4003* వ రోజు.....           02-Nov-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

2 వ తుఫాను కనుగుణంగా - గంగులవారిపాలెం వీధికి మారిన శ్రమ! – 4003*

               మార్పు ఇదొకటే కాదు - శ్రామికుల సంఖ్య కూడ! అది 20+2 కు తగ్గింది! పనివేళలైతే – 4:20 – 6:12గా ఉన్నవి! అసలు 3.55 దాక నేటి వీధి పనులు జరగవేమో అనిపించింది కూడ – ఆ గాలి ధాటికీ వాన ఉధృతికీ! ఎంత క్లిష్ట వాతావరణమైనా సరే - ఎంతో కొంత పనులు జరిగే వీలున్నందున  - నేటి శ్రమదానం సన్ ఫ్లవర్ అడ్డబాట వద్ద మొదలైంది!

               అంటే - అంతమాత్రాన వాతావరణం బుద్ధిగా ఏం మారలేదు - చలి గాలిని తోడు తెచ్చుకొని వాన సన్నగా పడుతూనే ఉన్నది. గంటన్నరకు పైగా 2 ముఖ్య భాగాలుగా జరిగిన పనుల వివరా లు:

1. సామాన్ల బండ్లు ఆగిన చోటు నుండి దక్షిణంగా భవఘ్ని నగర్ దాక గద్దగోరు వంటి బాగా పెరిగిపోయిన చెట్ల సుందరీకరణ. దీనిలో ఐదారుగురు వీధి సుందరీకర్తలు ఆకుల దుర్గాప్రసాదుని నాయకత్వాన జాగ్రత్తగా - అంటే ముళ్ళు చేతుల్ని కోయకుండా పని చేసుకుపోయారు. చెత్తబండి నిండిందో లేదో చూడండి.

2. అంతే జాగ్రత్తగా ముప్పావు గంట పాటు 12 మంది కార్యకర్తలు వ్యర్ధాల లోడింగుకు పని చేశారు. రోడ్డు చిన్నది – ఈదురు గాలీ – సన్నచినుకులూ – చెత్త ట్రాక్టరు ప్రక్కగా వెళ్తున్న, వస్తున్న అనేక 2-3-4 కాళ్ల వాహనాలూ - చాకచక్యంగా ఖండిత శాఖల్ని దూరం నుండి చెత్తబండి వద్దకు లాగుకొస్తున్న కార్యకర్తలూ - హుషారు ఎక్కువ కావడం వల్లనో, లేక 6:00 దాటి పోయి, పని మిగిలిపోరాదన్న నిర్ణయం వల్లనోగాని మట్టా మహాలక్ష్మి గారు

నడవడం కాక పరుగెత్తుతూ పనిచేసే దృశ్యమూ....

3. షెడ్డర్ నోటికి సరిపడేంత సైజులో కొమ్మల్ని నరికి, ట్రాక్టర్ లోకి విసురుతున్న పెద్ద కస్తూరి కూడ నాల్గువేటులకొకటి కాక – కొమ్మకొక  వ్రేటు చొప్పున నరికే ప్రయత్నమూ..

               ఇంతలో కాస్త ఆలస్యంగా పని విరమణ విజిల్ మ్రోగడమూ, వర్షం కూడ కొంచెం విశ్రాంతి తీసుకోవడమూ, అప్పుడు కూడ మరీ ఉత్సాహవంతుడొకాయన బారు గడ కర్రతో మిగిలిన పని పూర్తికోసం పరుగెత్తడమూ, కోడూరు-అంబటి జంట కూడ పని ముగించి, వ్యాను వద్దకు చేరుకోవడమూ..... ఇవీ నేటి కొన్ని విశేషాలు!

               D. మాధురి గారు శ్రావ్యంగానూ, విసురుగానూ నినాదాలు వినిపించాక, తమ పాలకొల్లు యాత్రనూ, అర్నబ్ విధ్వంసం గోదావరి జిల్లాను - అతలా కుతలం చేసిన విషయమునూ DRK గారు ప్రస్తావించాక –

               రేపటి తుఫాను ప్రవర్తనను బట్టి మన శ్రమదానం గంగులవారిపాలెం బాటకా - బెజవాడ రోడ్డుకా అనేది తేలుతుందని నిర్ణయించారు.

            విసుర్లిప్పుడు వినిపించవు!

ఎన్నాళ్ళిలా చేసెదరో – ఎవరి నెంత మార్చెదరో

ఎన్ని వీధులూడ్చెదరో - ఎన్ని చెట్లు పెంచెదరో

స్వచ్ఛ శుభ్ర చల్లపల్లి నెట్లా సాధించెదరో

మేమూ చూస్తాం!” అనెయెడి విసుర్లిప్పుడు వినిపించవు!

- ఒక స్వచ్ఛ కార్యకర్త

    02.11.2026