4001* వ రోజు.....           31-Oct-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

4000* నాళ్ల అనంతర (శనివారపు- అక్టోబర్ మాసాంతపు) వీధిసేవలు! - @4001*

               6 వ నంబరు పంటకాలువ మొదలు ఉత్తరంగా ½ కిలోమీటరు రోడ్డు సమస్యలు 36+1 మంది కార్యకర్తలను ఈ వేకువ కూడ ఛాలెంజి విసరడం వలన-(+1 RTC బస్సు చోదక కార్యకర్త తోట నాగేశ్వరరావు కొద్ది నిముషాల ఉనికేలే.) అనివార్యంగా మరొకమారు బెజవాడ రోడ్డులోని కార్ల షెడ్డు వద్దనే పనులు జరగక తప్పలేదు.

               అందుకు తుఫాను ఒక కారణమైతే- అలవోకగా బస్సుల, కార్ల -ప్రయాణికులో, ఇతరులో డ్రైనులో విసిరే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లూ,  తూర్పు డ్రైను లో10 కిలోల బరువున్న మూటలు 2వ కారణం. ఈ విచ్చలవిడి అవివేకాన్ని ఆపగల నాధుడెవరో తెలియడంలేదు!

               28వ తేదీకి ముందూ, తరవాతి రోజుల్లో, ఆడ్రైన్ ను కార్యకర్తలు బాగు చేసినా సరే- ఈ పూట అన్ని వ్యర్థాలు మురుగు ప్రవాహానికి అడ్డు పడుతున్నాయంటే- అది పూర్తిగా అర్నబ్ తుఫాను తప్పే అనలేము!

               ఈ రహదారి బారునా ఆకులూ, కొమ్మలూ, చెత్తలూ పడ్డాయంటే ఆనేరం సైక్లోన్ మీదకు నెట్టేయవచ్చు! మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు 2 గోనెసంచులు నిండా పడి ఉండడం కూడ తుఫాను మూలంగానా? అక్కడికీ ఒక ట్రస్టు ఉద్యోగి 6వనంబరు కాల్వ వద్ద కాపలా కాస్తూనే ఉండెగదా!

               28వ తేదీన భయానక తుఫానులోనే పడిన చెట్లునూ, విరిగిన కొమ్మలనూ డజనుమంది మొండిఘటాలు తొలగించకపోతే గ్రామాలకు రవాణాకుంటు పడేదా-కాదా?

               ఈ వేకువ 4:20-6:09 కాలాల నడుమ ఇన్ని చీపుళ్లు పనిచేయకపోతే- 15 మంది కార్యకర్తల గూళ్లు దంతెలతో డ్రైన్ వ్యర్ధాలు లాగిలాగి నొప్పెట్టకపోతే-పడమటి డ్రైనునూ, రోడ్డు మార్జిన్ నూ 10 మంది శుభ్రపరచకపోతే - సగానికి పైగా వ్యర్ధాల గుట్టల్ని ఆరేడుగురు ట్రాక్టర్ లోకి ఎక్కించక వదిలేస్తే-

               ఈ 36 మందీ ఆప్రాంత ప్రజల్లాగా “మాకెందుకీ చెత్తపనులు?” అని భావిస్తే-ఈ 250 గజాల వీధి ఎంత ముదనష్టంగా ఉండేదో ఊహించడం కష్టం కాదు!         

                ఎక్కడికోగాని తప్పని ప్రయాణ మధ్య నుండే ఇక్కడి పనులు గ్రహించిన DRK డాక్టరు గారు-

               మిగిలిపోయిన పనుల కోసం రేపు కూడ ఈ చిన్నకార్ల షెడ్డు వద్దనే అగి, “ పూర్తి చేయాలి” అని ప్రతిపాదిస్తే-

               “ఒకే రోజు కాదు – 2- 3 రోజులు పట్టినా పట్టవచ్చు” అని ప్రేమానందుల వారు సవరించారు!

               చిట్టూరు సుమతి గారైతే శ్రావ్యంగాను, క్రొత్తరకం గాను నినాదాలు పలికారు గాని, అత్యుత్సాహం వలన కాస్త లెక్క తప్పారు!

            నీ చల్లపల్లి ప్రత్యేకత

చెత్తతోటి ఊరి బైట రహదారులు నిండాలా?

మహమ్మారి జబ్బులన్ని మనకందరి కంటాలా?

నీ ఊరికి పొరుగూళ్ళకు తేడాలే ఉండొద్దా?

నీ చల్లపల్లి ప్రత్యేకత నిలబెట్టవ కాస్తయినా?

- ఒక స్వచ్ఛ కార్యకర్త

    31.10.2026