పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
మోపిదేవి మండల హైవేలో 38 మంది బాధ్యతలు @4007*
అంటే - అది కాసానగరం చెక్ పోస్టు వద్ద, చల్లపల్లికి ముఖద్వారం లాంటి NH 216 జంక్షన్ లెండి! ఐతే ఆ శ్రమదానం షో కోసం నాలుగు మంచి ఫోటోలు దిగి, ప్రపంచానికి ప్రదర్శించుకొనేది మాత్రం కాదు, 38 మంది వేకువ 4 :20 - 6:06 నడిమి సమయంలో ఊరికి 2 -3 కిలోమీటర్ల ఎడంగా 45 గంటల పాటు ఇష్టపడి చేసిన కష్టం!
పైగా అక్కడ గత 2-3 వారాల నుండి సాధనాల సతీష్ అనే ఒక దారు శిల్పి తన నైపుణ్యాన్ని ప్రదర్శించి, మనకోసం మనం ట్రస్టు చేసిన “ల” కారాల ఖర్చుతో ప్రతి అంగుళాన్నీ సౌందర్యమయం చేసిన జంక్షన్!
ఇక స్వచ్ఛ కార్యకర్తల గురించి ప్రత్యేకించి చెప్పవలసింది మాత్రం ఏమున్నది? ఏ DRK వైద్యుడో పిలిచినంత మాత్రాన ఊరి కోసం నాలుగైదు లక్షల పని గంటలు శ్రమించడానికీ, పేడా-పెంటా-చెత్తల పనులు చేయడానికీ అనాలోచనతో వెళ్లే అమాయక బాల బాలికలా వాళ్లు? నిజంగా ఆ బాపతు అల్లాటప్పా కార్యకర్తలే ఐతే -
ఈ పన్నెండేళ్ల అకుంఠిత శ్రమదానం సాధ్యపడేదా? ఈ 32 వేల చెట్లు ఊర్లోనూ - చుట్టూ 7-8 రహదార్ల ప్రక్కలా ఇంత దట్టంగా క్రమ్ముకొనేవా? శ్మశానాలో - ఉద్యానాలో అని తెలియనంతగా ఎక్కడెక్కడి సందర్శకులనో ఆకర్షించేవా? ఈ శుభ్రమైన వీధులూ, ఎదురు తన్నక మర్యాదగా నడిచే డ్రైన్లూ, ఇన్ని రహదారి మినీ ఉద్యానాలూ చల్లపల్లి ప్రజలు చూడగలిగే వారా?
లేదు - ఈ శతాధిక స్వచ్ఛ కార్యకర్తలు చల్లపల్లి భవితవ్యం మీద అవగాహన కలిగి,సొంత బుర్రలు వాడుకొనే వాళ్లు, గ్రామం పట్ల - విశాల సమాజం పట్ల - నానాటికీ దిగజారుతున్న పర్యావరణం పట్ల బాధ్యత కలవాళ్లు!
అందు చేతనే ఈ వేకువ తలా గంటన్నర తమ అమూల్య సమయాన్ని వెచ్చించి... అందాలారబోస్తున్న ఆ 5-6 సెంట్ల కూడలిలో చీపుళ్లతో ఊడ్చారు,
వీధి మార్జిన్ల పిచ్చి చెట్లను తొలగించారు, గోకుడు పారలతో గడ్డిని చెక్కారు,
డిప్పలకొద్దీ దుమ్మూ - ఇసుకల్ని చెత్త ట్రాక్టర్ లోకి కొంత బట్వాడా చేశారు, అక్కడక్కడా రోడ్డు ప్రక్క కొద్దిపాటి పల్లాలను పూడ్చారు.
డివైడర్లలోని పూల మొక్కల్ని, పాదుల్ని సరిజేశారు,
ప్రతి ఒక్కరూ ఇష్టపడి, బాధ్యతగా పూనుకొనుట వల్లనే - వాళ్లకు ఈ పనులు బోరు కొట్టవు, అలసిపోయి “ఛ - రేపటి నుండి మానేస్తా” అనుకోరు!
RMP శేషు గారు నేటి నినాదాలు ప్రకటిస్తే –
రేపటి - ఆదివారం నాటి కారక్రమాలను DRK గారు మరొకమారు వివరిస్తే -
ఒక స్థానిక గుప్తదాత 2500/- నూ, బెజవాడ గుప్తదాత 5,000/- నూ నేను మేనేజింగ్ ట్రస్టీ గారికి ఇచ్చుకొనగా –
రేపటి వేకువ కూడ ఈ కాసానగర కూడలి వద్దనే కలవాలనే నిర్ణయంతో నేటి శ్రమదానం ముగిసింది!
వింతలు చూస్తుంటినిపుడు!
శ్రమదాతల పనులు చూసి చిన్న చిన్న కుర్రవాళ్ళు
ఎగతాళిగ నవ్వి నవ్వి, ఏవో కొంటె మాటలనిన
పరిస్థితులు ఇపుడు లేవు - ఫక్కున నవ్విన వాళ్ళే
వీధులూడ్చి, చెట్లు నాటు వింతలు చూస్తుంటినిపుడు!
- ఒక స్వచ్ఛ కార్యకర్త
06.11.2026