పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం!
గ్రామ శ్రమదాన మహా గ్రంథంలో ఈ సోమవారం నాటిది 3968*వ పేజీ!
దశాబ్ద కాలం పైగా నేనిలా వేలకొద్దీ తెల్ల కాగితాల్ని సిరాతో ఖరాబు చేస్తూనే ఉన్నాను, నా కొద్దిపాటి భాషాజ్ఞానంతో ఏరోజుకారోజు గిలుకుతున్న ఈ రచనల్ని పాపం - కార్యకర్తలూ, ఇతరులూ ఏదోలాగ భరిస్తూనే ఉన్నారు! నాకు తోడు ఆ వేల్పూరి ప్రసాదొకడు!
కావలిసినప్పుడల్లా నాకు అందుబాటులో ఉంటాడు. అప్పుడప్పుడు కూర్చొని రాసేందుకు నా సీనియర్ నడుము సహకరించకపోతే పడుకొనిగాని - ప్రయాణంలో కారులో కూర్చొనిగానీ వ్రాతకాక - నోటిమాటలుగా డిక్టేట్ చేసి, అతడిని చిత్రహింసలు పెడుతుంటాను! (పైగా అతగాడొకేసారి 3-4 గుళ్ళ (= పనుల) పూజారి!
[ఇక్కడ కాస్త అధిక - లేక – అప్రస్తుత ప్రసంగమైతే అయింది గానీ - నా గురించి తమాషా ఒకటి ప్రస్తావిస్తాను!] అందరికీ ఉన్నట్లే నాకు కూడా ఈ ప్రపంచంలో కొద్దిమంది అభిమానులూ, ఇద్దరో - ముగ్గురో - నలుగురైదుగురో అసంతృప్తిపరులూ ఉన్నారు! మొదటి రకం వాళ్లేమో “ఆహా! ఓహో! ఈయన చాలా బాగా వ్రాస్తాడురా - అసలు ఎగ్గొట్టకుండా రోజూ వేకువ వచ్చి చేయగలిగిన పనేదో చేస్తాడురా...” అంటారు!
కాస్త వాస్తవిక దృక్పథంతో 2 వ రకం వాళ్లు మాత్రం “మనలాగా ఒంగి గట్టిగా పనీ చేయడు - చేస్తున్న మనల్నీ బాగా అభినందించడు - ఏంటో అలా అటూ ఇటూ తిరుగుతూ - కాస్తమౌనంగా, ఇంకాస్త పరధ్యానంగా ఆలోచిస్తుంటాడు! అసలతనికేం తక్కువ? నెల నెలా10 వేలేమిటి - లక్ష ఇవ్వచ్చు గదా స్వచ్చోద్యమానికి?....” అనుకొంటారట!
ఔను – ఇది ప్రజాస్వామ్యం! లోకోః భిన్న రుచిః! ఈ ఉభయులకు ఋణపడే ఉన్నాను!
ఇక అసలు విషయానికొద్దాం - నిన్నటి శ్రమదానం గురించి చెప్పుకొన్నాం కదా! ఈ సోమవారం (28.9.26) నాడు 90% శ్రమ నిన్నటి చోట్లనే జరిగింది. నిన్నటి కార్యకర్తల కష్టాన్ని చూసి, “అరె! ఈ మసక వెన్నెల వెలుగులో చీపుళ్ల దుమ్ము లేస్తుంటే - ముక్కులకు చిక్కాలు కూడ కట్టుకోక ఆ దుమ్ము పీలుస్తూ – మంచోళ్ళో, పిచ్చోళ్ళో గాని - ఇందరి పనులేంటి? ఇంత పెద్ద వీధిని గంటన్నరలో అందంగా శుభ్రంగా మార్చేశారే!” అనుకున్నాను!
ఐతే ఈ కార్యకర్తల్లో కొందరికాశుభ్రత, పొందిక చాల్లేదట! ATM ప్రాంతంలో, బ్యాంకుల ఎదుటా, గ్రంథాలయం సందులో, కొన్ని దుకాణాల వద్దా, ప్రక్కన ఒక మురుగు కాల్వ దగ్గరా కొన్ని లోపాలు కనపడ్డాయట! అవి వాళ్ళనుకొన్నుట్లు శుభ్రపడేదాక అంటే 4.21 - 6.12 AM దాక - రకరకాల పనులు చేస్తూనే ఉన్నారు!
వింత ఏమిటంటే - 6.03 కి పనులాపమని విజిల్ ఊదిన DRK డాక్టరు గారే - 7 గురు ఆ విజిల్ ను పట్టించుకోక పనిచేస్తుంటే - తాను కూడా చీపురేసుకొని 10 నిముషాలు వారితో బాటు ఆలస్యంగా పనిముగించడం! మరి ఇప్పుడు చెప్పండి - దీన్ని దేశంలో మరెక్కడైనా సంభవంకాని బ్రహ్మాండమైన ఉద్యమం అంటారా? వెర్రి - మొర్రి చేష్టలంటారా? లేక బాగా ముదిరిపోతున్న వ్యసనమంటారా?
ATM సెంటర్లో జరిగిన సమీక్షా సభలో:
చాలాకాలం తర్వాత వచ్చిన G.T. రాంప్రసాదు గారు నినాదాలు పలికి, ఊరి గురించి, కార్యకర్తల కష్టం గురించీ తమ మనసులోని బాధలు వెళ్ళగ్రక్కారు,
రేపటి శ్రమదానం కోసం బందరు రోడ్డులోని పబ్లిక్ టాయిలెట్లు వద్ద కలవాలని నిర్ణయించారు.
సవనమువలె - సమరము వలె
ఒకరిద్దరె సాధించే గురుతర బాధ్యతలు కావు
ఒక వారమొ ఒక మాసమొ ఒనగూడే పనులు కావు
సవనమువలె - సమరము వలె స్వచ్ఛ సుందరోద్యమమొక
సామూహిక- దీర్ఘకాల - స్వచ్ఛంద శ్రమ వేడుక!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
28.09.2026