పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
విజయ దశమి నాడు విజయవంతమైన 3990* వ శ్రమదానం
మంగళవారం (19.10.2026) వేకువ 4.20 కి ముందే విజయా కాన్వెంటు కు వచ్చిన వాళ్లు 20 మందికి తక్కువే; తరువాత వచ్చిన 20 మందితో కలిపి మొత్తం 39 మందీ ఉభయ పాఠశాలల వద్దనూ, మురుగు కాల్వలతో సహా – గుంటల రోడ్డు పైననూ జరుపుకొన్న శ్రమదాన పండుగ ఇది!
దేశ వ్యాప్తంగా సర్వ సాధారణంగా జరిగినట్లే – చల్లపల్లి లోనూ జరుగుతున్న విజయ దశమి పండుగ వేరు! నేనిది వ్రాస్తున్న 8.00 కు దేవాలయాల వద్ద భక్త జన సమ్మర్ధం వేరు! ఆ భక్త కోటిలో కూడ ఏ కొద్ది మందో – కేవలం తామూ- తమవారి మాత్రమే కాక- సమస్త జీవకోటి సుఖ సంతోషాల కోసం ప్రార్థించి ఉండవచ్చు.
కానీ – ఈ స్వచ్చ కార్యకర్తలు అలా కోరుకొని – ప్రార్థించి ఆగిపోలేదు- తమ చల్లపల్లి ప్రజలంతా ఆహ్లాద – ఆరోగ్యకర – హరిత సుందర వాతావరణంలో బ్రతకడానికై 4.20 – 6.10 వేకువ సమయాన – 45 కు పైగా పని గంటలు చెమటలు క్రక్కుతూ శ్రమించారు!
జాతీయ పతాక ప్రదాత శ్రీ పింగళి వెంకయ్య విగ్రహం వద్ద డజను మంది మొక్కల్ని సుందరీకరించి, పరిశుభ్రత నెలకొల్పారు!
వికాస కేంద్రం వెలుపలి రోడ్డు బారునా దుమ్మూ- ఇసుకా ఊడ్చి, ప్లాస్టిక్ తుక్కులకు మంగళం పాడి ఎంగిలాకులెత్తి, ఎండుటాకులూ, పుల్లలూ ఏరి, బెజవాడ వీధి కి మెరుగులు దిద్దారు!
విజయా పాఠశాల వద్ద గుంటలు పడిన రోడ్డు మాత్రం ఊడుస్తున్న కార్యకర్తల ఓర్పుకు పరీక్ష పెట్టింది. పైగా భారీ వాహన రాకపోకలొకటి!
ఇంత పెద్ద పండుగ నాడైనా వీధి శ్రమకు సెలవు ప్రకటించక- నిన్నటి కన్నా కార్యకర్తలు ఎక్కువగా – పొరుగు 3-4 ఊళ్ల నుండి రావడమూ, ఆలయాల కేగి, పాప ప్రక్షాళనకు ప్రయత్నించక- విస్తృత జన ఆనంద అభ్యుదయాల కోసం శ్రమించడం చూస్తే చల్లపల్లి – మరీ ముఖ్యంగా కోమలా నగర వాసుల కేమనిపిస్తుందో మరి!
- ఇందరి కష్టంతో బాగుపడిన గ్రామంలో బ్రతుకుతున్నందుకు అదృష్టమనా? లేక
- రేపటి నుండి తాము కూడ వీలైనంత వరకూ ఈ వాలంటీర్లతో చేతులు కలపాలనా?
కాన్వెంటు గేటు ముందర ప్రాత శివరామపుర నివాసి BDR ప్రసాదు గారి నినాదాలతో మొదలైన నేటి తుది సభ విశేషాలు:
- స్వచ్చ కార్యంలో తెలిసో తెలియకో భాగస్తురాలైన ఒక భిక్షుకి కూడ పాల్గొనుట,
- నేటి దేవాలయాల్లో జరిగే భోజనాలలో ప్లాస్టిక్ ల గురించిన చర్చ,
- మన ఒకనాటి సహ కార్యకర్త వేమూరి అర్జునరావు గారి గురువారం నాటి సంవత్సరీకమునకు ఘంటశాలపాలేనికి కార్యకర్తలకు ఆహ్వానము,
రేపటి శ్రమదానము కూడ విజయా కాన్వెంటు ప్రాంతాననే జరుగుననే నిర్ణయమూ.
ఏమిటి నా కర్తవ్యమ్?
ఒకరో ఇద్దరో ఐతే - పోనీలే తిక్కోళ్లను
కోవచ్చును గానీ ప్రతి రోజూ నలభై - యాభై
మంది సమూహంగా ఈ మాదిరి శ్రమ చేస్తుంటే
తెగడాలా - పొగడాలా? ఏమిటి నా కర్తవ్యమ్?
-నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
20.10.2026