పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
4009*- దీపావళి పండుగ నాటి శ్రమదానోత్సవం!
అది ఒక మేజర్ పంచాయతికి పన్నెండేళ్ల ఎడతెగని శ్రమానుబంధ సూచకం! వేకువ 5:20 మొదలు 10:00 దాక పుష్కరకాలపు అనుభవ సింహావలోకనం! గ్రామ బాధ్యతల కంకితమైన ఒక మంచి కుటుంబ త్యాగ సంకేతం! స్వచ్ఛ కార్యకర్తల, శ్రమదానోద్యమ నిర్వాహకుల శ్రమ సమయ –అర్ధ దానాల విజయకేతనం!
ఇప్పటికిది గ్రామ శ్రమ వార్షికోత్సవాలలో 12వది! ఈ ఊరి స్ఫూర్తితో 30కి పైగా చోట్ల 100 నుండి 1000 రోజులుగా జరిగి, ప్రస్తుతానికి ఒకటి-రెండు గ్రామాలకే పరిమితమైనది! కలలలో- కథలలోని కల్పనలు ఒక్క చల్లపల్లిలో మాత్రమే సాకారమౌతున్న యదార్ధమిది!
ఈ శ్రమదాన వార్షికోత్సవ వేడుక ఊరికి 2½ కిలోమీటర్ల దూరాన- కాసానగర కూడలిలో ప్రారంభమై, NH216 మీదుగా, గంగులవారిపాలెం వీధి గుండా హిందూ శ్మశాన వాటికకు చేరుకొని,
అక్కడ అతిథులూ, పెద్దలూ, కార్యకర్తలూ కొన్ని మొక్కలు నాటి, కొన్ని అడ్డంకులూ, 2 తుఫానులూ కారణాలుగా నాదెళ్ల వేణు గారు, కలెక్టరు గారు సమకూర్చిన 20 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డును పరిశీలించి,
తిరిగి బైపాస్ వీధి గుండా స్పగృహ ఫంక్షన్ హాలుకు చేరుకొని అచట మరొక మారు నందేటి శ్రీను గాన చాతుర్యమును చవిచూసి,
ముందుగా డి.ఆర్. కె. గారి పన్నెండేళ్ల స్వఛ్ఛ – శుభ్ర హరిత చల్లపల్లి శ్రమ ప్రస్థాన వివరమును అలకించి,
కార్యకర్తల అంకిత స్వభావాన్నీ- ఐదు లక్షల పని గంటల శ్రమదానాన్నీ- ఈ గ్రామ వికాసం కోసం దాసరి కుటుంబమూ, దాతలు చేసిన ఆర్థిక సహకారాన్నీ విని ఆశ్చర్యపడి,
డాక్టరు పద్మావతి గారి, ఊరు గురించిన క్రొత్త స్వప్నాలకు సంతోషించి ఆ తరువాత - ఈ గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ ప్రధాన ప్రేరకులైన MLA. బుద్ద ప్రసాదుగారి సందర్భోచిత- సముచిత సందేశము నందుకొని,
గంటకుపైగా సాగిన ఉపన్యాసాల సారాంశమును మననం చేసుకొంటూ,
అడపా రాంబాబు గారి సురుచిర అల్పాహార ఆతిథ్యమును సుమారు140 మందీ ఆస్వాదించి,
స్వగృహ ఫుడ్ జంక్షన్ ఆనంద్ గారు అద్దె ఫ్రీగా స్వచ్చోద్యమానికి ఇచ్చిన అందమైన A/C హాలులో 2 ½ గంటలు గడిపి,
రేపటి మన శ్రమదానము విజయవాడ రహదారిలోనే అని తెలుసుకొని ముగిసినది!
చారిత్రక పునరావృతి
కందుకూరి వీరేశం కథ గుర్తొస్తోంది నాకు
స్త్రీల కొరకు పోరాటం చేస్తుండగ – ఆ స్త్రీ లే
సంస్కరణలకు అడ్డుపడిన విషాదమే ఆ కథనము
చారిత్రక పునరావృతి జరగొద్దని ఆశిద్దాం!
- ఒక స్వచ్ఛ కార్యకర్త
08.11.2026