పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
పెట్టి పుట్టాలి ! అదృష్టం ఉండాలి!!(@4008*)
ఈ శనివారం - 07-11-26 నాటి శ్రమ దాన మహోత్సవంలో పాల్గోనాలంటే! అది గనుక ‘ఉత్సవం’ ఐతే - పాల్గొన్న అదృష్ట జాతకులు, 52 మంది! ప్రతి వేకువా
గంటన్నర కాలం చాలదను కొని, 4:20కే మూడు- నాలుగు కిలోమీటర్ల దూరాన - చల్లపల్లి & మోపిదేవి మండలాల సరిహద్దున- కాసానగర కూడలిలో జాతీయ రహదారి దుమ్ము దులిపి, శుభ్రపరచ జూచిన వారు 22 మంది సుమా!
మిగిలిన నాబోటి 30 మందీ సైకిళ్లో-మోటారు బళ్లో వేసుకొని వెళ్లి, కరువు తీరా రకరకాలుగా శ్రమించిన వాళ్లన్నమాట!
తమది కానే కాని 250 గజాల NH216 ను 30 రోజులుగా సుందరీకరిస్తూ-3 రోజులుగా వంకపెట్టజాలని విధంగా శుభ్రపరస్తూ-“ఇంకా ఎక్కడైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు మిగిలాయా - రోడ్డుకు పేడ మరకలు పూర్తిగా తొలగిపోయాయా- డివైడర్ల పూల బాలికలు చిరునవ్వులు చిందిస్తున్నాయా- అసలీ జంక్షన్ ను చూసిన ఏ అగంతకుడికైనా “ఇది స్వచ్ఛ శుభ్ర ఆనంద- హరిత - సుందర చల్లపల్లి సుమా!” అనితక్షణం స్ఫురిస్తుందా.. అనేలా కార్యకర్తల దీక్షా దక్షతలను దగ్గరగా చూసే అదృష్టం ఏదో ఒకరిద్దరికి తప్ప- కాసానగర జనులకే పట్టలేదు!
పని ముగిసిన 6:10 కు ఒక రైతు కార్యకర్త “అదుగో- రహదారి నడుమ బెత్తెడు ఎండు పేడ చితక మిగిలిపోయింది” అనడమూ, మరో పురచేతి రైతు వెనకకుపోయి, దాన్ని తొలిగించి రావడమూ – ఇది చాలదా చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ స్వభావాన్ని తెలియజెప్పడానికి?
6:10 దాక ఇన్ని రకాల శుభ్ర సుందరీకరణలు జరిగాక, తమశ్రమతో ఈ ప్రాంతమెంత కనులవిందుగా తయారైనదో తృప్తిగా మళ్లీ మళ్లీ చూసుకొన్న తర్వాత –
అందరూ ఆజంక్షన్ లోనే క్రమశిక్షణతో నిలబడి, ఈ కూడలి సౌందర్య సృష్టి కర్త సాధనాల సతీష్ నినాదాలకు స్పందించి,
రేపటి ఉదయం 5:30కు అందరూ 12 ఏళ్ళ టీషర్టులూ, టోపీలతో ఇక్కడనే కలవాలనీ, విశిష్ట అతిథులతో బాటు గ్రామ వీధులందు స్వచ్ఛ కవాతుగా హిందూ శ్మశాన వాటికలో మొక్కలు నాటి, స్వగృహ హోటల్ లో సమావేశమవ్వాలనీ,
ఈ సాయంత్రం మాత్రం కేవలం కార్యకర్తలే 5:00 కు అదే సమావేశమందిరంలో కలవాలనీ... DRK డాక్టరు గారి మాటలంగీకరించారు!
కోడూరు వారి, అంబటివారి, N.శివకుమారిగారి- మొత్తం11,040/- ధనం ట్రస్టు పక్షాన డాక్టరు గారు స్వీకరించారు!
సలాం గిరీ చేస్తున్నా!
అయ్యా – కార్యకర్తలార! అన్ని ఏళ్లు శ్రమలు చేసి
పెంచిన చెట్లను ఎవడో పెంకివాడు త్రుం చేస్తే
నిరాశా - నిస్పృహ చెందక మరల మరల నాటే మీ
సహనము - సౌజన్యానికి సలాం గిరీ చేస్తున్నా!
- ఒక స్వచ్ఛ కార్యకర్త
07.11.2026