పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
మరో 6 రోజులకు 4000* పని దినాల మాజిక్ ఫిగర్ కు సమీపంగా!
అంటే - శనివారం - అక్టోబరు 24 వ నాటి లెక్కలేండి! “అసలీ పని దినాల లేక్కేమిటో -
రోజువారీగా హాజరౌతూ ఏదోఒక వీధిని తమ శ్రమతో అలంకరిస్తూ - ఫరవాలేదే - నిన్నటి వానకు వీధి మార్జిన్ గుంటలలో నీళ్ళు నిలిచినా ఈ వేకువ కూడా మరొక 150 గజాల ముఖ్య రహదారిని శుభ్రపరిచాం-సుందరీకరించా౦ గదా!” అని సంతృప్తి చెందే కార్యకర్తల సంఖ్యా వివరాలెందుకో అని ఎవరైనా విసుక్కోంటారేమో తెలియదు!
తమ శ్రమదానం చూసి మెచ్చే వాళ్లు మెచ్చుతుంటే - ఇప్పటికీ కొందరు సందేహజీవులు దాన్ని శంకిస్తూ, రంధ్రాన్వేషణ చేస్తుంటే – పట్టించుకోక - ఈ ఊరి మంచి కోసం నిష్టగా రోజూ గంటన్నర పైగా శ్రమించే ఈ వేకువ కాలపు శ్రమలో ప్రతి దినమూ – ప్రతి నిముషమూ నా దృష్టిలో విలువైనదే - పరమ పవిత్రమైనదే!
ఇక గ్రామ కేంద్రానికి దూరంగా - బృందావన గృహసముదాయాల ప్రాంతంలో - బెజవాడ రోడ్డులోని ఈ నాటి శ్రమవేడుకను గూర్చి శాఖా చంక్రమణం లేకుండా – సూటిగా - క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను!
కనీసం 4.20 కూడ కాకుండానే - నేటి 41 మంది కార్యకర్తలలో సగం మంది కార్ల షెడ్డు వద్దకు చేరడమూ, కస్తూరి శ్రీను వాళ్ల తొలి ఫొటో తీయడమూ జరిగిపోయింది! ఆ షెడ్డుకూ అటూ ఇటు ప్రక్కల 150 గజాల వీధి బారునా కొందరు చీపుళ్లతోనూ, కొందరు దంతెలతోనూ, కత్తులతో కొందరూ, ఎక్కడే అవసరముంటే - అక్కడ పనులు చేస్తూ -
వచ్చిన వ్యర్ధాలను ప్రోగులు చేస్తూ డిప్పలకెత్తి ట్రాక్టర్లో అనుభవశాలి ఐన లోడింగు వీరుడి కందిస్తూ డజను కన్నా ఎక్కువ మందీ -
కరెంటు తీగల నడుమ పెరిగిపోయిన గద్దగోరు తదితర చెట్ల కొమ్మల్ని జాగ్రత్తగా మర రంపంతో కోసి - గుట్టలు పేరుస్తూ ఐదుగురూ – (ఈ సమయంలో పూర్తిగా తెగని ఒక కొమ్మను గట్టిగా లాగి, అది ఊడి వచ్చిన వ్యక్తి సజ్జా ప్రసాదు గారు కాబట్టి సరిపోయింది – నాబోటివాడైతే రోడ్డు మీద పడి ఉండేవాడు!)
ఇక్కడ మరో సంగతి వ్రాయవచ్చో - కూడదో తెలియదు గాని నిన్నటి వానకు నానిన రోడ్డు ప్రక్క తుక్కులోని ఏ పుణ్యాత్మునిదోగాని డైపరును విసిరినపుడు – ఎవరి ముఖం మీదో గాని పడిందట!
ఎంత అణచిపెట్టి త్రొక్కినా ట్రాక్టర్ లో చెత్త 4 అడుగుల ఎత్తుంటే - మోకాళ్ళూ - నడుమూ నొప్పుల కార్యకర్త సులువుగానే క్రిందకి దిగి రావడమూ చూశాను!
నేటి నినాదాలను తాపీగా – శ్రావ్యంగా వినిపించినది వేల్పూరి లక్ష్మి గారు,
ఈ వేకువ శ్రమను నేను కాస్త మెచ్చుకొంటుంటే - ఇబ్బందిగా మొహమాటపడిన కొందరూ -
ఈ షెడ్డు వద్ద కన్నా - బృందావన అపార్ట్మెంట్ల వద్ద రేపు ప్రొద్దున కలిస్తేనే మంచిదని అందరి నిర్ణయమూ!
అరాచకమున కదె మార్గము!
ఐనా ఇది “ప్రజాస్వామ్య మనబడు ఒక వ్యవస్థ గదా!
చెట్లు పెంచుటకూ హక్కు! చెట్లు నరుకుటకూ డిటో!”
అని భావిస్తారేమో గాని - ఆటవిక వ్యవస్థ కదే దారి
అర్థం పర్థం ఉండని అరాచకమున కదె మార్గము!
- ఒక స్వచ్ఛ కార్యకర్త
24.10.2026