పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం!
3974 * వ విడత - 4.10. 26 నాటి శ్రమ వినోదాలు!
మరి ఆదివారమా మజాకా? కనీసం వేకువ 4:30 వరకు కూడ - ఆగలేని 22 మంది స్వచ్చోద్యమ కారులు 4.18 వేళకే బందరు రహదారికి చెందిన చంటి హోటలు వద్ద తయారయ్యారు.
ఉద్యమం తొలి రోజుల్లో ఐతే - ఈ జీతం భత్యంలేని వీధి ఊడ్పుల్నీ, మురుగు కాల్వ పనుల్నీ అధిక సంఖ్యాక గ్రామస్తులు క్రొత్త రకం వింతగా చూసేవాళ్లు. కాల క్రమాన కొందరు "తెలివైన" వాళ్ళు "ఈ కార్యకర్తలేమైనా తెలివి తక్కువ వాళ్లా? ఎక్కడెక్కడి నుండి ఎన్నెన్ని లక్షలొచ్చి పడుతుంటే ఈ దరిద్రపు పనులు చేస్తున్నారో! " అని అసూయ పడే వాళ్లు ! ఇప్పుడు మాత్రం "ఏదోలే! అదోరకం వ్యసన పరులు"అని సరి పెట్టుకొంటున్నారు!
ఐతే- ఇదే చల్లపల్లిలో కొందరు మాత్రం చప్పున ఈ శ్రమదానోద్యమం ఈ ఊరికే గాదు - సమస్త దేశానికీ మార్గదర్శకం, ఆచరణీయం అని గ్రహించిన వాళ్లూ ఉన్నారు! అట్టి సానుకూలుర అండ దండలు స్వచ్చ కార్యకర్తలకు లభిస్తూనే ఉన్నవి ! వాళ్లవే కాదు- ప్రస్తుత, మాజీ కేంద్ర మంత్రులు - ముఖ్య మంత్రులు సైతం ఈ ఉద్యమం లోతుపాతుల్ని పసి గట్టి -"ఈ పన్నెండేళ్ల చల్లపల్లి స్వచ్ఛంద సేవలు అద్భుతం" అని కొనియాడుతూనే ఉన్నారు!
కాని - స్వచ్చ సైనికులూ, వాళ్లకు దిశానిర్దేశంచేసే DRK డాక్టరూ మాత్రం "ఈ చల్లపల్లిలో నెరవేరిన ఉద్యమాశయాలు సగం మాత్రమేననీ, మరో దశాబ్దమైనా సంపూర్ణ విజయానికి సమయం పట్టొచ్చనీ, అందుకు ప్రభుత్వాల తోడ్పాటు మరింత లభించాలనీ "ఆలోచిస్తుంటారు!
ఈ వేకువ చిన్నలూ-పెద్దలూ మొత్తం 47 మందైతే కార్యకర్తలూ, పంచాయతి సిబ్బందీ, 12 ఏళ్ల బుడ్డోడూ, ఐదారేళ్ల అర బుడ్డోడూ సహా బందరు వీధిలోకి వచ్చారు గాని - అక్కడి పని ½ గంటలోనే పూర్తైతే ఇక ఇంటికెళ్లి పోదాంలే అనుకోలేదు!
20 మంది కమ్యూనిస్టు వీధిలో చొర బడ్డారు; మరికొందరి చీపుళ్లు అడపావారి వీధినీ, షాబుల్ వీధినీ ఊడ్చాయి; పెద్ద మసీదు దిశగా కొందరు పునః శుభ్ర పరుస్తూ పోయారు!
ఈ తేలిక పనులు చాలక కొందరు 100 గజాల బారునా డ్రైన్ల కప్పులైన బరువైన కాంక్రీటు పలకలను -సుమారు 35-40 మూతలను అందంగా అమర్చారు! ఆ 200 గజాల ప్రదేశంలో ఇందరు రకరకాల పనులతో తిరుగాడుతుంటే గంటన్నర పాటు ఆ శ్రమైక జీవన సౌందర్య వైభవాన్ని ఎలా వ్రాయాలో నాకర్థం కాలేదు!
6.00 సమయానికి, కాఫీలతో బాటు పల్నాటి దంపతుల వేడి రాగి జావ సిద్ధమైంది ! రాజ్యలక్ష్మి ఆస్పత్రి వీధిలో అందరూ కొలువు తీరిన వేళ-
- వెంకటాపురపు ప్రభాకర్ అనే ట్రస్టు కార్మికుడు క్రొత్తగా వాగ్గేయకారుడై వినిపించిన, ఘంటశాల గాయకుడు ఆలపించిన పాటలూ,
-గోళ్ళ కృష్ణ ఎలుగెత్తిన నినాదాలూ, శాంతల జయలక్ష్మి గుర్తు చేసుకున్న గాంధీ జయంతి నాటి CM గారి
అభినందనలూ- మాధవేంద్రుల వారి, డాక్టరు DRK గారి సమీక్షలూ –
రేపటి శ్రమదాన నిమిత్తం అందరం 3 రోడ్ల సెంటరులో కలవాలని నిర్ణయమూ... నేటి విశేషాలు!
ముఖమను అద్దమునందే
నీరసమే కనిపించదు – నిర్వేదము చూపట్టదు
‘ఎంత వెర్రి పని ఇది’ అని ఏ ఒకరికి అనిపించదు
ఎవరిని పరిశీలించిన ఏదో సాధించినట్లు
ముఖమను అద్దమునందే బోధపడును ప్రతి ఉదయము!
-నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
04.10.2026