3981 వ రోజు.....           11-Oct-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడే వాళ్ళందరం సిగ్గుపడదాం!

దుర్గా నవరాత్రుల ప్రారంభ దివసాన కూడా... (11-10-2026)- @3981*

               ఆదివారపు- శనివారపు శ్రమదాన పోలికలు కొన్ని:

               1. అవి రెండూ బెజవాడ రోడ్డులోనే జరిగాయి !

               2. నిన్నటి కార్యకర్తల బలం52 కాగా – నేటి ఐకమత్య బలం 48 మందిది. నిన్న సందడి చేసిన గోళ్ల వారి  కుటుంబంలోని నలుగుర్ని కలుపుకుంటే ఈ పూట కూడ 52 మంది ఔతారు!

               3. పనివేళలూ, శ్రమ స్వభావములూ 2 రోజుల్లోనూ ఒక్కటే! అవే వీధి ఊడ్పులూ, వీధిమార్జిన్ల గడ్డి చెక్కుడులూ, కూరల- మాంస దుకాణాల, ఇతర షాపుల ఎదుట వ్యర్థాల తొలగింపులూ,

               4. బ్యాంకు ఎదుట, రెవిన్యూ కార్యాలయాల, వీర బ్రహ్మేంద్రుల దేవాలయం ముంగిట ఈ పూట ఊడ్చిన, ఎత్తిన దుమ్మూ ఇసుకల పరిమాణమూ నిన్నటంతే!

               5. శనివారమైనా, ఆదివారమైనా, పెద్ద పండుగ రోజైనా- ఆ మాట కొస్తే వారం-వర్జ్యం చూడకుండా ఏ రోజైనా-స్వచ్ఛ కార్యకర్తల పనుల చొరవా, ఉత్సాహం ఒక్కటే అనుకోండి!

               6. రెండోమూడో కొద్దిపాటి మార్పులు తప్ప మళ్లీ అవే నిన్నటి ముఖాలు - అందులో22 మందేమో 4:22 కే తయారు! నిన్నటి లాగే 6:00 తరువాతే పని విరమణ!”

        7. కాఫీల కార్యక్రమం ముగుస్తుండగా చూస్తే- ఎప్పటిలాగే చాలా ముఖాలకు దుమ్ము!

       8. రకరకాల దుకాణ దారులు కాని, ఇతరులు కాని క్రొత్తగా కార్యకర్తలుగా  వచ్చిందీ లేదు!

      9. నిన్నటి స్త్రీ స్వరం బదులు పురుష గళం తప్ప- మళ్లీ అవే గ్రామ  భవిష్యత్ సూచక ప్రతిజ్ఞలు!

    10. నిన్నటి శ్రమదాన సందర్శన, నేటి ఆచరణ తర్వాత మోపిదేవి వాస్తవ్యుడైన రవీంద్ర గారి 2 రోజుల అనుభవాల వివరణ!

11. నిన్నా -మొన్నటి వలెనే ప్రధాన శ్రమ స్థలం విజయవాడ వీధినే కాక- 7-8 మంది వాలంటీర్లు ప్రక్కనున్న  బైపాస్ వీధిలోకి చొరబడనే చొరబడ్డారు!

12. చివరి సభ మాత్రం కాస్త భిన్నంగా - కాస్త దీర్ఘంగా  జరిగింది. తన మీద దురాక్రమించిన వైరల్ జ్వరాన్ని మాత్రలతో నియంత్రించుకొంటూ DRK గారు కుండ బద్దలు కొట్టినట్లు- “ఈ ఊరు నేను ఆశించినట్లు 100%- స్వచ్ఛ – సుందర- స్ఫూర్తి దాయక చల్లపల్లి కానే కాదనీ,

               “గ్రామ పరిపూర్ణ మార్పులింకా జరగలేదనీ,

అందుకోసం సోషియాలజీ విద్యార్ధుల, ప్రభుత్వ సలహాదారులతో సంప్రదిస్తున్నామనీ.... ఏవేవో చెప్పుకుపోయారు! ఆతని కబుర్లను కొంతవరకు స్వచ్ఛ కార్యకర్తలూ, HDFC బ్యాంకు గోడలూ, అక్కడున్న రెండు మూడు చెట్లూ  తప్ప- డజన్ల కొద్దీ సొంత పనుల మీద హడవిడిగా అటూ ఇటూ తిరుగుతున్న గ్రామస్థులు కానీ,అచ్చటి వ్యాపారులు కానీ వినిపించుకోనేలేదు.

      రేపటి వేకువ మన తొలి కలయిక చోటు కూడ HDFC బ్యాంకు అవరణేనట!

               గురజాడ పలికిన హితవుతో

“మంచి గతమున కొంచెమే”నని, “సదరు మంచిని స్వీకరిస్తూ

సమాజ శ్రేయం కోసమింకా క్రొత్త పుంతలు త్రొక్కవలె” నని

మహాకవి గురజాడ పలికిన హితవుతో ఇక నీవు కూడా

శుభ్ర సుందర రథం యాత్రకు సహకరించుట మేలు నేస్తం!

-నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   11.10.2026