2033*వ రోజు....           05-Jun-2020

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2033* వ నాటి పారిశుద్ధ్య ధీరతలు.  

          నేటి వేకువ కూడ 4.01 – 6.00 మధ్యస్త 2 గంటల సమయంలో 29 మంది గ్రామహితకారులు – నిన్నటి కొంతభాగంతో సహా – ఇటు బందరు – అటు విజయవాడ మార్గాలను శుభ్రపరిచారు. మరొక మారు రావి రాఘవయ్య పెట్రోలు బంకు మొదలు – కోట ఉత్తర ద్వారం మీదుగా బ్రాహ్మణ కర్మ భవనం దాక క్షుణ్ణంగా – రకరకాలుగా – స్వచ్చ సుందరం కావించారు.

          2030 దినాలకు పైగా – ఇందరు పెద్దలకు, కొందరు తాము చల్లపల్లి వాస్తవ్య్తులు కాకున్నా 3.30 కే నిద్ర లేచి గ్రామ రహదార్లను, అవసరమనుకొన్న ప్రతి చోటును సొంత డబ్బును – శ్రమను ఆర్పిస్తూ తమ శక్తి మేర మరింత మెరుగులు దిద్దే అవసరం ఏమి వచ్చింది? మొండిగా – బురదైనా – మురుగైనా – ముళ్లైనా – చెత్త, దుమ్ము, ఎంగిలి .... ఏదైనా ఏరి, ఎత్తి మాటిమాటికీ ప్రతి వీధినీ, ప్రజోపయోగ నిమిత్తం తీర్చిదిద్దే పనులు ఎన్నాళ్లు? ఎందుకిలా? స్వార్ధమా? అది లేదని పదేపదే ఋజువైపోయింది. మరి ఏ సిద్ధాంతం వీళ్ళ నింత కాలం నడిపిస్తున్నది? తమ దైనందిన జీవితాన్ని ఈ గ్రామ శుభ్ర సుందరీకరణంతోనే ప్రారంభించే ఈ కార్యకర్తలు ధన్యులో – మాన్యులో – అన్యులో (అనగా వెర్రి వాళ్ళో) గ్రామ ప్రజలిప్పటికైనా గట్టిగా ఆలోచించాలని నా మనవి!

          తాము చిరకాలంగా నమ్మిన – ఆచరిస్తున్న గ్రామ శ్రమదానంలో భాగంగా :

- సుందరీకరణ దళం ఈ రోజు కూడ మూడు రోడ్ల కూడలిని ఊడ్చి, దర్శనీయంగా మార్చారు. చుట్టూ ఉన్న రంగు రాళ్ళను, పూల – పండ్ల – శీతల పానీయాల – ఫాన్సీ షాపుల – చిల్లర దుకాణాల – పచారీ సరుకుల – టీ కొట్ల ముందర ఇప్పుడంతా ఆహ్లాదకరంగా మారిపోయిన వైనం వాట్సాప్ చిత్రాలలో గమనించండి.

- సుమారు ఇరవై మంది కార్యకర్తలు పడమర – ఉత్తర దిశలుగా కదిలి, కిళ్ళీ షాపుల – టిఫిన్ హోటళ్ళ – బ్యాంకుల - పాలషాపుల – పంచాయతీ గోడల మలుపులన్నిటినీ ఊడ్చి, చిత్తు కాగితాలతో సహా ఏరి, సదరు వ్యర్ధాలన్నిటినీ ట్రాక్టర్ లో నింపుకొని, చెత్త కేంద్రానికి చేర్చారు. చెమటలు కార్చని వాళ్ళు లేరు., తామనుకొన్న (ఎక్కువ మంది హీనంగా భావిస్తున్న) స్వచ్చ – శుభ్ర – సుందరీకరాణాన్ని మధ్యలో ఆపిన వాళ్లూ లేరు

          6.15 కి మన స్వచ్చ శ్రమదాన కేతనం ఎగుర వేసే శివబాబు ముమ్మారు పలికిన – పలికించిన – గ్రామ స్వచ్చ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలాతో – DRK గారి సమీక్షా వచనాలతో నేటి శ్రామిక ప్రసక్తి ముగిసింది.

          రేపటి మన కార్యక్రమం కోసం వేకువ 4.00 కు సెంటరులో కలుసుకొందాం!   

              ఉద్యమానికి నా ప్రణామం!

మేధలకు పని చెప్పి- గ్రామం బాధలకు ఒక స్వస్తి పలికీ

యోధులిందరు కార్యకర్తలు యుద్ధ మద్యంలోనె గడిపీ –

కృషియొనర్చీ – ఘోర దుర్భర కులమతాలను విస్మరించే

ఉద్యమానికి నా ప్రణామం! ఊరి మేళ్లకు రాచమార్గం!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

శుక్రవారం – 05/06/2020,

చల్లపల్లి.