పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
బెజవాడ బాటలోనే 4002* వ నాటి కాలుష్యాల మీద – ఆదివారపు శ్రమదానం దెబ్బ!
నవంబరు తొలిపూట 200 గజాల వీధిలో మురుగు కాల్వలోని విషతుల్య ప్లాస్టిక్ ల మాడు పగలగొట్టిన స్వచ్ఛ మహావీరులు 38 మంది ! 4:20-6:10 నడుమ జరిగిన సదరు యుద్ధంలో
1) నాయుడు మోహనరావు,
2) ప్రేమానంద్,
3) నందేటి శ్రీను,
4) బొం. పాటి నాగేశ్వర్,
5) ఆస్పత్రి నర్సు వంటి వారు క్షతగాత్రులైతే కాలేదు గాని, బట్టలకు నల్లమరకలు పుష్కలంగా అంటుకొన్నవి. గంటకు పైగా జరిగిన ఆ సమరం రేపటికి వాయిదా పడింది! గెలుపెవరిదో రేపు నిర్ణయించాలి!
ఈ యుద్ధం 6 వ నంబరు కాలువ నారాయణరావు నగర్ వీధి మధ్యనే కాదు - అక్కడికి అర కిలోమీటరు దూరాన చండ్ర వికాస కేంద్రం దాక విస్తరించింది కూడ!
చెత్త లోడింగు వీరులు అక్కడి దుమ్మూ - దూళీ, చెత్తా చెదారాలను తొలగించి, ట్రాక్టర్లో పట్టుకుపోయారు! ఈ రోజు కార్ల షెడ్డు ప్రాంతాన ఎండు కట్టెల, నిన్నా - మొన్నటి ఎండిన డ్రైన్ వ్యర్ధాల ఎత్తివేతతో ట్రాక్టరు నిండు గర్భిణిగా మారింది కూడ! అక్కడ 50-60 గజాల స్థలంలో మగవాళ్లతో సమంగా మహిళలు చెత్త పనుల్లో పోటీపడుతున్నప్పుడు –
“వేకువ చీకట్లో ఇంత దూరం వచ్చి, రకరకాల వీధి పనుల్లో ఈ అమ్మాయిలకెందుకింత పంతం? అవసరమైతే - ట్రాక్టరెక్కి, కంపు వ్యర్థాల త్రొక్కిడిలో కూడ ఇంత సాహసం అవసరమా?” అనే ప్రశ్నలు నాలో మెదలిన మాట వాస్తవం!
నేనేదో అప్పుడప్పుడు “రిస్క్ టీమ్, లోడింగ్ బ్యాచ్, రైతు కార్యకర్తలు, డాక్టర్లు, గృహిణులు, వృద్ధ కార్యకర్తలు, కాంపౌండర్లు”.... అని వ్రాస్తుంటాను గాని - నిజానికి ఆ గంటన్నర వీధి కాలుష్య పోరాటంలో
- ఆడా - మగా తేడా లేదు, డాక్టరా- టీచరా - విశ్రాంత ఉద్యోగా - వ్యాపారా - ధనికుడా- ఫలాన కులస్తుడా - ఆ పార్టీ, ఈ పార్టీ వాడా.....అనే విభజనలూ లేవు, ఎవరే పనికైనా సిద్ధమే, వాళ్ల దృష్టంతా ఆపూటకి తామనుకొన్నమేర వీధి శుభ్రపడిందా లేదా ? అనే ఉంటుంది!
- పనిమీద గురి అంటే అదేమరి! ఇష్టపడి చేస్తే ఏకష్టమైనా లెక్కలోది కాదు అనేందుకు సాక్ష్యమే అది! శ్రమదానం మధ్య ఇన్ని జోకులూ, ఆశువుగా పాటలూ, చెణుకులూ, నవ్వుల పువ్వులూ పుట్టుకొచ్చేది ఇందుకే మరి!
చాల రోజుల విరామం తర్వాత ఆస్పత్రి సహాయకుడు వక్కలగడ్డ వెంకటేశ్వరరావు గారు జమాయించి చెప్పిన నినాదాలతో మొదలైన తుది సభ సరదాగానే సాగి,
రేపటి వేకువ కూడ ఈ బెజవాడ రోడ్డు శుభ్రతకే అంకితమవ్వాలని నిర్ణయమైంది!
ఎందరికవగాహనలే!
చేతొడుగులుతికి, కప్స్ కడిగి, పనిముట్లను ట్రాక్టరులో
సర్దే పనులెవ్వరివో - శ్రమజీవుల కడుగడుగున
సహకారములెవ్వరివో - సంప్రదింపు లెవ్వరివో-
మేధోమధన మెంతటిదో ఎందరికవగాహనలే!
- ఒక స్వచ్ఛ కార్యకర్త
01.11.2026