పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం!
చెప్పుకొనదగిన ఈ వీధి శ్రమలు శనివారము (03.10.26) నాటివి! @3973*
అవి జరిగిన గ్రామ భాగం ముత్యాల చంటి తిను బండారాల దుకాణ ప్రాంతమున బందరు వీధి యందే! సేవకులో – బాధ్యులోగాని - వాళ్ళ సంఖ్య ఒక్కరు తక్కువగా నలభై మంది!
తన ఇంటి సమీపం కావున చాలకాలం పిదప వచ్చిన అడపా రాంబాబు నేటి స్వచ్ఛోద్యమ నినాదకర్త! గాంధీ మహాత్ముని దృష్టిలో భగవత్ గీత గొప్పదనాన్ని వివరించిన అతని అగ్రజుడు గురవయ్య గారు నేటి నీతి వాక్య ప్రబోధకుడు!
“చల్లపల్లిని బాగుచేశారు కదా - చుట్టూ రహదార్లను హరిత – సుందరీకరిస్తున్నారు గదా - ప్రక్కనున్న మా ఊళ్లను కూడ శుభ్రపరచవచ్చును గదా” - అనే కొందరు ప్రవాస జీవుల కోరికలనూ,
నిన్న బందరులోనూ ఇతరత్రా పంచాయతికీ, ‘మనకోసం మనం’ ట్రస్టుకూ దక్కిన గుర్తింపులను గూర్చీ వివరించినది DRK అనే పొట్టి పేరున్న డాక్టరు!
తనకు క్రొత్తగా ఈ నెల D.A. పెరిగినందున 5 కాదు - 7 వేలను ట్రస్టు ఖర్చులకూ, కార్యకర్తలకు బిస్కత్తులనూ పంచి ఆనందించినది P.శాస్త్రి గారు!
పనిలో పనిగా నా నెలవారీ చందా 10 వేలనూ, వేరొక గుప్తదాత యొక్క 5 వేలనూ సమర్పించినది స్వయంగా నేను,
ఇవి మాత్రమే కాక చీమకుర్తి డాక్టరు బందా జవహర్ గారి 10 వేలు,
నాయుడు శ్రీధర్ గారి 15 వేలు,
దాసరి స్నేహ గారి 15 వేలు,
తుమ్మల రాంబాబు గారి 5 వేలు,
ఇవీ ‘మనకోసం మనం’ ట్రస్టుకు ఇప్పటికి అందిన అభిమానపూర్వక చందాలు!
మరి స్వచ్ఛ - సుందరోద్యమకారుల ఈ నాటి వీధి పారిశుద్ధ్య శ్రమ సంగతి! వాళ్లు విజయవాడ బాటనో, బస్ స్టాండు చోటునో కాక – 10 రోజుల తర్వాత వెనుకకు వచ్చి, చంటి హోటల్ వద్ద ఆగుటెందుకు?
ట్రాక్టర్ నిండా ఎండిన డ్రైను మట్టిని నింపుకొనుటేల?
10 మంది ఆడ కార్యకర్తలు తమ ఇళ్ల వద్ద పనులు చాలకనా - ఈ 150 గజాల వీధిని అదే పనిగా ఊడ్చిన వైనమేమి?
ఆర్చి వద్ద 7-8 మందికి ప్రొద్దున్నే డ్రైను కంపు పనులేల?
6.00 కే విజిలు మ్రోగినా 6.10 దాక అంతంత బరువైన డ్రైను పలకలను ఎత్తి - మోసి కళాత్మకంగా అమర్చనేల?
యాక్సిడెంటుతో దెబ్బతిన్న కాళ్లతో పాటల శ్రీను అలా పనులు చేయవచ్చా? .... ఇలాంటి ప్రశ్నలకు శ్రమదానపూర్వక సమాధానమే ఈ 3973* వ శ్రమదాన వేడుక!
ఐతే నేటి అడపా రాంబాబు గారి పునః ప్రవేశమువలెనే - ప్రతి వేకువా ఎవరైనా వచ్చి - ఈ దైనందిన శ్రమలను ఆశీర్వదిస్తూ ఉండాలి!
రేపటి శ్రమ కూడ చంటి హోటలు ప్రాంతమునందే!
సామాజిక పరిశీలక మేధావుల ఎదలు తట్టి
ఆరోగ్యం నిలబెట్టే – అద్భుతమని అనిపించే – ఆచరణకు పురిగోలిపే
ఆసక్తిని పెంచేసే – ఆశ్చర్యం కలిగించే – అనందము వికసించే....
మన కాలపు విడ్డూరము మనసులు తొలిచేస్తుంటది -
అదే స్వచ్ఛ చల్లపల్లి దైనందిన శ్రమ విభవము!
-నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
03.10.2026