3972* వ రోజు.....           02-Oct-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం!

శుక్రవారం గాంధీ జయంతి నాటి శ్రమ వేడుకను పరిశీలిద్దాం రండి! - @3972*

               ఈ గాంధీ మహాత్ముని త్యాగాలనే ఇప్పుడు దేశం సరిగా స్మరించుకోవడం లేదు. ఆఫ్టరాల్ – ఒక మారుమూల పురాతన చల్లపల్లి గ్రామం కోసం ఈ వేకువ 35+ ముగ్గురి (చివరి ముగ్గురూ పంచాయితీ సంబంధీకులు) శ్రమనూ, అందుమూలంగా స్వచ్ఛ - పరిశుభ్ర సంశోభిత నాగాయలంక రహదారిని ఏ కొద్దిమందో తప్ప ఎవరు పరిశీలించి, మెచ్చి, ఆచరణకి దిగుతారులెండి!

               పైగా ఇది కేవలం ఆ వీధికి చెందిన 250 గజాల మేర లభించిన శుభ్ర - సౌందర్యములేనాయే! కాని -  ఎప్పటిలాగే కార్యకర్తల ప్రతి ప్రయత్నాన్నీ, కారుతున్న చెమట బిందువుల విలువనూ నేను ఊహించాను!

               బంకు ఎదుట ట్రాన్స్‌ఫార్మర్ అంతర్గత బుల్లి ఉద్యాన సౌందర్య పరిపూర్ణత కోసం 5 గురు ఎంత పట్టుదలగా పనిచేశారో,

               అంత బరువైన డ్రైను మూతను ఇద్దరు ఎంత అవలీలగా ఎత్తేశారో, రోడ్డు మార్జిన్ పేవర్ టైల్స్ కనపడకుండ 2 అంగుళాల మందపు మడ్డిని ఇద్దరు పారలతో గోకి, ఊడ్చి, డిప్పలకెత్తి – ట్రాక్టర్ లోకి చేర్చిన ఉద్దేశమేమిటో తెలుసుకొంటున్నాను - మనకు వ్యర్థాలుగా కనిపించే ఆ దుమ్ము + ఇసుక మిశ్రం కార్యకర్తల దృష్టిలో విలువైనది - కాసానగర తటాక గట్టు కది చాల అవసరం!

               ఇంతకీ నేటి శ్రమదాతల్లో సగం మంది చల్లపల్లి కార్యకర్తలు - మళ్ళీ అందులో సగం పొరుగూళ్ళ నుండి మైగ్రెంట్లు! 4 కిలోమీటర్ల దూరపు వెంకటాపురపు బడి వాళ్లు నలుగురూ, 3 కిలోమీటర్ల దూరపు శివరాంపురపు - రామానగరపు కార్యకర్తల కలగూరగంపన్న మాట - ఈ 35 మంది బలగం!

               RTC బస్ స్టాండు ఔట్‌ గేటుకు చేరుకోకుండానే నేటి స్వచ్ఛంద శ్రమదాన యాత్ర ఆగిపోవడం కొందరికి అసంతృప్తినే మిగిల్చింది! అందుకే వేకువ 4.19 కే ప్రారంభమైన వీధి పారిశుద్ధ్య ప్రయత్నాన్ని DRK గారు 6.02 కి ఆపాలని చూసినా - విజిల్ వినిపించినా - 6.10 దాకా ఆపుదల సాధ్యపడలేదు!

               అసలు ప్రతి వేకువ శ్రమదానంలోనూ బాగా ఆకర్షణీయ ఘట్టం చెత్త లోడింగే కాని - ఈ పూట దాన్నిమించిన చివరి 10-12 నిముషాల పనులు మరింత దర్శనీయంగా ఉన్నాయి. అందుకే - కాస్త ఆలస్యంగా వచ్చిన కాంట్రాక్టరు కార్యకర్త నాదెళ్ళ వేణు (ఫ్రం నడకుదురు) గారు, నాతో ఇలా అన్నారు –

               వ్యవసాయదారులు అన్నపానీయాలనూ మరచి – సొంత క్షేత్రంలో పని మిగిలిపోరాదని పనిచేస్తుంటారు, ఈ కార్యకర్తలేమో సమయం మించిపోయినా అనుకొన్న మేర ఊరి పని ముగించాలని ఈ కర్మక్షేత్రంలో కష్టపడుతుంటారు!

               వెంకటాపురం విద్యార్ధి చిరంజీవి అఖిలేష్ నినాదాలతో ప్రారంభమైన నేటి సమీక్షా సభ DRK గారి అనేకానేక శ్రమదానోద్యమ జ్ఞాపకాలతో

               ‘మనకోసం మనం’ ట్రస్టుకు బందరులో ప్రభుత్వం వారు ఇచ్చే N.G.O బహుమతి ఇచ్చేందుకు నాలాంటి కొందరిని పంపించే నిర్ణయంతోనూ ముగిసింది.

               విరిగి పడి - వ్యర్థాలనుకొన్న చెట్ల కొమ్మలతో చేసిన అందమైన 2 బెంచీలను చల్లపల్లి శ్రమదానోద్యమం గ్రామ పంచాయితీకి బహుకరించింది.

               రేపటి మన పారిశుద్ధ్య కృషి చంటి గారి హోటల్ వద్దనే!

               చల్లపల్లికి శ్రమల హారతి!

ఊరి యెడల బాధ్యతదిగో – ఉన్న ఊరికి సేవలివిగో

శ్రమత్యాగము అది వినోదము – సమయదానము అది ప్రమోదము

అదొక కలివిడి – అదొక సందడి – స్వచ్ఛ సుందర పనులు రాపిడి

చతుస్సహస్ర దినాలుగ ఈ చల్లపల్లికి శ్రమల హారతి!

- నల్లూరి రామారావు

    రిటైర్డ్ ప్రిన్సిపాల్

    02.10.2026