పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
బుధవారం నాటి ప్రమాదకరమైన (28.10.26) వీధి పనులు - @3998*
ఆ పెను ప్రమాదం ఆర్నబ్ తుఫాను రూపంలో! వీధి పనుల వారేమో, నలుగురూ, ఆరుగురూ, ఎనమండుగురూ... ఆ మాటకొస్తే 10-12 మంది స్వచ్ఛ కార్య కార్యకర్తలు, కాక ఇంకెవరు?
ఎంత స్వచ్ఛ కార్యకర్తలైతే మాత్రం ఈ భయానక ఝంఝూ మారుతములో – ఎడాపెడా ఈడ్చి కొడుతున్న వర్షంలో – గ్రామానికి చెందిన ఐదారు వీధుల్లో ఏవో భారీ వృక్షాలు రహదార్ల మీద విరిగి పడ్డాయనీ, అవి రవాణా వ్యవస్థను ఆటంకపరుస్తున్నాయనీ, ఆ 5–6 రోడ్లలో తిరిగి చూసి, తొలగించడమే వీళ్ల కర్తవ్యమా?
వేకువ 3.40 కే ఈ స్వచ్ఛ సుందరోద్యమ సారథి, “ఇక ఈపూట మన వీధి శ్రమదానానికి తెరదించుదాం” అని వాట్సాప్ సందేశం పంపారు గదా - అని చాలామంది కార్యకర్తలు ఇళ్లలో ఉండిపోయారు.
కాని “ఊరి వీధులకీ ఈ తుఫాను ఎంత భీభత్సం సృష్టించిందో అనే బెంగతో 7:00 AM తర్వాత ఉండబట్టలేక నలుగురు వీధుల విహారానికి పూనుకున్నారు! కేవలం చూసి రావడమే అయితే వాళ్లు తమతోబాటు రంపాలూ, గొడ్డళ్లూ, కత్తులూ వంటి సరంజామాతో సహా వెళ్తారా?
అసలిదేమన్నా సాదాసీదా గాలివానా? ప్రొద్దుటే తలుపు తెరచి, వరండాల్లోకి పోయి, దాన్ని అంచనా వేయటానికే చాలామంది భయపడిన తుఫాను! నాకు మాత్రం నా డిగ్రీ 2 వ ఏడు ఆంగ్ల పాఠ్యాంశాలుగా చదివిన షేక్స్పియర్ మహాకవి “దిటెంపెస్ట్” కింగ్ లీర్” నాటకాల్లోని తుఫాను వర్ణనలే గుర్తుకొచ్చాయి!
మరి ఏ వీధిలో ఏ నర మానవుడి సంచారమూ లేని చోట్ల – గజగజలాడించిన చలిలో, తడిసి ముద్దౌతున్న వానలో - ఈ 10–12 మంది కష్టజీవులు ఏం సాధించారనే గదా!
పాగోలు రోడ్డులో 2 చెట్లనూ, కాసానగర్ సమీపంలోనూ, బెజవాడ బాటలోనూ, సాగర్ టాకీస్ వద్దా, నడకుదురు రద్దీ బాటలోనూ పడిన నిద్రగన్నేరు వగైరా చెట్లు 70–80 ఏళ్ల నాటి మహావృక్షాలు -ఒరిగి బాటలకు అడ్డుపడుతుంటే - తమకు సాధ్యమైనంతగా శ్రమించి, వాటిని నరికి, రంపాలతో కోసి, వీధుల్ని క్లియర్ చేయడమే – వాళ్ళు 3 గంటలపాటు సాధించిన వసతులు!
అసలు అప్పుడే ఏమయింది? రేపటి నుంచి చూడాలి - స్వచ్ఛ కార్యకర్తల శ్రమ విన్యాసాలు! ఏం చేస్తాం – వాళ్ళ ఖర్మ - వీధుల్లో ఏ చిన్న అసౌకర్యాలు కలిగినా - చూడలేని - నిద్ర పట్టని బలహీనత వాళ్లది!
ఇప్పటికిప్పుడే - వాట్సప్ పోస్టులు చూశాను -“ఏ వీధిలోని కార్యకర్తలు ఆ వీధిలో రోడ్డు క్లియరెన్సులు చేపట్టాలి” అని!
ఇంతటి తుఫానులో సైతం స్వచ్ఛ – సుందర నినాదాలను గట్టిగా మ్రోగించిన వారు కస్తూరి శ్రీను మహాశయుడు!
రేపటి శ్రమదాన వివరాల కోసం మన వాట్సప్‌లో చూస్తుండాలి!
స్వచ్ఛంద శ్రమరీతులు
శ్రమ జరిగే స్థలానికి చక్కగ విచ్చేయవచ్చు
స్వచ్ఛంద శ్రమరీతులు పరిశీలించగ వచ్చును
అందులో స్వార్థమె ఉన్నదొ - త్యాగముందొ తేల్చవచ్చు
ఆ మాత్రానికి పోయేదసలేముంటుంది గనుక!
- ఒక స్వచ్ఛ కార్యకర్త
28.10.2026