజనకర ప్లాస్టిక్ సంచులు, త్రాగి పారేసిన కొబ్బరి బోండాలు……. ఒకటేమిటిలే - కావలసినన్ని - చేసినవాళ్లకు చేసినంత పని దొరికింది.
• గ్రంథాలయ వీధిలోకి కూడా కొందరు ప్రవేశించినట్లున్నది.
“ఇదేముందిలే - ఎప్పుడూ ఈయన వ్రాసేదీ, మనం చదివే తతంగమే కదా! మళ్లీ ఇవి చాలక చివరలో కొసరుగా ఒక పద్యం కూడానూ!” అని భావిస్తున్నారా? లేక పైపైన యాదాలాపంగా చదివి వదిలేస్తున్నారా? ఈ శ్రమదానం విశిష్టత ఏమిటో, దాని పొడవూ, లోతూ తెలుసుకోవాలనిపించడం లేదా?
అలా తెలుసుకోవాలంటే మాత్రం –
“చల్లపల్లిలో ఏం జరుగుతోంది - ఎందుకు జరుగుతోంది” అనే పుస్తకాన్ని శ్రద్ధగా పరిశీలించాల్సిందే సుమా!
ఇక ఈ పూట శ్రమదాన నాటక చరమాంకం ఎక్కడో భాగ్యనగరం నుండి వచ్చిన యువ కార్యకర్త శ్రీమతి దాసరి స్నేహ గారి చక్కటి నినాదాలతో ప్రారంభమై 42 మంది జై కొట్టడంతోనూ, దాసరి రామకృష్ణుల వారి సముచిత సమీక్షా వచనములతోనూ ముగిసినది.(ఈ స్నేహ శీలి ‘మనకోసం మనం’ ట్రస్టు సభ్యురాలు & నెలనెలా 15 వేల చందాదారు!)
రేపటి శ్రమదానం కోసం ATM సెంటర్ల వద్ద కలవాలని తెలుస్తున్నది.
ఇది సమాజ శ్రేయమనుచు
ఎవరెవరో తెగడిరనో- ఎవ్వరైన మెచ్చిరనో
స్వచ్ఛోద్యమ మాగబోదు, శ్రమదానము జరగబోదు
త్రిశుద్ధిగా - ముమ్మాటికి ఇది సమాజ శ్రేయమనుచు
నమ్మే ఈ శ్రమదాతలు నడుపుచున్న కార్యం ఇది!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
27.09.2026