3976* వ రోజు.....           06-Oct-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడుతున్నందుకు సిగ్గుపడదాం!

3976* వ - 40 పని గంటల శ్రమదాన సంగతులు - (మంగళవారం – 6.10.26).

               ఈ నాటి శ్రమదాన ముహుర్తం కూడ పదముగ్గురిది వేకువ 4:19 సమయమే! మొత్తం కార్యకర్తలెంతో మంది లేరు - పొదుపుగా వాళ్ల సంఖ్య 29 మాత్రమే! పరిశుభ్ర - సుందరీకృత బెజవాడ మార్గం కూడ 60 గజాల బారుకు మించదు!

               ఒక గంట పని ముగిశాక కార్యకర్తలే ఖంగుతిన్నారు – “ఇదేమిటి ఈ చిన్న వీధి భాగంలోనే ఇంత దుమ్మా? ఇంత ఇసుకా? ఈ 10 - 12 దుకాణాల వద్దనే ఇన్ని వ్యర్ధాలా? 2 పూటలా చెత్త సేకరణ ట్రాక్టర్లు తిరుగుతున్నా - డబ్బాలో పెట్టి - పంచాయితి కార్మికుల కందించక - ప్రొద్దుపోయాక - షాపుల ముందుకు విసిరే అలవాటింకా మానరా?” అని!

               కాని, కార్యకర్తలేమీ నిరుత్సాహపడలేదు - నీరసించలేదు. స్వగృహ ఆహారశాల వద్ద చివరి 20 నిముషాలు మళ్లీ కోలాహలమే - పంచాయతి పారిశుద్ధ్య కార్మికులు వచ్చి కలిసినపుడు చూడాలి – ఆ పని హడావుడి, ఆ బెజవాడ వీధి శుభ్రపడుతున్న తీరు గ్రామ క్షేమాభిలాషులకదొక శ్రమజీవన సౌందర్య దృశ్యమాలిక!

               నమ్మశక్యం గాని ఇలాంటి శ్రమ వైభవాన్ని, అందుమూలంగా నిత్యాలంకృతమౌతున్న వీధుల్నీ చూడాలనే ఎందరెందరో - ఎన్ని ప్రాంతాల నుండో వస్తుంటారు!

               పొగిడే వాళ్లు పొగుడుతుంటారు! కొంతమందైతే - తమ అంగళ్ళ ముందు, ముంగిళ్ల ఎదుట స్వచ్ఛ కార్యకర్తలు శ్ర మిస్తూంటే చూసి కూడ ప్రతిస్పందించరు!

               “ఈ గ్రామ ప్రయోజనకర పరిశుభ్ర - చర్యల్నీ - దాని అనుపానుల్నీ - లోతుపాతుల్నీ - బహుళ ప్రయోజనాత్మక శ్రమ వైభవాన్నీ” నూరు శాతం గ్రహించే వాళ్లు మాత్రం తక్కువనే చెప్పాలి?

               ఈ వేకువ సంగతే చూడండి – ఎందరు గ్రామస్తులూ, స్వచ్చోద్యమకారుల పరిచయస్తులూ పని స్థలం గుండా వెళ్లారు - వచ్చారు? హోటళ్ల వారు కూడ చూస్తూనే ఉన్నారు కాని - ఎవరైనా వ్రేలు పెట్టారా?

               కార్యకర్తలు మాత్రం మూలమూలల కాలుష్య దౌర్భాగ్నాన్నీ బైటికి లాగారు, ట్రాక్టరు సగానికి దుమ్మూ - ఇసుకా, రాతి ముక్కలూ నింపుకొన్నారు, ఇతర పొడి చెత్తల్ని మాత్రం పంచాయతి కార్మిక సోదరులకు వదిలేశారు, అర ట్రాక్టరు దుమ్మూ+ ఇసుక మిశ్రం మాత్రం కాసానగర చెరువు గట్టుగా తరలిపోయింది!

               6.08 కి కోట ఉత్తర గుమ్మం ఎదుట - చెరువు మూల ఎట్టకేలకు శ్రమ సందడి ముగిసి, కబుర్లు మొదలై, కాఫీ ఆస్వాదనతోబాటు సాగి,

               స్వగృహ ఫుడ్ జంక్షన్ ఎదుట ట్రస్టు కార్మిక నాయకుడైన సీనియర్ కస్తూరి సుస్పష్టంగా నినదించిన గ్రామ స్వచ్ఛ - శుభ్ర సాధక ప్రతిజ్ఞలతో సభ ప్రారంభమై,

               నిన్న ఆన్లైన్ లో నాదెళ్ళ సురేష్ గారి నెలవారీ చందా 20 వేలు కాక, ఒక అజ్ఞాత దాత చందాను నేను DRK గారి కందిస్తూ చెప్పిన విశ్వామిత్ర - నక్షత్రక - హరిశ్చంద్రుల కథతోనూ -

               రేపటి వీధి శ్రమ బెజవాడ రోడ్డు నందేననే నిర్ణయంతోనూ ముగిసింది!

            ఎవరిదింత కర్కశము?

సంవత్సరాల తరబడి ఈ స్వచ్ఛ కార్యకర్తలు తమ

స్వేద జలంతో మొక్కలు పెట్టి సాకుకొనుచుంటే –

పీకేయుచు, కాల్చేయుచు పైశాచిక వినోదమా!

ఎవరిదింత కర్కశము? ఏమిటి ఈ న్యాయము?

-నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   06.10.2026