3987 వ రోజు.....           17-Oct-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

ఈ దేశంలో కేవలం చల్లపల్లినే పట్టుకొని వదలని శ్రమదాన సౌభాగ్యం!@3987*

               శనివారం(17-10-26) కావడం వల్ల సదరు శ్రమ వైభవం మరి కాస్త పెరిగి, 25+1+1 గా లెక్కతేలింది!- చివరి వాళ్లలో ఒకరు రత్నగిరి బాబు, మరొకరు అమెరికాలో ఉన్న ప్రతిక్షణం చల్లపల్లినే కలవరించే నాదెళ్ల సురేశ్ గారు!

               వీళ్లలో సగం మంది అత్యుత్సాహవంతుల హాజరు 4:20 కే! రాన్రాను షెడ్యుల్డ్ టైమ్ కన్నా ముందే వచ్చే కార్యకర్తల సంఖ్య – ముఖ్యంగా మహిళామణుల నంబరు పెరిగిపోతున్నది! ప్రత్యేకించి – ఈ బెజవాడ బాటలోని కోమలా నగరు నుండి 15- 20  కిలోమీటర్ల దూరపు అడపావారి పాలెం లో వేకువ 3:00 కే  బయల్దేరి, ఎగుడు దిగుడు గుంటల రోడ్డు మీద ఒళ్లు హునమౌతూ శ్రమదానానికి వచ్చిన నర్సు పండలనేని కనక దుర్గను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది! ఒక మంచి సామాజిక బాధ్యతా వ్యసనాని కింతకన్న ఉదాహరణ ఏం కావాలి?

               అందుకే – కాస్త మంచి మనసున్న వాళ్లందరూ ఈ మహా వ్యసనం దిన దిన ప్రవర్థమానమై, చల్లపల్లిలోనూ- రాష్ట్రంలోనూ వైరల్ జ్వరంలాగా వ్యాపించాలని కోరుకోవాలని మనవి!

               ఇక – ఈ వేకువ బెజవాడ రోడ్డులో కాస్త అటూ- ఇటూగా 2 గంటల గ్రామ ప్రయోజనకర చర్యల సంగతి కొస్తే:

               - నిన్నటి కన్నా వీధి పారిశుధ్య పురోగతి 100 గజాలన్నా ముందుకుపోలేదు. అందుకు కారణం ఇండియన్ ఆయిల్ బంకు ఆవరణమే! అందులోని1½ సెంట్ల భాగమే! దుమ్మూ మురికి కొట్టుకుపోయి, అవి రంగురాళ్లని తెలియనే తెలియని పేపర్ టైల్సే!

               - నిన్న క్రిక్కిరిసిన ముళ్ల పూలచెట్లను తొలగించాక- ఆ వ్యర్థాల లోడింగు ఈపూట కొందరి వంతూ, నేలను క్రుళ్లగించి ప్లాస్టిక్ కాలుష్యరహితం చేయడం మరికొందరి పనీ! శుభ్రంగా తయారైన తన బంకు ఆవరణను చూసుకొని సంతోషించడం దాని యజమాని నాదెళ్ల పూర్ణ గారి వంతూ!

               - రోడ్డు తూర్పు మురుగు కాల్వ గట్టు సుందరీకరణను అడపా గురవయ్యా, వెంకటేశ్వరరావూ మరో ఇద్దరు నర్సులూ సాధించారు!

               - మరో 10 మంది అదే రోడ్డు పడమటి- చాలవరకు ఎండిన డ్రైను పరిశుభ్రాతా- టెండరును దక్కిచుకొన్నారు. అక్కడ గోతాం ప్లాస్టిక్ తుక్కూ, 2 గుట్టల పిచ్చి మొక్కలూ- చాలినంత పని దొరికింది!

               6:25కు ఈ 36 మందితోనూ ఈ ఉదయం గ్రామ శుభ్ర సుందరీకరణ ప్రతిజ్ఞలు చేయించిన నాదెళ్ల సురేశ్ 15000 కిలోమీటర్ల దూరంలోని అమెరికా ప్రవాసుడు

                సాధారణంగా ఏ వైద్యుడైనా పేషెంటు అనారోగ్యాన్ని విశ్లేషించుకొని, మందులు నిర్దేశిస్తాడు, కాని- ఈ  చల్లపల్లి గ్రామ సామాజిక స్వస్తతా నిపుణుడైన DRK వైద్యుడేమో- “ఈ మురుగు కాల్వ బాగుచేద్దాం-28 వేల మంది ఆహ్లాద సాధన మీద గురిపెడదాం- NH216 మీద మనం పూయించిన పూలగుత్తుల్ని ఒక సారి చూసి వద్దాం- హిందూ శ్మశాన వాటికకు అప్రోచ్ సిమెంటు రోడ్డు తయారౌతున్నది చూసి ఆనందిద్దాం” అనే చెపుతాడు!

               రేపటి వేకువ కూడ బెజవాడ రోడ్డు బాధ్యతలేమనకు!

            మీ కాళ్ళు  మ్రొక్క దలిచాను

“ఏడాదికి మూడొందల అరవైయ్యైదు రోజలలో –

రోజుకు గంటన్నర చొప్పున శ్రమ చిందించే

కార్యకర్తలారా! మీ కాళ్ళు మ్రొక్క దలిచా”నని

అతిగా పొగడేందుకొ - తెగడేందుకొ నాక సలవసరమా అని!

-నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   17.10.2026