3977 వ రోజు.....           07-Oct-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడుతున్నందుకు సిగ్గుపడదాం!

3977* వ శ్రమ సమాచారం! (7-10-26 - బుధవారం)

               నిన్నటికన్న కార్యకర్తల సంఖ్య కాస్త తగ్గి 26 గానే ఉన్నా, ఆ బెజవాడ బాటలోని గృహస్తులు గాని, శివాలయ సంబంధీకులు గాని – టిఫిన్, టీ కొట్ల వారు గాని సహకరించకపోయినా వేకువ 4:21-6.04 నడుమ - దండమూడి కస్తూరి మామ్మ గారి గార్డెన్ - కోట ప్రక్కన గాయత్రీ బ్రాహ్మణ సంఘ భవనాల నడుమ వీధీ, రోడ్ల మార్జిన్లు బాగుపడినవి!

               కార్యకర్తల శ్రమదేముంది - వాళ్లెప్పుడూ చేస్తున్నదే - ఊరి ప్రధాన వీధుల్లో ఏ కాగితమ్ముక్క కనపడినా, ముఖ్యంగా ప్లాస్టిక్ తుక్కులు కనపడినా, పిచ్చి మొక్కలున్నా, ఆఖరికి బ్రతికిన – చచ్చిన గడ్డి పరకలున్నా వాళ్లకు చిరాకే! ఇక ఫ్లెక్సీలు నట్టనడి వీధిలో దర్జాగా నిలిస్తే చేసేదేమీ లేక బాధను దిగమ్రింగుకొంటారు!

               నిన్న శుభ్రపరచిన బెజవాడ వీధిలో మళ్ళీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు ప్రత్యక్షమైనపుడు సహనంతో గోతాంలో నింపుకొంటారు! ఏ పూటకాపూట డిప్పల కొద్దీ ఇసుక+దుమ్ము ఊడ్చి, 2 కిలోమీటర్ల దూరాన కాసానగర్ చెరువు గట్టును పటిష్టపరుస్తూనే ఉంటారు!

               “ఏమయ్యా! 20 నిముషాల్నుండి నడుమ్మీద చేతులు వేసుకొని మమ్ము అలా చూస్తూ ఉండకపోతే - నీవు కూడ వచ్చి కాస్తంత ఈ వీధిని బాగుచేయవచ్చు గదా? ఈ ఊరు నీది కూడ కదా?” అని ఎవర్నీ పిలవరు!

               ఐతే ఈ వేకువ మాత్రం వాళ్లకి కోట చెరువు మూల వద్ద ఎండూ, పచ్చీ పుల్లలూ, కొమ్మలే ఎక్కువ వచ్చాయి!

               ఇద్దరు రైతు కార్యకర్తలూ, ఒక కాంపౌండరూ మాత్రం “ఈ పూటన్నా శివాలయం ఎదుట గడ్డీ, పిచ్చి మొక్కలూ పూర్తి చేద్దామనుకొన్నాం గాని, రేపటికింకా మిగిలిపోయినవే!” అనుకోవడం విన్నాను!

               అక్కడికి దూరంగా శ్రీమంతు క్లబ్బు వద్ద నలుగురు శుభ్రపరచిన వీధిని గమనించాను! అప్పుడే నందేటి శ్రీనివాసుడు కాఫీలు మోసుకురావడం చూసి, “టైము 6.00 దాటినట్లు గ్రహించి, ఈల మ్రోగించాను. అంతటితో నేటి శ్రమదానము ముగిసి, పాతిక మంది కార్యకర్తలు ఆ 100 గజాల వీధిలో తమ తమ ఆయుధాలతో అదో రకం ఠీవితోనడిచి వస్తుంటే కన్నుల పండుగగా వీక్షించాను!

               పడగొట్టి మళ్లీ కడుతున్న శ్రీమంతు క్లబ్బు వద్ద శ్రమదానోద్యమాన్ని జయ జయ ధ్వానాలతో ప్రారంభించినది వెంకటాపుర వాస్తవ్యుడైన వేంకటేశ్వరరావు!

               సరిగ్గా అదే చోట - అనగా శ్రీమంతు క్లబ్బు వద్ద మన రేపటి శ్రమదానం మొదలవ్వాలని కోరినది సజ్జా ప్రసాదు తదితరులు!

               రథం యాత్రకు నీవు సైతం

స్వచ్ఛ - సుందర తాత్త్వికతతో, వాస్తవిక దృక్పథం తోడుగ

ఎవరికీ ఏ హాని చేయని - ఎంతొ కొంతగ హితం కూర్చే

స్వచ్ఛ – సుందర శ్రమోద్యమమున చేరి చూడుము వెంటనే

రథం యాత్రకు నీవు సైతం సహకరించుట మేలు నేస్తం!

-నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   07.10.2026