పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
4006* వ నాటివి (గురువారం - 5.11.26) మరీ మురికి పనులు!
ఈ వేకువ గంటా 50 నిముషాల పాటు ఆ పనుల స్థలం మళ్ళీ బెజవాడ బాటకు చెందిన చిన్న కార్ల – వినాయక ఏజెన్సీ ప్రాంతమే! పాల్గొన్న 32 మందిలో 10 మంది దిగింది మురుగు కంపు పనులకే!
ద్వితీయ తుఫాను సమయంలో 3 రోజులు గంగులవారిపాలెం రోడ్డు శుభ్ర - సుందరీకరణకు పాల్పడిన కార్యకర్తలు అంతకుముందు చేస్తున్న 6 వ నంబరు కాల్వ అపార్ట్మెంట్ల నడిమి చోటికి వెళ్లడమూ,
ఎన్నాళ్ళనుండో నాని - చివికిపోయిన తూర్పు ప్రక్క డ్రైన్ లోని పాత గుడ్డల – డైపర్ల - ఆహార వ్యర్ధాల మూటల్ని వెదకి వెదకి, దంతెలతో లాగి లాగి, ఆ ఘాటు దుర్గంధాన్ని పీల్చి పీల్చి, చెపితే నమ్మరేమో గాని - సదరు తడి ప్లాస్టిక్ - ఎండు కట్టెల్నుండి కారే మురుగు బట్టలకూ ఒంటికీ అంటుకొని, వారిలో గతకాలపు ఒక అత్యున్నత ఉద్యోగి జారిపడినా పని మానక చేసి - చేసిన శ్రమకు నేను సాక్షీభూతుడిని!
[తెల్లారి, ఇక ఆ మురుగు కారే బట్టల్ని చూసుకొని ఆయన తుది సమావేశానికి ఆగక - ముందే నిష్క్రమించారు!]
ఎందుకోగాని – ఆ మురుగు ఓడుతున్న చెత్తను ఎప్పటిలా మాలెంపాటికి బదులు నల్లూరి ల్యాబ్ శ్రీను ట్రాక్టరులో సర్దడం చూశాను!
ఒక ప్రక్కన కార్యకర్తల రకరకాల చెత్త పనులూ, మరో ప్రక్కన ఎడతెగక ప్రయాణించే వాహనాల రద్దీ - 6.00 తర్వాత చూస్తే దుమ్మూ - మురుగులు అంటుకొన్న కార్యకర్తల బట్టలూ - ముఖాలూ!
పడమటి వీధి కార్యకర్త మస్తాన్ గారు గట్టిగా వినిపించిన శ్రమదాన నినాదాలతో ప్రారంభమైన 15 నిముషాల సమావేశంలో -
ఈ నాటి ఎన్నికలలో ఓట్లు వేయుట గుర్తు చేసి,
శనివారం నాటి సాయంత్రం “స్వగృహ” లో కేవలం కార్యకర్తల ప్రత్యేక సమావేశం గురించి,
ఆదివారం ఉదయం కూడ అదే హోటలు వద్ద కార్యకర్తల హాజరు గురించి, ఆరోజే హిందూ శ్మశానవాటిక సందర్శన, మొక్కలు నాటుట గూర్చీ - DRK గారు వివరించారు.
బృందావనుడు కార్యకర్తలకు 12 ఏళ్ల టీ షర్టులను, టోపీలను పంచాక - రేపటి వేకువ మనం కలిసేది కాసానగర కూడలి వద్ద అని నిర్ణయించారు!
ప్లస్ లకూ – మైనస్సులకూ
లెక్కలకూ - డొక్కలకూ, ప్లస్ లకు - మైనస్సులకూ
అతీతముగ గ్రామములో అద్భుత కృషి జరుగునపుడు
ఆ గ్రామము పౌరులలో అత్యధికులు రాకుంటే
అపఖ్యాతి పౌరులదా - ఆ గ్రామానిద చెప్పుడు!
- ఒక స్వచ్ఛ కార్యకర్త
05.11.2026