4005* వ రోజు.....           04-Nov-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

ఆహ్లాదమయ వాతావరణంలో 4005* వ శ్రమదానం!

               అది జరిగిన వీధి వర్షం అనుమానం వలన బెజవాడ వీధికి బదులుగా మళ్లీ గంగులవారిపాలెం రోడ్డే! భవఘ్ని నగర వాసులు కొందరు పాల్గొనుట వలన కార్యకర్తల సంఖ్య 31 గా ఉన్నది. అందులో 15 మందికి మాత్రం 4.19 ప్రారంభ సమయం. పనుల ముగింపు కూడ చాల రోజుల్లాగే 6.23 కు!

               తక్కిన 2-3 పనుల సంగతలా ఉంచితే - ఈ వేకువ శ్రమదానంలో హైలెట్ భవఘ్నినగర్ లో వీధికి పడమరగా ఖాళీ స్థలంలోని పెను వేప వృక్షాన్ని స్థల యజమాని 40-50 రోజుల్నాడు కొట్టేసి - డ్రైన్ మీద  వదిలేయగా – ఎండి, వానలకు క్రుళ్లి, కంపు కొడుతున్న ఆ తుక్కను లోడు చేయడమే!

               ఒక వంక చెత్త ట్రాక్టరు, మరో ప్రక్క కంపుకొట్టే తుక్కూ, మధ్యలో ట్రాక్టర్ లోకి ఎక్కిస్తున్న 10 మంది కార్యకర్తలూ, అక్కడి వరకూ వేగంగా వచ్చి, కొన్ని నిమిషాలు ఆగిపోతున్న ట్రాఫిక్కూ - ఇది అరగంటపాటు రోడ్డు పరిస్థితి!

               ఇక – రెండో రకం తుక్కు లోడింగుది మరో సమస్య - అది మామూలు గడ్డీ - పిచ్చి కంపల - ఎండుటాకుల - పుల్లల తుక్కు కాదు – సుందరీకరణలో భాగంగా - ఆరేడుగురు కత్తుల వారూ మరరంపపు ప్రయోక్తా నరికిన ముళ్ళ - పూల భోగన్ విలియా, గద్దగోరు ముళ్ళ తుక్కది!

               ఆ లోడింగు వేళ ఒక BSNL లాగిన కొమ్మ ముళ్లు మరొక బృందావన్ చేతిని చీరేస్తే, ఇంకొక అంజయ్య విసిరిన కత్తి పొరపాటున కస్తూరి శ్రీను కాలును గాయపరిస్తే, ఒకాయన బలంగా చెత్త బండిపైకి విసిరిన కొమ్మ మరొక నర్సు గారి నెత్తిన పడితే ఆశ్చర్యమేముంది?

               రోడ్డు మార్జిన్ లో కాక పొలం గట్టున చెట్ల మధ్య కలుపు తీతలూ, నలుగురైదుగురి గడ్డి చెక్కుడులూ, పాదుల సవరణలూ, గాజు, ప్లాస్టిక్ వస్తువుల ఏరివేతలూ, షరామామూలే! ఐదారుగురు మహిళల వీధి ఊడ్పూ యధాతథమే! 6:05 కు విజిలు మ్రోత విని కూడ 6:20 దాటే దాక పని విరమణ సమయోల్లంఘనమూ అంతే!

               12 వ ఏటి చివర కూడ - తుఫాన్లని పట్టించుకోక – ఊరి వీధుల సుస్థితి కోసం 31 మంది 45 పని గంటలు ప్రాద్దున్నే వచ్చి చేస్తున్న ఈ కార్యక్రమం

               ఒక ఆదర్శ శ్రమదానమా?

               గ్రామ సామాజిక బాధ్యతా?

               మానజాలని ముదిరిపోయిన వ్యసనమా!

               పర్యావరణ పరిరక్షణమా?, తరతరాలకూ గుర్తుంచుకోదగిన స్ఫూర్తి మంత్రమా?

               ఎవరికే పేరు ఇష్టమైతే ఆ పేరుతో పిలుచుకొండి ! ఇష్టమైతే గ్రామస్తులలో ఎవరైనా రేపటి నుండి అలవరచుకోండి!

               ఈ ఉదయం కాస్త ప్రసన్నంగా నినాదాలు అన్నపూర్ణ గారివి, సమీక్ష పేరుతో 4 మంచి మాటలు DRK గారివి,

               రేపటి మన వ్యసనాలు బెజవాడ దారిలోని కార్ల షెడ్డు దగ్గరివి!

               న్యాయం గుర్తొస్తున్నది!

బండి చక్రముల ఆకులు పైకి తిరిగి వచ్చినట్లు

కాల భ్రమణమున స్వచ్ఛ కార్యకర్త ‘వెర్రి పనులే’

గ్రామస్తుల కాదర్శము కావడాన్ని చూస్తుంటే –

“నవ్విన నాపే పండిన” న్యాయం గుర్తొస్తున్నది!

- ఒక స్వచ్ఛ కార్యకర్త

    04.11.2026