పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడుతున్నందుకు సిగ్గు పడదాం!
4000*-25 వ (సోమవారం, అక్టోబరు పంచమదివసపు) శ్రమానందం!
ఆ ఆనందమేమీ అంగడి సరుకు కాదు, ఈ వేకువ 4:20 నుండి 6:05 దాక - తమ కోసం కానే కాక - ఊరు ఊరంతా సంతోషించాలని, ఆరోగ్యంగా రోజంతా గడపాలనే గొప్ప సుహృద్భావంతో 27 గురు - దుమ్మనక, ధూళనక - చెమటలు క్రక్కుతూ పొందిన మహదానందం!
సదరు ఆనందం గనుక వాళ్ళ సొంత లాభం కోసం సాధించినదైతే ఏదో నాలుగు వాక్యాల్లో వ్రాసి, దులిపేసుకొనే వాడిని!
దేశమంతా పన్నెండేళ్ల నుండీ ఈ చల్లపల్లి శ్రమజీవన విధాతలను గూర్చి కోడై కూస్తుంటే – 30 కి పైగా ఊళ్లు దీన్ని అనుకరించాలని ప్రయత్నించి పాక్షిక విజయాలైనా సాధిస్తే – తమ సొంతూరి సుదీర్ఘ దైనందిన శ్రమ వైభవాన్ని చాల మంది గ్రామస్తులు హర్షిస్తే - ఇప్పటికీ స్వచ్ఛ - పరిశుభ్ర – హరిత – సౌందర్య స్పృహలోకి రాని సగం మంది కళ్లెదుట కనిపిస్తుంటే...... నేను దీన్నెలా పొగడాలి?
ఎండా - వానా ఒకేమారు ఒకే చోట కురిసినట్లు – చల్లపల్లిలో ఇదొక ద్వెధీ భావం ! గాంధీజీ వంటి - కందుకూరి వీరేశలింగం వంటి - ఇంకా చలం, శ్రీశ్రీ వంటి వాళ్లెదుర్కొన్న ద్వంద్య పరిస్థితే ఇది!
ఇక నా ఈ సొంత సోది పురాణం కాస్త ప్రక్కన పెడితే:
నిత్య గ్రామ పారిశుద్ధ్య కర్మిష్టులైన స్వచ్ఛంద శ్రమదాతల నిరాశలాంటి వాటికి తావివ్వరు. అర్జునుడి దృష్టి పక్షి కంటి మీద కేంద్రకృతమైనట్లు - వారి శక్తియుక్తులన్నీ కోటసెంటరు 3 రోడ్ల స్థలం నుండి 150 గజాల దూరంలోని స్వగృహ ఫుడ్స్ దాక ఏ వ్యర్దాలున్నవి - రోడ్ల గుంటలెప్పుడు పూడుతవి - క్రిక్కిరిసిన దుకాణాల ఎదుట ఏం చేస్తే వీధి అందంగా కనుపిస్తది... వంటి సంగతుల పైనే!
చాల మంది దృష్టిలో ఆ వ్యర్ధాలు పనికిరానివే కాని - వీళ్ళలా కాదు - దుమ్మూ + ఇసుకను ట్రాక్టర్లో నింపుకొని - కాసానగరు చెరువు గట్టును పటిష్టపరుస్తారు! సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లను ఏరి, రీసైకిలింగుకు పంపుతారు!
ఈ వేకువ పనులన్నీ అనుకొన్నట్లు బాగానే జరిగాయి గాని - వాహన రాకపోకల రద్దీని కాచుకొంటూ జరుపవలసి వచ్చింది.
ఒక భారీ వృద్ధ కార్యకర్త (వయసు Just 72!) 3 నిముషాల ముందే పని విరమించి, మెట్టు మీద కూర్చొంటే – “మరీ అంత చెమటేమి?” అని నేనడిగితే చెప్పిన జవాబు – “ఈ 2 గంటల పనీ, చెమటలేమీ” లేకపోతే ఎప్పుడో గతించే వాడిని,
అతడే - అంటే చెక్ పోస్టు బాబాయే నేటి భీకర నినాద ప్రవర్తకుడు! ఆ దగ్గర్లో ఉన్న 5 గురు ఆటో డ్రైవర్లూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు.
‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యుడైన డా. దాసరి వరుణ్ గారి 15 వేల ఆన్లైన్ విరాళం నేడు అందినది.
ఇక DRK డాక్టరు గారేమో తన సమీక్షలో “మనం చేసిన దానికన్న చేయవలసిన ఊరి పనులెక్కువగా ఉన్నవి అనీ, మన శ్రమదానంకన్న ప్రశంసలెక్కువ ఔతున్నాయి” అనీ చెప్పి,
రేపటి శ్రమదానం స్వగృహ హోటల్ వద్ద నుండి అని కూడ సెలవిచ్చారు!
‘అదుగో పులి’ అనగానే
‘అదుగో పులి’ అనగానే ‘ఔను ఇదే దాని తోక’
అను నైజము కలవాళ్ళకు అర్ధం కాని శ్రమవేడుక
ఏ షరాబు కొలవగలడు ఈ సామాజిక బాధ్యత?
ఏ చరిత్ర పేర్కొన్నది ఇంత గొప్ప నిబద్ధత?
-నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
05.10.2026