పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం!
ఒకానొక ప్రాచీన గ్రామానికి 31 మంది వేకువ సేవలు! - @3969*
ఈమధ్య “సేవలు” అనే మాటకూ అర్థం మారిపోతున్నది. లక్షల జీతాలు తీసుకొనే ఐ.టి, ఔట్ సోర్సింగ్ పనులు కూడా “సేవలే” నట! చల్లపల్లిలో పన్నెండేళ్ళ నుండి ప్రతి వేకువ 4.20 - 6.00 మధ్య గంటన్నర చొప్పున – మొత్తంగా నాలుగైదు లక్షల పని గంటల సేవలు మాత్రం ఆ బాపతు కానే కావు!
అవి చేతి చమురు వదిలించుకుంటూ సగటున 30-40 మంది ఒక సమున్నతాశయంతో చేస్తున్న శ్రమదానాలు!
ఈ స్వచ్ఛ - శుభ్ర - హరిత - సౌందర్య కృషిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మాత్రం నా రోజు వారీ రచనలు సరిపోవు! ఏ రోజైనా పని సమయంలో రావాలి; ఆ కార్యకర్తలతో మాట్లాడాలి; 6.20 - 6.30 మధ్య తుది సమావేశంలో కూడ ఉండాలి; అప్పుడు మాత్రమే – స్వచ్ఛ - సుందర పబ్లిక్ టాయిలెట్ల, 2 శ్మశానాల, RTC ప్రాంగణాల, గ్రామ ప్రవేశక అష్టమార్గాల, 32 వేల చెట్లు, కీర్తిశేషుల కోసం 2 వీడుకోలు వాహనాల వంటి సౌకర్యాలెందుకు ఎలా సమకూరినవని తెలుస్తుంది!
ఏ క్రొత్త వాళ్ళు చూసినా ఇతర గ్రామాలకూ, ఈ ఊరికీ తేడా ఏమిటో చప్పున తెలిసిపోతుంటుంది! ఐనా ఏ కొద్దిమందో గ్రహిస్తారు - వీటన్నిటి వెనుక కార్యకర్తల శ్రమల మర్మాన్ని! వాళ్లలో కొందరైతే ఈ శ్రమదాన ఆంతర్యాన్ని పసికట్టి, కార్యోన్ముఖులూ కావచ్చును!
ఈ మంగళవారం (29.9.26) 4.20 - 6.08 నడుమ ATM కేంద్ర పరిశుభ్రతకు బాధ్యత వహించిన - సచివాలయం 3 ప్రక్కలా చెమటలు కార్చుతూ అర బండెడు పిచ్చి చెట్లనూ, ప్లాస్టిక్ లనూ, చెత్తలనూ నిర్మూలించిన 30 మందినీ సన్మానించడం కాదు - ఆదర్శంగా గ్రామస్తులు స్వీకరించే మంచి ముహూర్తం ఎప్పుడొస్తుందో మరి!
ఇంటికొకరు కాదు - కనీసం 22 వార్డుల నుండి 100 మంది ఐనా పాల్గొంటే చల్లపల్లి ఇంకెంత ఆరోగ్యప్రదంగా మారి, ఆహ్లాదదాయకమౌతుందో చూడాలని ఉంది!
ఈ వేకువ సమయంలోనైతే :
- బంకు ప్రక్క ట్రాన్స్ఫార్మర్ క్రింద దూరి శుభ్రపరిచిన వాళ్ళకూ,
- 150 గజాల వీధినీ, గణేష్ ప్రెస్ సందునూ,
- చిన్న కార్ల నిలుపుదల స్థలాన్నీ, టాయిలెట్ల ప్రాంతాన్నీ, సైకిల్ షాపుల్నీ, ఊడ్చిన - దుమ్ము డిప్పలెత్తి మోసిన - సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు ఏరిన –
కార్యకర్తలందరికీ, చక్కెర స్థాయి తగ్గి నీరసించినా సరే – గ్రామ బాధ్యత మానని జగ మొండి శాస్త్రి గారికీ, గదిమినట్లు నినాదాలు గట్టిగా చెప్పిన దేసు మాధురి గారికీ, శ్రమదాన సమీక్షకులు DRK డాక్టరు గారికీ,
5 మంచి చీపుళ్ళు స్వచ్చోద్యమానికి బహూకరించిన జనాబ్ మహమ్మద్ జానీ గారికీ - గ్రామస్తులందరి తరపున ధన్యవాదములు,
రేపటి మన శ్రమదాన వ్యసనం N. లంక రోడ్డులోని బాదం పానీయ దుకాణాల నుండి!
గణితం ముఖ్యము కాదు
పదిమందా - ఇరవయ్యా - నలభై - యాభై మందా?
కార్యకర్తలెందరనే గణితం ముఖ్యము కాదది
ఎన్నేళ్ళుగ జరుగుతున్నదని కూడా గొప్ప కాదు
ప్రతి దినమూ శ్రమదానపు పరమార్ధమె ముఖ్యము గద!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
29.09.2026