4010* వ రోజు.....           09-Nov-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

4010*వ శ్రమ పద్ధతుల్ని చెపుతా రండి!

               అవి దీపాల పండుగ మరునాటివి! అంటే తారీఖు ప్రకారం 9.11.26, వారాన్ని బట్టి మంగళవారం నాటివి! శ్రమ సమయంలో మార్పేమీ లేదు. చెప్పాపెట్టకుండా చటుక్కున శీతల కాలం వచ్చేసి, కాస్తంత చలి, మరికాస్త మంచూ పడినంత మాత్రాన, గ్రామ ముఖ్య కేంద్రానికి 2 కిలుమీటర్ల దూరమైనంత మాత్రాన కార్యకర్తలు వెనకడుగు వేయని వీధి మరమ్మత్తుల బాధ్యతలవి!

               “ఇదేమిటీ - ఈ పూట కేవలం 20 మందే కార్యకర్తలే కనిపిస్తున్నారు” అని నేను 5.10 సమయంలో అనుకొన్నాను గాని ఆ ½ కిలోమీటరు బారునా - కరెంటు లేక, మంచూ - చీకటీ సమయాన తూర్పు డ్రైను ఒడ్డున కూర్చొని, దంతెలతో, బారు కర్రలతో అసహ్యకరమైన కంపుగొట్టే చెత్తను లాగి, ప్రోగులు పెట్టే వాళ్లూ,

చిన్న కార్ల రిపేరు షెడ్డు ప్రాంతంలో బహుశా దీపావళి బాణ సంచా అవశేషాలను ఊడుస్తున్న కార్యకర్తలూ,

               రహదారి తూర్పు మార్జిన్ ఎగుడు దిగుడుల్ని పారలతో చెక్కి సమతలం చేస్తున్న కాసానగర కార్యకర్త దాసు గారితో సహా 5 గురినీ,

               నారాయణరావు నగర ప్రవేశమార్గం దాకా చప్పుడు లేకుండ పనిచేసుకుపోతున్న బొందలపాటి నాగేశ్వరుని వంటి నలుగుర్నీ సరిగా లెక్కించలేకపోయాను! తీరా 6.20 వేళ – బృందావన భవనాల వీధి మొదట్లో సమావేశమప్పుడు చూద్దును గదా  -  ఆకుల భరత్ అనే కార్యకర్త 2 రకాల - మొత్తం 6 నినాదాలను చెప్పిన మొత్తం కార్యకర్తలు 31 మంది!

               ఈ ఉదయం సమావేశ ప్రారంభం ఆలస్యానికి కారణం ‘ప్రసాదు’ అనే పేరుగల ఇద్దరు కార్యకర్తలు! ప్రత్యేకంగా ఆ ఇద్దరి కోసం 3 మార్లు గట్టిగా విజిలు ఊదితే గాని వాళ్లు పని విరమించలేదు! వాళ్ల మరరంపపు మ్రోతలేమిటో - ఒక ఎడం చేయి వాటం కొమ్మల నరుకుడేమిటో!

నేటి సమావేశంలోని ముఖ్యాంశాలివి!

1. పేర్లెందుకుగాని - మురుగ్గుంట పనులు చేసి, వచ్చి, దగ్గరలో నిలబడి, కాఫీ త్రాగుతున్న ముగ్గురి నుండి ఇంకా క్రుళ్లు కంపు వస్తూనే ఉండడం,

2. ఉద్యమ ఖర్చుల నిమిత్తం –

               A) విశ్రాంత చెక్ పోస్టు ఉద్యోగి దాసు గారి నుండీ,

               B) దేసు మాధురి గారికి రోడ్డు మీద దొరికినవీ కలిపి DRK గారికి మొత్తం1050/- ముట్టడం,

               నిన్నా మొన్నటి సభల గురించి కార్యకర్తలు అభిప్రాయ సేకరణ,

               రేపటి మన వీధి బాధ్యతలు కోసం బెజవాడ రోడ్డులోని బృందావన భవనాల వద్దనే కలవాలనే నిర్ణయమూ!

               8 &9 -11-26

ఇది దసరా – దీపావళి - ఏరువాక కాదు సుమీ

గ్రామ దేవతల కొలుపులు అంతకన్న కావు గాని –

ఆ అన్నిటి మించిపోవు అత్యుత్తమ శ్రమదానపు

ప్రతి ఊళ్లోజరుపదగిన పన్నెండేళ్ల పెను పండగ!

- ఒక స్వచ్ఛ కార్యకర్త

    09.11.2026