పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
4004* వ ప్రయత్నం కూడ గంగులవారిపాలెం రోడ్డులోనే!
ఎప్పుడనగా – మురసు తుఫాను తీరం దాటుతున్న మంగళవారం (03.11.2026) నాడే - 5.29 - 6.20 కాలములప్పుడే!
చలి గాలి విసురూ, మోత మ్రోగుచూ వానా జుగల్ బందీ జరుగుతున్న చెడు ముహూర్తంలోనే! నేను జడుస్తూ, ఆలస్యంగా వెళ్లిన 5.30 కే 9 మంది స్వచ్ఛ కార్యకర్తలకూ, భవఘ్ని నగర్ వీధి కాలుష్యాలకూ నడుమ సంకుల సమరం జరుగుతున్నది – హోరు గాలి సాక్షిగా!
వాళ్లలో
1) దేసు మాధురి,
2) మట్టా మహాలక్ష్మి అనే మహిళా కార్యకర్తలు కూడ కలరు.
“ఎందుకొచ్చారు - గాలి వానకు బిగుసుకుపోతున్న శరీరాలతో ఈ పనులేమిటి” అని అడిగితే –
“గాలికి విరిగి, ఊడి పడిన ముళ్ళ కొమ్మలూ, పుల్లలూ, నిన్న లోడింగు తర్వాత మిగిలిన చెత్తతో ఈ వీధి అసహ్యంగా, వాహన రాకపోకల కంతరాయంగా ఉంటే - ఇంట్లో ముడుచుకు కూర్చొనేదెలా?” అని వాళ్ల ఉద్యేశం!
తుఫాను బాధిత రహదారి అమరిక కోసం గంటన్నర పాటు అటు చలితో ఇటు వీధి దుస్థితితో పోరాడిన మిగిలిని కార్యకర్తలు :
3) BSNL నరసింహ
4) ఆకుల దుర్గా ప్రసాదు
5) కస్తూరి శ్రీనివాస్
6) గంధం బృందావన
7) ఇది వ్రాయుచున్న NRR
8) వానకోటు సాయంతో ధీమాగా ప్రాతూరి శంకర
9) ఈ నమ్మశక్యం గాని శ్రమను ఆశ్చర్యంగా గమనిస్తున్న DRK వైద్య,
10) ట్రస్టు కార్మిక కార్యకర్త చంటి లే!
- కార్యకర్తలు ముళ్ళ మండల్ని ట్రాక్టర్ లోకి విసురుతుంటే - గాలి కవి ఎగిరి వేరొక చోట పడుట
- బలమంతా ఉపయోగించి, ఆకుల్నీ చెత్తనూ ముగ్గురు ఊడుస్తుంటే - అవి నేలకంటుకొని ఊడి రాకపోవుట,
- ఆగి ఆగి లావుపాటి చినుకులు మద్దెల మ్రోతలా పడుట
వంటివి నేటి శ్రమదాన వేళా విశేషములు!
6:20 తరువాత – వీధి శ్రమలు ముగించి, పద్మాభిరామము షెల్డరులో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నరసింహుల వారు వాన చప్పుడును మించి - గట్టిగా వినిపించిన నినాదాలతో నేటి ఆశ్చర్యకర శ్రమదాన పరిసమాప్తి!
రేపటి వీధి పరిశ్రమలు జరిగే ప్రదేశము గంగులవారిపాలెం రోడ్డులోని సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ వీధి వద్ద!
అభిజాత్యము లహంకృతులు
ప్రకృతి మాత ప్రకోపిస్తే ప్రజకు పుట్టగతులుండవు
కళకళలాడిన పొలములె విలవిల లాడక తప్పదు
అభిజాత్యము లహంకృతులు అపుడేమై పోవునొ గద!
ప్రకృతికి సహకరించడమే స్వచ్ఛ కార్యకర్తల విధి!
- ఒక స్వచ్ఛ కార్యకర్త
03.11.2026