3985 వ రోజు.....           15-Oct-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడే వాళ్ళందరం సిగ్గుపడదాం!

4000* వ నాటికి 15 అడుగుల దూరంలో--- (@3985*) బుధ -15-10-26 !

               మూడో నాలుగో ఊళ్ల నుండి ....4.20 AM కే నడకుడురూ- బెజవాడ రోడ్ల కూడలిలో వేచి ఉన్న ఆ టోపీ వాలాలు ఏ RTC బస్సు కోసమో ఎదురు చూస్తున్న ప్రయాణీకులు కారు,  బ్రతుకు తెరువు వెతుక్కొంటున్న కూలీలూ కారు,  గత 13 ఏళ్ళుగా చల్లపల్లి అనెడి ఒకానొక గ్రామ స్వచ్ఛ – శుభ్ర- స్వస్తతల కోసం ప్రణాళికాబద్ధంగా - క్రమశిక్షణగా – మొండిగా - సుదీర్ఘంగా – ప్రయాణిస్తున్న  స్వచ్ఛ కార్మికులు!

               తాము తొలుత నిర్ణయించుకొన్న వేకువ సమయం 4.30 దాక ఆగలేక- బాధ్యత నిర్వర్తించుకొనజూస్తున్న - జీత భత్యాల ప్రసక్తే లేని గ్రామసేవకులు! ఇక ఆ తరువాత చేరుకొని, వీధి పారిశుద్ధ్య పనుల్లో లీనమైన  నేటి తలకాయలు మొత్తం 33!

               వాళ్ల పని పద్ధతులూ, ముఖస్థ కఠిన నిర్ణయాలూ, NTR పార్కు బైట మురుగు కాల్వ బాగు చేతలూ, ఎగుడు దిగుడు చోట్ల చేస్తున్న చెత్త పనులూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దరిద్ర నిర్మూలనలూ, మట్టి పనులూ, చీపుళ్ళ ఊడ్పులూ, వ్యర్థాల్ని ప్రోగు చేసి, డిప్పల కెత్తి ట్రాక్టర్ లోనికి  చేస్తున్న ఎగుమతులూ, ముఖాల నుండి ముత్యం బొట్లులా దిగజారుతున్న చెమట చుక్కలూ,

               మగవాళ్లు సరే - దంతెలూ, చీపుర్లూ పట్టుకొని శ్రమిస్తున్న మహిళామ తల్లులూ... ఈ దృశ్యాలను ½  గంట పాటు శ్రద్ధగా చూస్తున్న నాకు మాత్రం అనిపించింది “ఈ దుమ్మూ- ఇసుకా-రకరకాల చెత్త పని మనుషులు చల్లపల్లి స్వచ్ఛ -శుభ్ర- సౌందర్య కారణజన్ములు” అని!

               వర్తమానంలో కొందరు అతి తెలివి గాళ్లు ఈ స్వచ్ఛ కార్యకర్తలకి “ వెర్రోళ్లు, వ్యసన గాళ్ళు, సేవ పేరుతో రేపు ఎలక్షన్లలో సర్పంచులూ- M.L. A.లూ, MP.లు గాబోయే వాళ్లూ, చేస్తున్న గోరంత పనుల్ని కొండంతలుగా ప్రచారగాళ్లూ”...! అని ఎన్ని బిరుదులైనా ఇచ్చుకోనీ... తాము “మంచి” అనుకొన్న దాని అంతు చూడక  వదలని వాళ్లు అని నా తీర్పు! 

               పెట్రోలు బంకు  ఆవరణలో 6.15 కు మొదలైన ఈ పిచ్చోళ్ళ  సభకు SBI మాజీ మేనేజరూ, మాజీ స్వచ్ఛ కార్యకర్త ఐన పృధ్వీశ్వరరావు గారు హాజరు కావడమూ,  స్వచ్చోద్యమ-  సాంప్రదాయక నినాదాలీయడమూ,

               పిచ్చోళ్ల నాయకుడైన ఒక డాక్టరు ఈ వెర్రి పనుల్ని సమీక్షించి మెచ్చుకోవడమూ, చేతి చమురు వదిలించుకొంటూ, హిందూ శ్మశాన వాటిక పనులూ, ఆఖరికి సెల్ఫీ పాయింటు వద్ద సౌందర్య విధ్వంస కారుల్నెలా అడ్డుకోవాలనే ఆలోచనలూ.... ఇవీ సదరు  పిచ్చి సభా విశేషాలు !

               మళ్ళీ రేపటి ఇలాంటి పనుల కోసం NTR పార్కు సమీపంలోనే కలుసు కోవాలనేది ఈ వింత మనుషుల నిర్ణయం!

            స్వచ్ఛ - సుందర రథం చరితను

ఎవరి కోసం శ్రమించిందో – ఎంత హేళన భరించిందో

రాపిడులతో - అనుభవాలతొ రాటు తేలుచు గమిస్తున్నదొ

ఎదురు దెబ్బలు తినీ తిని ఈ యాత్ర ముందుకు క్రమిస్తున్నదొ

స్వచ్ఛ - సుందర రథం చరితను చక్కగా తెలుసుకో నేస్తం!

-నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   15.10.2026