పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం!
గ్రామ బాధ్యతల నిర్వహణలో ఇది అక్షరాలా 3970* వ రోజు మాత్రమే!
అలాగే ఊరి 3 ముఖ్య వీధుల కూడలిలో 4:20 -6:05 వేళ పారిశుద్ధ్య శ్రమ విన్యాసాలు 30+1 (ఈ + సింగిల్ వ్యక్తి ఆటోడ్రైవరనుకొంటా – అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ ఇన్స్పిరేషన్ తో తుది సభలో పాల్గొన్నాడు !) మంది మాత్రమే!
ఇక వ్యర్ధాల మీద పోరాట స్థలము చిన్నకార్ల స్టాండు మొదలు కూడలిలోనే 3 రోడ్ల పర్యంతము! మరి- యుద్ధంలో ఫలితమా - అదెప్పుడూ కార్యకర్తలకు సానుకూలమే!
నిన్న సాయంత్రం గాని, ఈ వేకువ సేవలకు ముందు గాని ఎవరినడిగినా చెపుతారు – “పరవాలేదు-ఈ చోటంతా శుభ్రంగా ఉంది” అని! అలా మెచ్చుకొన్నవాళ్లు ఈ సెప్టెంబరు మాసాంతాన (బుధవారం-) ఉదయం 6.30 తరువాత మళ్లీ చూస్తే మాత్రం అరె! ఇదేమిటి? సుమారు ఈ అర ఎకరం చోటులోనే 40 కసవు గుట్టలా? బండిలో సగానికి దుమ్మూ+ఇసుకా+చెత్తా చెదారాలా? సరదా సరదాగా కబుర్లాడుకొంటూనే ఈ గ్రామ పారిశుద్ధ్య నిపుణులు గంటన్నర కష్టించాక ఈ ఊరి ప్రధాన సెంటరు చూస్తూనే ఉండి పోవాలన్నంత చక్కగా తయారయిందే...” అని ఆశ్చర్యపోక తప్పదు!
ఎందుకంటే - కొందరనుకొనేట్లు ఇది అల్లాటప్పా శ్రమదానం కాదు - ఒక్క పైసా ప్రతిఫలమాసింపక - చిత్తశుద్ధితో - 30 మంది నిస్వార్ధపరుల కష్టానికి లభించిన వీధి పరిశుభ్రత ఇది!
ఐతే ఈ పూట కార్యకర్తలకు తమ పనుల పట్ల పూర్తి సంతృప్తే గాని - అంచనాకనుగుణంగా వీధులు బాగుపడ్డాయి గాని - కొందరి ముఖాల్లో మాత్రం బాధ కొట్టచ్చినట్లుగా తెలుస్తున్నది - “మనం ఎన్నేళ్లు నచ్చచెప్పినా, బ్రతిమాలినా, బాధ్యత గల పెద్దలే ఇంత అందమైన గ్రామ కేందాన్ని ఫ్లెక్సీలతో నింపేస్తున్నారే” అని!
“మన పన్నెండేళ్ల స్వచ్ఛ - సుందరోద్యమానికి దక్కని గౌరవమిదేనా?” అని!
“ప్రభుత్వాలు పట్టించుకోక - విజ్ఞులు ఉపేక్షిస్తుంటే - ఈ పర్యావరణ విధ్వంసకమును గురించి ఎవరికి మొరపెట్టుకోవాలి?” అని!
ఇకపోతే - ఈ పూట చెత్త లోడింగు సందర్భంలో మాలెంపాటి అంజయ్య, కస్తూరి శ్రీనుల మధ్య ఒక చిన్న కీచులాట - “రాత్రి 1 గంట వేళ విజయవాడ నుండి వచ్చి పడుకొంటే - 4.00 కి ఫోను చేసి నన్ను రప్పించావే” అని ఒకరూ,
“అది సరే - నేను చెత్త డిప్ప అందిస్తున్నాను గదా – నా చెవి గీరుకుపోయేట్లు దాన్ని లాక్కోవాలా?” అని 2 వ వారూ!
మరో సంఘటన - నిన్న చక్కెర స్థాయి తగ్గి తూలిన శాస్త్రి మహాశయుడు తన 79 ఏళ్ల వయసును ఏ మాత్రం గౌరవించక ఈ పూట వచ్చి, తుది సభ సమయంలో నీరసించి, కళ్ళు తిరిగి పడబోవడమూ ! (ఐనా సరే ఛాలెంజ్ - ఈ మానవుడిని రేపు రాకుండా ఎవరైనా ఆపండి చూద్దాం!)
నేటి నినాద ప్రకటనదారుడు మహమ్మద్ జాని.
నాగాయలంక రోడ్డు సేవల కోసం రేపటి వేకువ మనం కలిసేది ఈ 3 రోడ్ల కేంద్రమే!
జలగల వలె
అది ఊరికి జలగల వలె పట్టిన అదృష్ట మేమొ
చల్లపల్లి గతజన్మలొ చేసుకొన్న తపస్సేమొ
గ్రామస్తులు పొరపాటున పుణ్యమేదొ చేసిరేమొ
నిరంతర శ్రమదానము నిశ్చయముగ జరుగుతోంది!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
30.09.2026