4016* వ రోజు.....           15-Nov-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

56+6 గురి శ్రమ - సమయదానాలు! @4016*

               ఈ ఆదివారం (15-11-26) వేకువ కూడా స్వచ్చోద్యమకారుల ప్రయత్నం - బెజవాడ మార్గమందలి బాలాజి భవన విభాగాల వద్దనే - ఖచ్చితంగా 4:20 కే – 22 మందితో ప్రారంభమయింది. ఐతే – బహుశా 50 మంది వస్తారనుకొంటే 56 గురు తమ గ్రామ బాధ్యతలు పంచుకొన్నారు, మరి 6 గురు తుది సమావేశంలో పాల్గొన్నారు!

               ఇలా 62 మందిని చూస్తుంటే - శక్తిని కూడ దీసుకొని రాయపాటి రాధాకృష్ణుని గ్రామ బాధ్యతా ప్రతిజ్ఞలు వింటుంటే - ప్రతిస్పందిస్తున్న మిగిలిన వారి ముఖాల్లో పట్టుదలను పసిగట్టుతుంటే.....

               “పరవా లేదు - పుష్కర కాలం దాటినా గ్రామ బాధ్యతల్ని గురించి ఆలోచించే కార్యకర్తలకు ఈ ఊళ్లో కొదవ లేదు, శ్రమదానోద్యమం వసివాడ లేదు, చల్లపల్లి పరిశుభ్ర – హరిత - సౌందర్యాల భవిష్యత్తుకు ధోకా లేదు, ఊరి ప్రజల్లో సామాజిక బాధ్యతా గుణం పెరుగుతూనే ఉన్నది” అనిపించింది.

               “ఎక్కువగా వృద్ధులూ, విరమిత ఉద్యోగ విధుల వారూ, ప్రస్తుతోద్యోగులు తప్ప యువకులు చాలినంత మంది పాల్గొనడం లేదే” అనే చింత కూడ తగ్గింది!

               “ఎన్ని గజాల బెజవాడ రోడ్డు ఈ వేకువ బాగుపడింది? 50 గజాల పడమటి డ్రైన్ మాత్రమేనా శుభ్రపడింది? ఈ వీధి జనంలో 10 మందేనా పాల్గొనేది? ఇలా ఐతే వక్కలగడ్డ పొలిమేర దాక ఇంకెన్ని రోజులకు శుభ్రపడుతుందో...” అనే ప్రశ్నలెందుకు?

               దేశంలో మరెక్కడా జరగనంత సుదీర్ఘకాల స్వార్ధరహిత సామాజిక శ్రమ కనీసం చల్లపల్లిలోనైనా జరుగుతున్నది గదా – ఈ దీపం వల్ల 30-40 గ్రామాల్లోనూ శ్రమదాన దీపాలు వెలిగాయి కదా - 12 ఏళ్లకు కాకపోతే 20 ఏళ్లకైనా చల్లపల్లి కార్యకర్తల స్వప్నం ఋజువౌతుంది కదా....” అని సంతోషించాలి!

               ప్రజలు అన్ని చోట్లా జరుపుకొనే దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్ట్ మస్, రంజాన్ వంటి పండుగలు సరే - సొంతానికి కాక – గ్రామ సమాజమంతటికీ పనికొచ్చే ఇలాంటి శ్రమదాన పండుగ గదా ఇప్పుడు దేశానికి కావలసింది?

               ఈ ఉదయం 2 గంటల కాలంలో పనులెలా జరిగాయో, ఎన్ని వ్యర్ధాలు తొలిగాయో..... మురుగు కంపు ఎంత తగ్గిందో వంటి సంగతుల కోసం –

1) శంకర శాస్త్రీయ, తూము వెంకటేశ్వరీయ ఛాయా చిత్రాల్ని పరిశీలించండి.

2) బాలాజీ ఆపార్ట్మెంట్ నడవాలో జరిగిన సభలో DRK డాక్టరు గారి, దాసరి స్నేహ గారి, స్థానిక మహిళ గారి వీడియో ప్రసంగాలు వినండి!

               రేపటి వేకువ శ్రమదానం కూడ బెజవాడ దారిలోని బాలాజి అపార్ట్మెంట్ దగ్గరే ప్రారంభమగునని గుర్తుంచుకొండి!

               రేపు మరింత మంది క్రొత్త వారు వీధి శ్రమలో పాల్గొనండి!

     పసిపాపలమా - పశుతుల్యులమా

 శాస్త్రజ్ఞుల మాటల్లో సత్యాన్ని గ్రహించలేని

 క్యాన్సర్ కారక ప్లాస్టిక్ గరళం మ్రింగేయుటకు

 మన ప్రియ భూమాత నిపుడె మసిగా మార్చేందులకు

 పసిపాపలమా మనము పశుతుల్యులమా మనము?

- ఒక స్వచ్ఛ కార్యకర్త

    15.11.2026