పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడేవాళ్ళం సిగ్గుపడదాం!
10-10-26-శనివారపు సామాజిక బాధ్యతల గురించి వ్రాయాలంటే...! @3980*
నా కలంలో సిరా బాగానే ఉంది – వ్రాయగలను – కాని రోజుటి లాగా ఒక్క పేజీలో ఇరికించి, కుదించడం మాత్రం చాలా కష్టం! నాలుగైదు పేజీల్లో – విచ్చలవిడిగా వ్రాయమంటే హ్యాపీగా వ్రాసేస్తాను!
ఈ వేకువ తొలి ఫొటోకు వచ్చి, పని మొదలు పెట్టిన 22 మందినీ, తరువాత బిలబిలమంటూ బెజవాడ రోడ్డులోని శ్రీమంతు క్లబ్బు వద్దకు వచ్చి, సాయుధులై, వీధి కాలుష్యాల మీద విప్లవించిన 30 - అంటే మొత్తం 52 మందినీ ఒక్క అరగంటు పాటు పరిశీలించి, అభిప్రాయం తెలపమని వేరెవర్నయినా అడిగారనుకోండి - వాళ్లు బహుశా ఇలా వ్రాస్తారనుకొంటా:
- “ఓరి బాబోయ్! ఈ బురద నీళ్ల చోటున – ఏ మాత్రం గౌరవప్రదం కాని ఈ చెత్త పనుల కంచిగరుడ సేవ కోసం - గౌరవనీయులుగా గుర్తింపు పొందిన సీనియర్ మోస్ట్ డాక్టర్లూ, ఊపిరి సలపని పొలం సొంత పనులున్న రైతులూ, ప్రస్తుత - గతకాలపు H.M.లూ, ప్రిన్సిపాల్సూ, నర్సులూ, విద్యార్థులూ, గృహిణులూ వేకువ 4.20 కే - చీమల పుట్ట పగిలినట్లు రావడమేమిటో” అనీ,
- ఇలా కంపుగొట్టే మురుగుకాల్వ పనులు చేసే – ప్లాస్టిక్ తుక్కులేరే - మెకానిక్ షెడ్ల లోపలా, వెనకా దూరి, శుభ్రపరిచే – కొబ్బరి బొండాల్నీ, కూరల వ్యర్ధాల్నీ ప్రోగులు చేసి, ట్రాక్టర్ కి ఎత్తే - గంటన్నర తర్వాత దుమ్ము కొట్టుకొని, అది చెమటల కంటుకొని, కొందరు గుర్తుపట్టలేనంతగా మారిపోయే – పారిశుద్ధ్య పనుల్లో పోటీలు పడే స్వచ్ఛ కార్యకర్తలనబడే మనుషులెవర్రా నాయనా? ఈ భూ ప్రపంచంలో ఇలాంటి జాతి కూడ ఒకటుంటుందా?....” అనీ,
“అదుగో - ఒక క్రొత్త ముఖం (రవీంద్ర) - మోపిదేవట - అసలీ తతంగమంతా ఏమిటో చూడాలని వచ్చి చూసిచూసి, ఫిదా ఐపోయి, ఏమైనా సరే రేపటి ఉదయం నేను కూడ ఈ శ్రమదానంలో పాల్గొంటా నంటున్నాడేమిటా!” అనీ,
“ఈ వీధి నుండి తయారైన ఇసుక+దుమ్ము ట్రాక్టర్ నిండా నింపుకొని, శ్మశానంలో గుంటలు పూడుస్తారట - ఈ చల్లపల్లికి సేవలు చేసేది చాలక - ఇలా చుట్టూ 8 రోడ్ల గుంటల్నీ పూడుస్తారట - 33 వేల చెట్లు నాటి, కంపలు కట్టి, పచ్చందనాన్ని పెంచుతారట - వీళ్లకిదేమన్నా వ్యసనమా?” అనీ,
“అది సరే - ఈ 52 మందీ ఆ సిమెంటు షాపు వద్ద నిలబడి - కోట పద్మ నినాదాలను ధ్వనించడమూ, మిగిలిన వాళ్ళు ప్రతిధ్యనించడమూ, 3980 రోజులుగా ఇదే వరసట! ఇది వ్యసనమో - బాధ్యతో – సేవో గాని – దేశంలోని 6 ½ లక్షల గ్రామాల్లో ఇలా జరగదేమిటి?” అనీ,
“ఆయనెవరూ - DRK ప్రసాదట - ఆయనే వీళ్లందరికీ శ్రమదానం అనే జబ్బునంటించాడని విన్నా – అదేంటో - శ్మశానాల రోడ్ల పనులింకా మిగిలిపోయాయనీ, అవి కూడ మన బాధ్యతలే నంటాడేమిటి?
“ఇదేదో గోళ్ళ వారి కుటుంబమట - ఇంత ప్రొద్దున్నే కార్యకర్తలకు తిన్నంత టిఫిన్ చేసుకురావడమేమిటీ” అని,
“కలెక్టరేట్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, ఇక్కడేమో స్వచ్ఛ కార్యకర్తగా ద్విపాత్రాభినయం చేస్తున్న తూము వెంకటేశ్వరరావట - తన రెండవ మనవడు ‘విరన్ష్ ప్రణయ్’ మొదటి పుట్టినరోజు సందర్భంగా 5,000/- స్వచ్చోద్యమ ఖర్చులకు ఇవ్వడమేమిటీ?” అని, కాక ఇంకా ఎలా వ్రాస్తారు?
రేపటి శ్రమదానం HDFC బ్యాంకు వద్దనని తెలిసింది!
దైహిక శ్రమ ఆపకుండా
స్వచ్ఛ సంస్కృతి బాట పట్టీ, ఋజు ప్రవర్తన మానకుండా –
దైహిక శ్రమ ఆపకుండా దేశమున కాదర్శకరముగ
దశాబ్దంగా కలుషములపై ధర్మయుద్ధం నెరపుచుండిన
కార్యకర్తల గన్న ఊరే కదా ఒక ప్రత్యేక గ్రామం!
-నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
10.10.2026