పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడే వాళ్ళందరం సిగ్గుపడదాం!
3982* వ వీధి శ్రమలిట్లు జరిగెను! (సోమవారం-12-10-26)
“షరా మాములు” గానే - వారం రోజులకు పైగా జరుగుతున్నట్లే - ఆ సేవలు మరొకమారు వక్కలగడ్డ రోడ్డులోనే - అనగా నిన్నటి నిర్ణయం ప్రకారమే - HDFC (హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంకు) వద్దనే గ్రామ వీధుల కాలుష్య శత్రువు పైన నేటి స్వచ్ఛ కార్యకర్తలు - తుది సభకు ముందే నిష్క్రమించిన పసుపులేటి వానితో సహా- 30 మందే!
కర్తలు 30 మందైతే – కర్మలు మాత్రం :
1) అగ్రహారం 4 వ వీధి మొదట,
2) ద్రవ్య నిధి R&B బంగళా ప్రాంతమూ,
3) బైపాస్ రోడ్డు ప్రక్క డ్రైనూ,
4) M.D.O. కార్యాలయమూ,
5)రహదారికి పడమటి దుకాణ సముదాయములే!
మెకానిక్ షాపుల, ఆటోమొబై ల్ పార్ట్స్ అంగళ్ల వద్దా పని అనగా- నేల బిగుసుకుపోయి, గడ్డి పీకడమో - చెక్కడమో చేసిన ఆరేడుగురు పని వాళ్లు మాత్రం కొంచెం ఎక్కువ చెమట చిందించారు!
“రెస్క్యూ టీమ్” అనే పౌరుష నామం పెట్టబడిన వాళ్లు 7 గురూ ట్రాక్టరు సగానికి పైగా – అది మట్టో – దుమ్మో – ఇసుకో రాతి ముక్కలో గాని సేకరించారు - వ్యర్థాలనబడే ఈ పదార్థాలతో పెద్ద శ్మశానంలోని గోతుల సమస్య పరిష్కృత మౌతున్నదట!
“ప్రతి వేకువా 100-150 గజాల వీధి నుండే అర ట్రాక్టరు దుమ్మూ- ధూళీ- ఇసుక - పెంకు ముక్కలూ ఎలా వస్తుంటవి?” అని నన్నడగ వద్దు; అలాగే “ రోజూ రెండు పూటలా పంచాయతి చెత్త బళ్లు తిరుగాడుతున్నా- మళ్ళీ ½ బండి చెత్త-చెదారాలు ఈ ప్రధాన వీధిలోనికెలా వచ్చెను?” అని నన్నడిగినా ప్రయోజనం లేదు ! వీటికి జవాబులు అక్కడి షాపులు, నివాస గృహాల వాళ్ళే చెప్పగలరు!
ఇకపోతే “రామానగరం, శివరామపురం, వెంకటాపురం గ్రామాల నుండి కొందరు చీకటితోనే తమ వీధుల నాణ్యత కోసం వస్తే ఈ బెజవాడ రోడ్డుకు 2 ప్రక్కల నివసించే వారు ఈ పనుల్లో వ్రేలు పెట్టరేమి?” అని ఎవర్నడగాలి?
6.20 ప్రాంతంలో శ్రద్ధగా - వెంకటాపురం స్కూలు హెడ్ మిస్ట్రెస్ గారి నినాదాలతో మొదలైన తుది సమీక్షా సభలో: మంచి జీవిత విధానం గురించి గురవయ్య గారు గుర్తు చేసిన సూక్తుల వేళ-
“మొన్న సాయంత్రం నుండి మందు బిళ్లల సాయంతో శక్తివంతమైన వైరల్ జ్వరాన్నీ దగ్గూ- జలుబూ- ఒళ్లు నొప్పుల్నీ ఎదిరిస్తూ- ఎక్కువసేపు నిలబడనే లేని స్థితిలో మన పెద్ద డాక్టరు కూడ వీధిసేవలకు రాక తప్పదా?” అని కూడ గ్రామస్తులం పశ్నించుకోవాలి!
రేపటి మన వీధి బాధ్యతలు బెజవాడ రోడ్డులోని MDO కార్యాలయం వద్ద ప్రారంభమగునని కార్యకర్తలు గ్రహించాలి!
కలుషములపై సింహనాదం
కార్యకర్తల శ్రమ విధానం కలుషములపై సింహనాదం
ఊరి మేలుకు పాటుబడుతూ ఉన్నదదిగో రాచమార్గం
చేయి చేయీ కలుపుతావో - చీదరిస్తూ తొలగుతావో
కలిసి వస్తే ఊరు స్వర్గం ! కలవకుంటే నీకె నష్టం!
-నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
12.10.2026